సినిమాలు... వెబ్ సిరీస్‌లు... వీడియో ఆల్బమ్స్‌లో నటిస్తూ బాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోంది ఊర్వశీ రౌతెల. వేదిక ఏదైనా తనదైన ప్రతిభతో దూసుకెళుతోన్న ఈ బ్యూటీ త్వరలో టాలీవుడ్ తెరపై కూడా మెరవనుంది. ఇలా తన అందం, అభినయంతో సినిమా ఇండస్ట్రీలో రాకెట్ వేగంతో దూసుకెళుతోన్న ఈ అందాల తార తాజాగా ఓ అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. ‘వరల్డ్ టాప్-10 సెక్సీయెస్ట్ సూపర్ మోడల్స్ 2021’ జాబితాలో చోటు దక్కించుకుందీ ముద్దుగుమ్మ. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ, ఆసియా మహిళగా రికార్డు సృష్టించింది.
మోడలింగ్‌లో మెరుపులు!
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్‌లో పుట్టి పెరిగింది ఊర్వశి. ఆమె తల్లి పేరు మీరా రౌతెల. తండ్రి మన్వర్ సింగ్ రౌతెల. యూనివర్సిటీ ఆఫ్ దిల్లీ నుంచి డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 15 ఏళ్లకే ప్రఖ్యాత ‘విల్స్ లైఫ్‌స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్’ లో పాల్గొని సత్తా చాటింది. 2009లో ‘మిస్ టీన్ ఇండియా’ కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత ప్రతిష్ఠాత్మక లాక్మే ఫ్యాషన్ వీక్, దుబాయి ఫ్యాషన్ వీక్, బాంబే ఫ్యాషన్ వీక్‌లలో పాల్గొని షో స్టాపర్‌గా నిలిచింది. ఇక 2011ను ఊర్వశి మోడలింగ్ కెరీర్లో మరుపురాని సంవత్సరంగా చెప్పవచ్చు. ఆ ఏడాది ఆమె ‘ఇండియన్ ప్రిన్సెస్’, ‘మిస్ ఏషియన్ సూపర్ మోడల్’ టైటిళ్లతో పాటు మరే భారతీయ ముద్దుగుమ్మకు సాధ్యం కాని ‘మిస్ టూరిజం క్వీన్’ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇదే సమయంలో ఊర్వశికి బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘ఇషక్ జాదే’లో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. అయితే ‘మిస్ ఇండియా యూనివర్స్’ పోటీలపై పూర్తి దృష్టి సారించేందుకు ఆ సినిమా ఛాన్స్‌ను వదులుకుందీ బాలీవుడ్ క్వీన్.
వయసు వల్ల కిరీటానికి దూరం!
2012 ‘మిస్ ఇండియా యూనివర్స్’ పోటీల్లో విజేతగా నిలవాల్సిన ఊర్వశి వయసు కారణంగా ఆ కిరీటానికి దూరమవ్వాల్సి వచ్చింది. అప్పుడామె వయసు కేవలం 17 ఏళ్లు కావడంతో ఆ అందాల పోటీల్లో మిస్ ఫొటోజెనిక్ పురస్కారంతో సరిపెట్టుకుంది. ఈ పోటీల అనంతరం బాలీవుడ్‌లోకి ప్రవేశించి కొన్ని సినిమాల్లో మెరిసింది. ఇక 2015లో మళ్లీ ‘మిస్ ఇండియా యూనివర్స్’ అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. తద్వారా పోయిన చోటే వెతుక్కోవాలన్న సామెతను నిజం చేసి చూపించింది.
సినిమాలు, స్పెషల్ సాంగ్స్‌లతో!
2013లో ‘సింగ్ సాహెబ్ ది గ్రేట్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందీ సూపర్ మోడల్. ఆ తర్వాత ‘మిస్టర్ ఐరావత’ అనే కన్నడ చిత్రం ద్వారా దక్షిణాది ప్రేక్షకులను పలకరించింది. ఆపై ‘సనమ్ రే’, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘హేట్ స్టోరీ 4’, ‘పాగల్ పంతీ’, ‘వర్జిన్ భానుప్రియ’.. తదితర హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయమే కాదు మంచి డ్యాన్సర్‌గా కూడా పేరుతెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ‘కాబిల్’, ‘భాగ్ జానీ’ తదితర చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నటించింది. ఇక ఆమె ఆడిపాడి అలరించిన ‘లవ్ డోస్’, ‘లాల్ దుపట్టా’, ‘బిజ్లీ కా తార్’, ‘ఏక్ డైమండ్ ద హార్’, ‘వో చాంద్ కహా సే లావోగి’ వంటి మ్యూజిక్ ఆల్బమ్స్ ఊర్వశికి బాగానే గుర్తింపు తెచ్చిపెట్టాయి.
త్వరలో తెలుగు తెరపై!
ఇప్పటికే హిందీ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న ఊర్వశి త్వరలో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది. ‘స్నేహ గీతం’, ‘దొంగాట’ వంటి సినిమాలకు స్ర్కీన్‌ప్లే రైటర్‌గా పనిచేసిన మెహన్ భరద్వాజ్ తెరకెక్కిస్తోన్న ‘బ్లాక్ రోజ్’ అనే సినిమాలో టైటిల్ రోల్ పొషించనుందీ అందాల తార. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ సాంగ్‌ను చిత్ర బృందం ఇటీవల విడుదల చేసింది. ‘నా తప్పు ఏమున్నదబ్బా’ అంటూ సాగే ఈ పాటలో ఊర్వశి స్టెప్పులు తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి.
ఇది నాకు దేవుడిచ్చిన బహుమతి!
ఇప్పటికే ఎన్నో అందాల పోటీలు, ఫ్యాషన్ పరేడ్లలో సత్తా చాటిన ఊర్వశి.. గతేడాది అక్టోబర్‌లో ‘అరబ్ ఫ్యాషన్ వీక్’కు హాజరైంది. తన అందచందాలతో అక్కడి రెడ్ కార్పెట్‌ను హీటెక్కించిన ఈ ముద్దుగుమ్మ ఈ ఫ్యాషన్ పరేడ్‌లో పాల్గొన్న తొలి బాలీవుడ్ నటిగా గుర్తింపు పొందింది. తాజాగా ‘వరల్డ్ టాప్-10 సెక్సీయెస్ట్ సూపర్ మోడల్స్’ జాబితాలో స్థానం సంపాదించి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ, ఆసియా మహిళగా అరుదైన రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా తనను విజేతగా నిలిపిన అభిమానులు, ప్రేక్షకులకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిందీ ముద్దుగుమ్మ. ‘ఈ జాబితాలో నా పేరు చూసుకుని మొదట ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళను నేనే అయినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఈ గుర్తింపు కోసం నేనెలాంటి ప్రయత్నాలూ చేయలేదు. కేవలం నేను కోరుకున్న రంగంలో విజయం సాధించాలని బలంగా అనుకున్నాను. ఇది నాకు దేవుడిచ్చిన బహుమతి అనుకుంటున్నాను. ప్రపంచం నలుమూలల నుంచి నాపై ప్రేమాభిమానాలు చూపిస్తోన్న నా శ్రేయోభిలాషులు, అభిమానులకు మిలియన్ల ధన్యవాదాలు’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చిందీ అందాల తార.