మనసుకు నచ్చిన వారికోసం ఎంత దూరమైనా వెళ్తాం.. ఏమైనా చేయడానికి సిద్ధపడతాం.. వారికున్న అలవాట్లను మనం అలవర్చుకోవడానికీ వెనకాడం. అలా తాను కూడా చైతూ కోసం జిమ్‌కు వెళ్లడం అలవాటు చేసుకున్నానంటోంది టాలీవుడ్ బ్యూటీ సమంత. అతని కోసమే జిమ్‌లో జాయినయ్యానని, తద్వారా కొన్నాళ్లకు ఫిట్నెస్ లవర్‌గా మారిపోయానంటూ తన జీవితంలోని అతిపెద్ద సీక్రెట్‌ని బయటపెట్టింది. ప్రస్తుతం తమిళంలో తెరకెక్కుతోన్న ‘కాతువక్కుల రెండు కాదల్’ సినిమా చిత్రీకరణ కోసం చెన్నైలో ఉంటోన్న సామ్.. తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను అందరితో పంచుకుందీ ముద్దుగుమ్మ.
*అభిమాని : చాలా కాలం తర్వాత చెన్నైకి రావడం ఎలా అనిపిస్తుంది?
సామ్ : చెన్నైని ఎంత మిస్సయ్యానో ఇన్నాళ్లూ అర్థం కాలేదు. చాలా కాలం తర్వాత సొంత నగరానికి రాగానే ఎంతో సంతోషంగా అనిపించింది. నా తల్లిదండ్రులను, స్నేహితులను కలవడం ఆనందంగా ఉంది. చెన్నైలో షూటింగ్, తమిళంలో మాట్లాడడం బాగుంది.
*మీరు ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో మీకు బాగా నచ్చినవి?
‘ఓ బేబీ’, ‘ది ఫ్యామిలీ మ్యాన్ - 2’.. ఈ రెండు పాత్రలంటే నాకెంతో ఇష్టం.
*మీ 20 ఏళ్ల వయసుకు మీరు ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు?
యుక్త వయసులో ఉన్నప్పుడు నేను ఎన్నో పొరపాట్లు చేశాను. కాబట్టి ‘పరిణతి చెందు’ అని చెప్పుకుంటా.
*2020లో మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ జ్ఞాపకం ఏంటి?
రానా-మిహీక వివాహం (రానా పెళ్లిలో దిగిన ఓ అందమైన ఫ్యామిలీ ఫొటోను షేర్ చేసింది).
*మీకు బాగా నచ్చిన మూడు పుస్తకాలు?
నచ్చిన పుస్తకాలు చాలానే ఉన్నాయి. అందులో ‘Asterix and Obelix’ అనే పుస్తకం చిన్నప్పుడు నాలో ఎంతో స్ఫూర్తి నింపింది. అలాగే శాంతారామ్, మహాభారతం కూడా!
*వీగన్ డైట్, మొక్కల ఆధారిత ఆహారం.. ఈ రెండింటిలో మీరు ఏం తీసుకుంటారు?
నేను వీగన్‌ని కాదు.. మొక్కల ఆధారిత ఆహారమే తీసుకుంటా. అయితే ఏదో ఒక రోజు వీగన్‌గా మారాలని ఉంది.
*సోషల్ మీడియాలో ఎదురయ్యే విమర్శల్ని మీరెలా స్వీకరిస్తారు?
ప్రస్తుతం విమర్శలు నన్ను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టట్లేదు. కొంతకాలం క్రితం వరకూ నెగెటివ్ కామెంట్ల వల్ల నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. కానీ ఇప్పుడు నెట్టింట్లో నాపై వస్తోన్న విమర్శల్ని చూస్తే నవ్వొస్తుంటుంది.
*మీరు ఫిట్నెస్ లవర్‌గా మారడానికి కారణమేంటి?
ఇప్పటివరకూ ఎవరికీ తెలియని అతిపెద్ద రహస్యాన్ని చెబుతున్నాను. చైని కలవడం కోసమే నేను జిమ్‌లో జాయినయ్యాను. అలా నేను మొదటిసారి జిమ్‌కు వెళ్లడం ప్రారంభించా. అలా ఫిట్నెస్ అంటే క్రమంగా ఇష్టం పెరిగిపోయింది.
*ఒత్తిడి, ఆందోళనల్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి?
ధ్యానం, శ్వాస మీద దృష్టి పెట్టండి. ఈ రెండూ ఒత్తిడిని జయించడానికి నాకెంతగానో ఉపయోగపడ్డాయి. మీ శ్వాసపై మీకు నియంత్రణ ఉంటే జీవితాన్ని కూడా అదుపు చేసుకోగలుగుతారు.
*2021 తీర్మానాలేంటి?
ఎప్పటిలాగానే నన్ను నేను సంతోషంగా ఉంచుకునేందుకు రోజూ తప్పకుండా ధ్యానం, యోగా, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలనుకుంటున్నా. అలాగే మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవడం కొనసాగించాలనుకుంటున్నా.
*పాత విషయాలు గుర్తుచేసుకుంటారా?
నిజానికి నేను ఏ విషయమూ గుర్తుచేసుకోను. వర్తమానంలో గడుపుతా. ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నానా, లేదా అన్నది ఆలోచిస్తా.. అంతే!