మహిళలు ఇంటికి మహాలక్ష్ములంటారు.. ఆడవారిగా పుట్టడం అదృష్టమంటారు.. కానీ ఈ వివక్షా పూరిత ప్రపంచంలో స్త్రీగా బతుకుతున్నందుకు చాలా బాధగా ఉందంటోంది మాజీ మిస్ వరల్డ్ మానుషీ ఛిల్లర్. మహిళలపై జరుగుతోన్న లైంగిక హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ప్రారంభించిన #OrangeTheWorld అనే కార్యక్రమంలో భాగమైందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో స్త్రీలపై జరుగుతోన్న అన్యాయాలపై గళమెత్తింది. ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఎలాగైతే కలిసికట్టుగా పోరాటం చేస్తున్నామో.. అదేవిధంగా మహిళలపై జరుగుతోన్న హింసకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఈ ఉద్యమం కోసం సమష్టిగా పోరాడాలని పిలుపునిస్తోంది.
అందం, అంతకుమించిన ఆత్మసౌందర్యాన్ని తనలో నింపుకొని 2017లో ప్రపంచ సుందరిగా అవతరించింది హరియాణా బ్యూటీ మానుషీ ఛిల్లర్. ‘ప్రాజెక్ట్ శక్తి’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి.. దాని ద్వారా గ్రామీణ మహిళలకు నెలసరి పరిశుభ్రత - శ్యానిటరీ న్యాప్కిన్ల వాడకం ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తోన్న ఈ బ్యూటీ.. సందర్భం వచ్చినప్పుడల్లా మహిళా అంశాలపై గళమెత్తడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ క్రమంలోనే పలుమార్లు లింగ అసమానత, లైంగిక హింస, గృహ హింస.. వంటి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్న మానుషి.. తాజాగా మహిళలపై నెలకొన్న వివక్షా పూరిత ధోరణి గురించి మరోసారి గళమెత్తింది.
కలిసి పరిష్కరించుకుందాం!
మహిళలపై జరుగుతోన్న లైంగిక హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం (యూఎన్ విమెన్) #OrangeTheWorld అనే కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించింది. ఇందులో మానుషి కూడా భాగమైంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలపై జరుగుతోన్న హింస గురించి తన మనసులోని మాటల్ని ఓ వీడియోలో పొందుపరిచి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందీ చక్కనమ్మ.
‘ఈ ప్రపంచంలో ప్రతి చోటా మహిళలు వివిధ రూపాల్లో హింసకు గురవుతున్నారు. వీరిలో అన్ని వయసుల వారూ ఉన్నారు. ఇలాంటి సమాజంలో నేనూ ఒక స్త్రీగా బతుకుతున్నందుకు చాలా బాధగా ఉంది. ఇక ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో స్త్రీలపై జరుగుతోన్న లైంగిక హింసకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. గృహ హింస కేసులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఇలా విశ్వవ్యాప్తంగా నెలకొన్న ఈ సమస్యకు చరమగీతం పాడాలంటే మనందరం కలిసికట్టుగా ముందుకు రావాలి.. బాధితులకు అండగా నిలవాలి. వారు తమపై జరిగిన హింస గురించి ధైర్యంగా బయటపెట్టేలా వారికి భరోసా కల్పించాలి. ప్రస్తుతం ఎలాగైతే మనందరం కలిసి కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్నామో.. అలాగే మహిళల రక్షణ కోసం ఒక శాంతియుతమైన సమాజం నెలకొల్పేందుకు మనందరం కలిసి కట్టుగా కృషి చేయాలి..’ అంటోంది మానుషి.
అప్పుడు యునిసెఫ్‌తో..!
ఇలా నేడు మహిళలపై జరుగుతోన్న హింసకు వ్యతిరేకంగా యూఎన్ విమెన్‌తో చేతులు కలిపిన ఈ హరియాణా బ్యూటీ.. నెలసరి పరిశుభ్రత గురించి అందరిలో అవగాహన పెంచడానికి ఈ ఏడాది మేలో యునిసెఫ్‌తో ఏకమైంది. ఈ క్రమంలో ఆ సంస్థతో కలిసి ‘రెడ్ డాట్ ఛాలెంజ్’ పేరుతో ఓ ఆన్లైన్ ఇనీషియేటివ్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అరచేతిలో ఎర్ర చుక్క పెట్టుకున్న ఫొటోని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. ‘ప్రతి అమ్మాయీ తన శరీరం, వ్యక్తిగత పరిశుభ్రత గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి. అయితే ఇప్పటికీ కొంతమంది అమ్మాయిలకు నెలసరి, ఆ సమయంలో తమ పరిస్థితిని ఎలా మేనేజ్ చేసుకోవాలి? పిరియడ్స్ సమయంలో పరిశుభ్రంగా ఎలా ఉండాలి? తదితర విషయాల గురించి తెలియట్లేదు. అందుకే దీని గురించి వారి మనసులో నెలకొన్న అపోహల్ని తొలగించి వారిని సన్మార్గంలో నడిపించడంలో మనవంతుగా కృషి చేయాలి. ఆరోగ్యకరమైన పిరియడ్స్ దిశగా వారిని ప్రోత్సహించాలి..’ అంటూ మహిళలందరికీ ఈ ఛాలెంజ్‌ని విసిరిందీ క్యూటీ. దీనికి చాలామంది సెలబ్రిటీలు, సామాన్యులు సైతం సోషల్ మీడియా వేదికగా తమ మద్దతు తెలపడంతో అప్పట్లో ఈ ఛాలెంజ్ తెగ వైరలైంది.
ప్రస్తుతం మానుషి అక్షయ్ కుమార్ సరసన ‘పృథ్వీరాజ్’ సినిమాలో నటిస్తోంది. పృథ్వీరాజ్ చౌహాన్ జీవితకథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుందీ చిన్నది. ఇందులో యువరాణి సంయోగితగా కనిపించనుందీ మాజీ మిస్ వరల్డ్.