క్యాలెండర్ మారినా కరోనా మాత్రం ప్రపంచాన్ని వీడడం లేదు. కంటికి కనిపించకుండా, లక్షణాలు తెలియనివ్వకుండా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, కొత్త రకం ‘స్ట్రెయిన్’ అంటూ అందరినీ కలవరపాటుకు గురి చేస్తోందీ మహమ్మారి. దీని బారిన పడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించినా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. అదే సమయంలో ఇంకా మందు లేని ఈ మహమ్మారిని మనోధైర్యంతో జయిస్తున్నారు. సరైన సమయంలో వైద్యం తీసుకుని వైరస్‌పై విజయం సాధిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల కోలుకుంది. ఈ సందర్భంగా కొవిడ్‌కు సంబంధించి తన అనుభవాలను అందరితో షేర్ చేసుకుంది...
కరోనాను జయించి!
లాక్డౌన్లో పూర్తిగా ఇంటికే పరిమితమైంది రకుల్. ఆ తర్వాత నిబంధనలు సడలించడంతో పాటు సినిమా షూటింగ్‌లకు అనుమతినివ్వడంతో వరుసగా సినిమా షూటింగ్‌లకు హాజరైంది. ఈ క్రమంలోనే కరోనా బాధితుల జాబితాలో చేరిపోయిందీ ముద్దుగుమ్మ. గతేడాది డిసెంబర్ 22న కరోనా బారిన పడిన రకుల్ వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయింది. వైద్యుల సూచనలతో ఇంట్లోనే చికిత్స తీసుకుంది. వారం రోజుల తర్వాత డిసెంబర్ 29న మళ్లీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ అని తేలింది. ఈ క్రమంలో కరోనా విషయంలో తనకెదురైన అనుభవాలను అందరితో పంచుకుందీ పంజాబీ భామ.
మొదట అలసట అనుకున్నాను!
‘వరుసగా సినిమా షూటింగ్‌లు ఉండడంతో నేను గత కొన్ని నెలల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. ఒకరోజు సినిమా షూటింగ్లో ఉండగా బాగా అలసటగా అనిపించింది. అప్పటికే వరుస షూటింగ్స్‌లో పాల్గొనడం వల్లే నీరసంగా ఉండొచ్చని భావించాను. అదీ కాక... ప్రతి మూడు రోజులకు ఒకసారి సెట్లో సినిమా యూనిట్ సభ్యులందరికీ కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. కాబట్టి అలసట అనిపించినప్పుడు కరోనా సోకినట్లు అస్సలు భావించలేకపోయాను. అయితే ఓ రోజు ఎందుకైనా మంచిదని కరోనా నిర్ధారిత పరీక్షలకు వెళ్లాను. అక్కడ నాకు పాజిటివ్‌గా తేలింది. వెంటనే మా సినిమా యూనిట్ సభ్యులందరికీ ఈ సమాచారాన్ని చేరవేశాను. నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాను. మందు లేని ఈ మహమ్మారిని సానుకూల దృక్పథంతో జయిద్దామని నేను నిర్ణయించుకున్నాను.
ఇందులో భాగంగా ఇంట్లో ఉన్నప్పుడు ‘నాకు అంతా మంచే జరుగుతుంది. ఆరోగ్యంగానే ఉన్నాను. కొవిడ్‌ను జయిస్తాను’ అని నిత్యం నాకు నేను చెప్పుకున్నాను. దీని వల్ల నాలో నేను ధైర్యాన్ని నింపుకొన్నాను. చికిత్సా సమయంలో మెడిసిన్స్ కూడా ఎక్కువ మోతాదులో తీసుకోలేదు. కేవలం ఆరోగ్యకరమైన, పోషకాలున్న ఆహారాన్ని మాత్రమే తిన్నాను. నా ఆరోగ్యకరమైన జీవనశైలి, సానుకూల ఆలోచనల కారణంగానే కొవిడ్ నుంచి త్వరగా కోలుకున్నానని భావిస్తున్నాను’.
కరోనా చాలా నేర్పింది!
‘గతేడాది మనకు చాలా విషయాల్నే నేర్పింది. అందులో కరోనా కూడా ఒకటి. ఎంత డబ్బు, ఎంత పేరు ఉన్న వాళ్లయినా కొవిడ్ కారణంగా ఇళ్లల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. తద్వారా అందరూ సమానమే అనే సంకేతాన్ని ఇచ్చిందీ మహమ్మారి. వాసన, రుచిని కోల్పోయేలా చేసిన ఈ వైరస్ మనమేమిటో ఒకసారి మనకు తెలియజేసింది. రకరకాల రుచుల్ని ఆస్వాదిస్తున్న మనం కృతజ్ఞతతో ఉండాలనే విషయాన్ని చాటి చెప్పింది. అదృష్టం ఏమిటంటే కొత్త సంవత్సరాని కంటే ముందే నేను కొవిడ్‌ను జయించాను. మళ్లీ సినిమా షూటింగ్‌లతో బిజీ అయిపోతాను. ఇప్పటికే కరోనా కారణంగా పది రోజులు ఇంట్లోనే ఉన్నాను. దీంతో మరికొన్ని రోజుల పాటు విరామం లేకుండా పని చేయాల్సి ఉంటుంది. అందుకే కొన్నాళ్ల పాటు హైదరాబాద్‌ను విడిచివెళ్లాలనుకోవడం లేదు. ఇక కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్ అని తేలాక నా కోసం అమ్మ హైదరాబాద్‌కి వచ్చింది. నాన్న ఇక్కడే ఉన్నారు. వాళ్ల మధ్యే కొత్త ఏడాది సంబరాలు జరుపుకొన్నాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది రకుల్.
ఇక సినిమాల విషయానికొస్తే వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఓ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది రకుల్. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో మెప్పించిన ఆమె తొలిసారిగా డీగ్లామర్ రోల్లో ఓ పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. దీంతో పాటు నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘చెక్’ చిత్రంలోనూ ఈమె హీరోయిన్. వీటితో పాటు కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమాతో పాటు ‘మేడే’, ‘అటాక్’, ‘థ్యాంక్ గాడ్’ వంటి సినిమాల్లోనూ సందడి చేయనుందీ అందాల తార.