సాధారణంగా భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్లు... సినిమా కథలన్నీ హీరోల చుట్టూనే తిరుగుతుంటాయి. అందుకే ఏ చిత్రమైనా మొదట హీరో పేరే స్ర్కీన్‌పై దర్శనమిస్తుంది. ఆ తర్వాతే హీరోయిన్ పేరు కనిపిస్తుంది. అందుకే డైరెక్టర్లు కూడా హీరోలకు తగ్గట్టే కథలు సిద్ధం చేసుకుంటుంటారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఫార్ములా మారింది. హీరో ఉంటేనే సినిమాలు సక్సెస్ అవుతాయన్న సమీకరణాలకు సెలవు చెబుతూ పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు మన ముందుకొచ్చాయి. స్టార్ హీరోల సినిమాల కలెక్షన్లకు ఏ మాత్రం తగ్గకుండా వసూళ్లు సాధిస్తున్నాయి. అందుకే ఏటా ఈ మహిళా ప్రాధాన్య సినిమాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా కారణంగా సినిమా పరిశ్రమ కుదేలైన 2020లో కూడా కొన్ని మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు విడుదలై సత్తా చాటాయి. ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించి ఆకట్టుకున్నాయి.
‘థప్పడ్’
అనుభవ్‌సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మగవాళ్ల ఆధిపత్యాన్ని, మహిళలను చిన్నచూపు చూసే ధోరణిని తప్పుబడుతూ రూపొందిన ఈ సినిమా అందరినీ ఆలోచింపజేసింది. అమృత (తాప్సీ)ను తన భర్త ఒక సందర్భంలో అందరిముందు బహిరంగంగా చెంపదెబ్బ కొడతాడు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి సంతోషంగా కాలం గడుపుదామనుకున్న ఆమె ఆ సంఘటన తర్వాత ఆలోచనలో పడుతుంది. తనకంటూ ఓ సొంత వ్యక్తిత్వం ఉందంటూ భర్తను వ్యతిరేకిస్తుంది. విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కుతుంది. ఈ విషయంపై ఇంట్లో కుటుంబంతో, కోర్టులో భర్తతో పోరాడుతుంది. భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా సోషల్ మీడియాలో కొంతకాలం పాటు చర్చకు దారి తీసింది.
ఛపాక్

యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా ప్రముఖ మహిళా దర్శకురాలు మేఘనా గుల్జార్ ఈ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మాలతి అనే ప్రధాన పాత్రలో నటించింది. ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ ఒక వ్యక్తి మాలతి ముఖంపై యాసిడ్ పోస్తాడు. దీంతో ఆమె ముఖంతో పాటు జీవితం పూర్తిగా మారిపోతుంది. తన హక్కులను పరిరక్షించి న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయిస్తుంది. ఆ తర్వాత సమాజం గురించి పట్టించుకోకుండా తనను తాను అంగీకరించే ప్రయత్నంలో ఎదురయ్యే సమస్యలు అందరినీ ఆలోచింపచేస్తాయి. యాసిడ్ బాధితుల ఆవేదనకు ప్రతిరూపంగా నిలిచిన ఈ సినిమా జనవరి 10న విడుదలై విజయం సాధించింది.
గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్
భారతదేశంలోనే తొలి మహిళా యుద్ధ విమాన పైలట్‌గా సేవలందించిన గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. కరణ్‌శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించింది. 1999 కార్గిల్ యుద్ధంలో గుంజన్ పోరాటాలను, ఆ స్థాయికి చేరుకోవడానికి ఆమె పడిన కష్టాలను ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఆగస్టు 12న ఓటీటీ ద్వారా విడుదలైన ఈ సినిమాలో జాన్వీ నటన ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.
శకుంతలా దేవి
గణిత ఘనాపాటి శకుంతలా దేవి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అనూమీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విద్యాబాలన్ టైటిల్ రోల్లో నటించింది. సమాజంలోని అసమానతలు, సవాళ్లను దాటుకుని ‘హ్యూమన్ కంప్యూటర్’గా శకుంతలా దేవి ఎదిగిన తీరును ఈ చిత్రంలో చూపించారు. జులై 31న ఓటీటీ ద్వారా రిలీజైన ఈ సినిమాలో ఎప్పటిలాగే తన సహజ నటనతో ఆకట్టుకుంది విద్యాబాలన్.
పంగా
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జనవరి 24న విడుదలైంది. లేడీ డైరెక్టర్ అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వం వహించింది. జయ (కంగన) కబడ్డీ ఆడాలనే తన కలను పక్కనపెట్టి పెళ్లి చేసుకుంటుంది. అయితే 32 ఏళ్ల వయసులో మళ్లీ తన లక్ష్యం వైపు దృష్టి సారిస్తుంది. ఏడేళ్ల బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూనే కబడ్డీలో తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఈ ప్రయత్నంలో ఆమెకు ఎదురైన సవాళ్లను ఈ సినిమాలో చూపించారు.
బుల్బుల్
స్టార్ హీరోయిన్ అనుష్కా శర్మ నిర్మించిన ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమాజంలో ఆడవాళ్లపై ఉండే చిన్న చూపు, వారి హక్కులను హరించివేయడం వంటి సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా ఓ యువతి చేసే పోరాటమే ఈ సినిమా కథాంశం. బాలీవుడ్ వర్ధమాన నటి త్రిప్తి దిమ్రి ప్రధాన పాత్రలో నటించింది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న బుల్బుల్ సామాజిక అడ్డంకులను దాటి శక్తిమంతమైన మహిళగా ఎలా ఎదిగిందో ఈ సినిమాలో చూడొచ్చు. అన్విత్దత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
చోక్డ్
సమాజంలో వేళ్లూనుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థ వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో ఈ సినిమాలో చక్కగా చూపించారు.
బాలీవుడ్ బ్యూటీ సయామీఖేర్ లీడ్ రోల్లో నటించింది. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలను సమర్ధంగా నిర్వహించడంతో పాటు, సమాజంలో ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడే దిగువ మధ్య తరగతి మహిళ పాత్రలో సయామీ నటన అందరినీ ఆకట్టుకుంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 5 న విడుదలైంది.
రాత్ అకేలీ హై
మర్డర్ మిస్టరీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో రాధికా ఆప్టే, నవాజుద్దీన్ సిద్ధికీ ప్రధాన పాత్రల్లో నటించారు. సమాజంలోని మహిళలపై తరచూ జరిగే వేధింపులు, ఈ సమస్యలను అధిగమించేందుకు బాధితులు చేసే పోరాటాన్ని ఈ సినిమాలో చూపించారు. హనీ ట్రెహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.