‘ఈ అమ్మాయేంటి ఇంత పీలగా ఉంది.. కాస్త బొద్దుగా ఉంటే అప్సరసలా ఉండేది’, ‘ఆ డ్రస్సేంటి అసభ్యంగా.. వేసుకోవడానికి దుస్తులే లేనట్లు!’.. సోషల్ మీడియా వేదికగా ఏదైనా ఫొటో పోస్ట్ చేయాలంటే భయం.. కారణం ఎవరు ఇలా తమను నొప్పించేలా కామెంట్లు పెడతారోనని! ఎవరు తమ శరీరాకృతిని, అందాన్ని జడ్జ్ చేస్తారోనని! అయితే ఇలాంటి విమర్శల్ని ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదంటోంది బాలీవుడ్ అందాల తార అనన్యా పాండే.
చిన్న వయసులోనే ఇండస్ట్రీకి పరిచయమై.. నటిగా సక్సెస్ సాధించిన ఈ క్యూట్ గర్ల్.. సోషల్ మీడియాలోనూ తెగ చురుగ్గా ఉంటుంది. ఇందులో భాగంగానే తన ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్స్, వ్యక్తిగత-వృత్తిపరమైన అంశాల్ని ఎప్పటికప్పుడు పోస్టుల రూపంలో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే పలుమార్లు తానూ సోషల్ మీడియా ట్రోలింగ్‌ని ఎదుర్కొన్నానని, ఇలాంటి మాటలు యుక్తవయసులో ఉన్న వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందంటోంది అనన్య. ప్రస్తుతం మన వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన బాడీ షేమింగ్, విమర్శల గురించి తన అనుభవాలను ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుందీ బాలీవుడ్ బేబ్.
నటుడు చంకీ పాండే గారాలపట్టిగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. తన సొంత ప్రతిభతో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది అనన్య. గతేడాది ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. ‘పతీ ఔర్ పత్నీ’, ‘అంగ్రేజీ మీడియం’, ‘ఖాళీ పీలీ’.. వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోందీ బాలీవుడ్ బేబ్. ఇలా ఈ సినిమా ద్వారా తెలుగు వారినీ పలకరించేందుకు రడీ అవుతోందీ క్యూటీ.
నాకూ తప్పలేదు!
తన ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండడం అనన్యకు అలవాటు. ఈ క్రమంలోనే తన జీవితంలోని ప్రత్యేక సందర్భాలు, ఫొటోషూట్స్‌కు సంబంధించిన ఫొటోలతో పాటు ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్స్‌లో మెరిసిపోయిన ఫొటోలను సైతం ఇన్‌స్టాలో షేర్ చేసుకుంటుందీ బబ్లీ గర్ల్. అయితే ఇలా తన ఫొటోలు చూసి కొందరు సానుకూలంగా స్పందిస్తే, మరికొందరు విమర్శించేలా కామెంట్లు పెడుతుంటారని చెబుతోందీ బాలీవుడ్ అందం. ఇది తన ఒక్కదాని సమస్యే కాదని, ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి బాడీ షేమింగ్‌ని ఎదుర్కొంటున్నారని.. తద్వారా కామెంట్లు చేసిన వారు హ్యాపీగానే ఉన్నా.. వాటిని స్వీకరించిన వారు మాత్రం మానసిక వేదనకు గురవుతున్నారని చెబుతోంది.
అవే మనకు అందం!
ఈ క్రమంలోనే బాడీ షేమింగ్ గురించి తన మనసులో ఉన్న మాటల్ని ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంటూ నేటి యువతలో స్ఫూర్తి నింపింది అనన్య.
‘బాడీ షేమింగ్ అనేది సహించలేని అంశం. ముఖ్యంగా అవతలి వారు మాట్లాడే మాటలు యువత మనసులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. వీటి మూలంగా బాధితులు తమ పరువు పోయినట్లుగా ఫీలవుతున్నారు. అయినా ఇతరుల శరీరాకృతి, చర్మ ఛాయ ఎలా ఉంటే మీకెందుకు? వాటిని ఆధారంగా చేసుకొని ఇతరుల్ని కామెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? మనమంతా ఒకరికొకరం భిన్నంగా ఉంటాం.. మన శరీరాకృతి, ముఖ కవళికలు, చర్మ రంగు.. ఇవన్నీ వేర్వేరుగా ఉంటాయి. నిజానికి ఈ తేడాలే మనల్ని మరింత అందంగా కనిపించేలా, మనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా చేస్తున్నాయి. ఈ విషయం అర్థం చేసుకోకుండా ఇతరుల్ని కామెంట్ చేయడం, వారి ఆత్మవిశ్వాసాన్ని, విలువల్ని దెబ్బతీయడమే పనిగా పెట్టుకుంటున్నారు కొంతమంది. నిజానికి అది వాళ్ల దౌర్భాగ్యం.
ఆ లోకంలో నుంచి బయటికి రండి!
ఈ రోజుల్లో చాలామంది యువత సోషల్ మీడియా, ఇంటర్నెట్.. వంటివే లోకంగా బతికేస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ బుల్లీయింగ్ బారిన పడుతున్నారు. ఇలాంటివి చూస్తే నాకు ఒక్కోసారి కోపమొస్తుంది.. మరుక్షణం బాధనిపిస్తుంది.. కొన్నిసార్లైతే నాలో నేను నవ్వుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వీటివల్ల కలిగే బాధేంటో నాకూ అనుభవమే.. అలాగని ఈ వేధింపులకు బాధపడాల్సిన అవసరం లేదు.. వాటి గురించే ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి గురవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి ఎప్పుడూ సోషల్ మీడియాలోనే గడపడం కాకుండా.. మీకోసం మీరు కాస్త సమయం కేటాయించుకోండి.. మిమ్మల్ని ఎంతో ప్రేమగా, కేరింగ్‌గా చూసే మీ ఫ్యామిలీతో గడపండి. జీవితంలోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదించండి!’ అంటూ తన మాటలతో అందరిలో ప్రేరణ కలిగిస్తోంది అనన్య.
ఇదంతా చదువుతుంటే ఈ బాలీవుడ్ బ్యూటీ చెప్పినవన్నీ అక్షర సత్యం అనిపిస్తున్నాయి కదూ! కాబట్టి మనల్ని బాధపెట్టేలా మాట్లాడే వారి మాటలు పట్టించుకోకుండా మనమెలా ఉన్నా మనల్ని మనం స్వీకరించాలి.. నిజానికి ఇతరులు మనలో లోపాలు అనుకుంటున్నవన్నీ మన ప్రత్యేకతలే! ఏమంటారు? ఈ విషయంపై మీ స్పందనేంటో కింద ఉన్న కామెంట్ బాక్స్‌లో రాసి అందరితో పంచుకోండి..!