ప్రస్తుతం అందరూ ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్ దిశగా అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగా చాలామంది తమ ఆహారపు అలవాట్లను సైతం మార్చుకుంటున్నారు. మాంసాహారాన్ని పూర్తిగా మానేసి శాకాహారాన్ని తమ జీవన విధానంలో ఓ భాగం చేసుకుంటున్నారు. సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. ఈక్రమంలో మూగజీవాలంటే ఎంతో ప్రేమ చూపే శ్రద్ధా కపూర్ గతేడాది మాంసాహారాన్ని మానేసి పూర్తి శాకాహారిగా మారిపోయింది. అంతేకాదు.. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో పలు సందర్భాల్లో అందరితో షేర్ చేసుకుంటోంది. ఈక్రమంలో శాకాహారంపై తనదైన శైలిలో అవగాహన కల్పిస్తోన్న శ్రద్ధ చేస్తోన్న కృషిని ‘పెటా ఇండియా’ గుర్తించింది. అందుకే ఆమెను ఈ ఏడాదికి గానూ ‘హాటెస్ట్ వెజిటేరియన్’గా గుర్తించి సత్కరించింది.
‘హాటెస్ట్ వెజిటేరియన్’గా !
మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యమేంటో చెబుతుంది. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలి కొనసాగించాలంటే శాకాహారమే మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తుంటారు. ఇక మూగజీవాల హక్కుల కోసం పోరాటం చేస్తున్న పెటా ఇండియా కూడా శాకాహార జీవనశైలిపై బాగానే ప్రచారం కల్పి్స్తోంది. ఇందులో భాగంగా ఈ డైట్‌ను ఫాలో అవ్వడమే కాకుండా దీనిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న కొందరు సెలబ్రిటీలను ఎంపిక చేసి ‘హాటెస్ట్ వెజిటేరియన్లు’గా గుర్తిస్తుంది. అలా ఈ ఏడాదికి గానూ పెటా ఇండియా ‘హాటెస్ట్ వెజిటేరియన్’ సెలబ్రిటీలుగా బాలీవుడ్ నటీనటులు శ్రద్ధా కపూర్, సోనూ సూద్ నిలిచారు. గతంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, అమితాబ్ బచ్చన్, మానుషీ ఛిల్లర్, అనుష్కా శర్మ, అలియా భట్, సోనమ్‌కపూర్, కంగనా రనౌత్, రేఖ.. తదితర సెలబ్రిటీలు ఈ గుర్తింపును సొంతం చేసుకున్నారు.
అందుకే ఈ గౌరవం!
ఈ సందర్భంగా తమ అభిమానులు శాకాహారం తినే విధంగా ప్రోత్సహిస్తోన్న వీరిద్దరి కృషిని పెటా ఇండియా ప్రశంసించింది. ‘పండ్లు, కూరగాయల కారణంగా ఇప్పటివరకు ఎలాంటి రోగాలు వ్యాపించలేదు. అంతేకాదు ఈ శాకాహార జీవనశైలిని అలవాటు చేసుకుంటే ఎన్నో అనారోగ్యాలు దూరమవుతాయి. ఇందులో భాగంగా మా సంస్థ బహూకరించిన ఓ పుస్తకాన్ని చదివి మాంసాహారాన్ని విడిచిపెట్టారు శ్రద్ధ. అంతేకాదు మూగజీవాలంటే ఎంతో మక్కువ చూపే ఆమె ఎక్కడకు వెళ్లినా జంతువుల సంరక్షణపైనే మాట్లాడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక సోనూ సూద్ శాకాహారి అని అతని అభిమానులందరికీ తెలుసు. ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన మెక్‌డొనాల్డ్స్ తన మెనూలో మోక్ వీగన్ బర్గర్‌ను కూడా చేర్చాలన్న ప్రతిపాదనకు సపోర్ట్ చేశారాయన. అంతేకాదు తన కుమారుడితో క్రికెట్ ఆడుతున్న సమయంలో గాయపడిన పావురాన్ని కాపాడారు. శాకాహార జీవనశైలి గురించి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న వీరిద్దరినీ ‘హాటెస్ట్ వెజిటేరియన్లు’గా గౌరవిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని పెటా ఇండియా డైరెక్టర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
నచ్చితే తినేస్తా..!
అయితే గతేడాది శాకాహారిగా మారిన శ్రద్ధ తనకు ఆహారమంటే ఎంతో ఇష్టమని, తన సంతోషానికి అదే కారణమంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ‘నాకు ఆహారమంటే చాలా ఇష్టం. నా మనసుకు నచ్చిన పదార్థాల్ని తీసుకోవడానికి నేను ఎప్పుడూ ముందే ఉంటాను. నాకు వడాపావ్ నచ్చితే అదే తింటా.. ఆపై వర్కవుట్ కూడా చేస్తాననుకోండి. ఇక రాత్రుళ్లు సూప్‌తో సరిపెట్టుకుంటా. ఇలా నాకు ఏది ఎప్పుడు తినాలనిపిస్తే నిస్సందేహంగా వాటిని తినేస్తా.. అంతేకానీ ఆహారం విషయంలో నిబంధనలేమీ పెట్టుకోను. ఎందుకంటే ఆహారమే నాకు బోలెడంత ఆనందాన్ని అందిస్తుంది.. ఇక శాకాహారిగా మారిపోయాక ఈ సంతోషం రెట్టింపైంది. నా సంపూర్ణ ఆరోగ్యానికి, ఉత్సాహానికి ఇదే కారణం..!’ అంటోందీ ముద్దుగుమ్మ.
అందుకే ఆమెకు అంత ఫాలోయింగ్!
దిగ్గజ నటుడు శక్తికపూర్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రద్ధా కపూర్. ఆ తర్వాత తన అందం, అభినయంతో అనతికాలంలోనే అగ్రకథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ‘తీన్ పత్తి’, ‘ఆషిఖీ-2’, ‘ఏక్ విలన్’, ‘హైదర్’, ‘ఉంగ్లీ’, ‘ఏబీసీడీ 2’, ‘బాఘీ’, ‘రాక్ఆన్-2’, ‘హసీనా పార్కర్’, ‘స్త్రీ’, ‘చిచ్చోరే’, ‘స్ట్రీట్ డ్యాన్సర్-3’.. తదితర హిట్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందీ కపూర్ బ్యూటీ. ఇక తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిందీ బాలీవుడ్ అందం. పదేళ్లలో 21 చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియా ఫాలోయింగ్ భారీగానే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు మొత్తం 57.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాలో అత్యధిక పాలోవర్లు ఉన్న ఇండియన్ సెలబ్రిటీల్లో శ్రద్ధ మూడో స్థానంలో ఉండడం విశేషం. ఈక్రమంలో తన గ్లామరస్ ఫొటోలు, త్రోబ్యాక్ ఫొటోలు, వర్కవుట్ వీడియోలు, కుకింగ్ వీడియోల ద్వారా అభిమానులకు మరింత చేరువవుతోంది శ్రద్ధ. ఇదే సమయంలో మూగజీవాలంటే ఎంతో మక్కువ చూపే ఆమె తన పెట్‌డాగ్‌తో దిగిన ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంటుంది.