Photo: Instagram
ఇప్పుడు ఎక్కడ విన్నా- మెగా వారి ఇంట పెళ్లి సందడి వార్తలే వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ లో - మెగా డాటర్ నిహారిక, చైతన్యల పెళ్లి వేడుకలు కనువిందుగా జరుగుతున్నాయి. మెగా-అల్లు కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరడంతో ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చిరంజీవి పాటలతో సంగీత్!
ప్రి వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది. మెగాస్టార్ చిరంజీవి-సురేఖ, రామ్‌చరణ్-ఉపాసన, అల్లుఅర్జున్-స్నేహారెడ్డి, సుస్మిత, శ్రీజ, సాయి ధరమ్ తేజ్ తదితర మెగా-అల్లు కుటుంబ సభ్యులందరూ సరదాగా డ్యాన్స్ చేశారు. ఇక నిహారిక జిమ్ మేట్స్ అయిన రితూ వర్మ, లావణ్యా త్రిపాఠి కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు. ఈ సందర్భంగా కాబోయే దంపతులు నిహారిక-చైతన్య మెగాస్టార్ చిరంజీవి పాటలకు స్టెప్పులేశారు. మొదట ‘బావగారూ... బాగున్నారా!’ చిత్రంలోని ‘ఆంటీ కూతురా అమ్మో అప్సరా’ పాటకు స్టెప్పులేసిన ఈ జంట ఆ తర్వాత రామ్‌చరణ్, అల్లు అర్జున్ తదితరులతో సరదాగా కాలు కదిపారు. ఇక వేడుకల్లో భాగంగా తన చిట్టి చెల్లెల్ని భుజాలపై మోస్తు స్టెప్పులేశాడు వరుణ్ తేజ్.
‘బంగారు కోడిపెట్ట’ అంటూ!
పవన్ కల్యాణ్ తన కుమారుడు అకీరా నందన్‌తో కలిసి రావడంతో మెహెందీ సంబరాలు మరింత శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ‘బంగారు కోడిపెట్ట’ పాటకు చిరు-సురేఖలతో కలిసి సరదాగా స్టెప్పులేశాడు అల్లు అర్జున్. అల్లు అరవింద్-నిర్మల దంపతులు ‘రామ్మా చిలకమ్మ’ పాటకు డ్యాన్స్ చేశారు. ఇక ‘గ్యాంగ్ లీడర్’ పాటకు నాగబాబు, నిహారిక-చైతన్య కాలు కదిపి ఆకట్టుకున్నారు. దీంతో ఉదయ్‌పూర్ ప్యాలస్ తెలుగు పాటలతో హోరెత్తిపోయింది.
‘హల్దీ’ హంగామా!
పెళ్లి ముహూర్తానికి కొద్ది గంటల ముందు నిర్వహించే హల్దీ వేడుకల్లో నిహారిక-చైతన్య సంప్రదాయ పసుపు వస్త్రాలు ధరించి సందడి చేశారు. యెల్లో కలర్ శారీ, వైట్ కలర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్లో నిహారిక సూపర్బ్ అనిపించగా, యెల్లో కలర్ కుర్తా, వైట్ కలర్ పైజామాలో ఆకట్టుకున్నాడు చైతన్య. వధూవరుల కుటుంబ సభ్యులందరూ కాబోయే దంపతులకు పసుపు, గంధం రాసి ఆశీర్వదించారు.
ఆకట్టుకుంటున్న పెళ్లి కూతురి వీడియో!
ఈ సందర్భంగా నిహారికను పెళ్లి కుమార్తెను చేసిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసుకున్నారు నాగబాబు. తొలిరోజు వేడుకలంటూ అప్లోడ్ చేసిన ఈ వీడియోలో నిహారికకు మంగళ స్నానం చేయించడం, ముస్తాబు చేయడం, ఆమెను కుటుంబ సభ్యులంతా ఆశీర్వదించడం తదితర ఘట్టాలు ఉన్నాయి. అంతేకాదు ఈ కార్యక్రమం పూర్తయ్యాక వధూవరులు అందరితో కలిసి ఉత్సాహంగా కోలాటాలు ఆడడం ఇందులో చూడచ్చు. రంగు రంగుల పువ్వులు... తోరణాలు.. పిల్లల అల్లరి... కుటుంబ సభ్యులు సందడితో నిండిన ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
మెగా డాటర్ ప్రి వెడ్డింగ్ కార్యక్రమాలకు సంబంధించిన మరికొన్ని ఫొటోలు, వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ ముద్దుగుమ్మ పెళ్లి వేడుకల్లో చోటుచేసుకున్న ఆ అందమైన క్షణాలను మీరూ ఓ సారి చూసేయండి...!