Photo: Instagram
ఆమె 18 ఏళ్ల వయసులోనే ‘మిస్ ఆసియా పసిఫిక్’ లాంటి అంతర్జాతీయ అందాల కిరీటం గెలుచుకుంది. ఇక తన సినీ ప్రయాణం నల్లేరుపై నడకేనని భావించింది. సినిమా ఛాన్సుల కోసం పెద్దగా శ్రమపడాల్సిన పనిలేదనుకుంది. కానీ అన్నీ అనుకున్నట్లు జరిగితే అది జీవితమెందుకు అవుతుంది? అందుకే ఆమె కోరుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎన్నో అవస్థలు పడాల్సి వచ్చింది. ఆమె మరెవరో కాదు... హైదరాబాద్‌లో పుట్టి పెరిగి బాలీవుడ్ హీరోయిన్గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న దియా మీర్జా. అంతర్జాతీయ అందాల పోటీల్లో సత్తా చాటినప్పటికీ ఆమె సినిమా అవకాశాల కోసం ఎందుకు ఇబ్బంది పడిందో తెలుసుకుందాం రండి.
నా రంగు కారణంగా!
ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. శరీరాకృతి, అందం, బరువు, రంగు... తదితర కారణాలతో వివిధ అవమానాలకు గురవుతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే స్కిన్‌టోన్ పేరుతో అడుగడుగునా వివక్ష, అవమానాలు ఎదుర్కొన్నట్లు ఇప్పటికే చాలామంది సినీతారలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తన చర్మఛాయ కారణంగా తాను కూడా ఎన్నో సినిమాల్లో అవకాశాలు కోల్పోయానంటోంది దియామీర్జా. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె 2000లో ‘మిస్ ఆసియా పసిఫిక్’ కిరీటం అందుకుంది. ఆ తర్వాత ‘రెహ్నా హై తేరే దిల్ మే’, ‘తుమ్సా నహీ దేఖా’, ‘లగే రహో మున్నాభాయ్’, ‘క్రేజీ 4’, ‘లవ్ బ్రేకప్స్ జిందగీ’, ‘సంజు’, ‘థప్పడ్’ లాంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లు నిర్మిస్తూ, అందులో నటిస్తూ సత్తా చాటుతోంది. సినిమాలతో పాటు సామాజిక అంశాలు, మహిళా సమస్యలపై తనదైన శైలిలో స్పందించే ఆమె తన చర్మఛాయ కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో అందరితో షేర్ చేసుకుంది.
నా స్కిన్‌టోన్ నా కెరీర్‌కు అడ్డుపడింది!
‘సినిమా ఇండస్ట్రీలోని మూస ధోరణులు, ముందస్తు భావనలు మంచివి కావు. నా లుక్ వల్ల వృత్తిపరంగా ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను చెబుతున్న మాటలు మీకు కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు. కానీ ఇది నిజం. 2000లో నేను ‘మిస్ ఆసియా పసిఫిక్ అందాల కిరీటం’ గెలుచుకున్నాను. ఆ మరుసటి ఏడాదే ‘రెహ్నా హై తేరే దిల్ మే’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. ఇక నా సినిమా కెరీర్ సజావుగా సాగినట్టేనని అనుకున్నాను. కానీ నా స్కిన్‌టోన్ నా సినిమా కెరీర్‌కు అడ్డుపడింది. నలుపు, తెలుపు అన్నదానితో సంబంధం లేకుండా చర్మ ఛాయ కారణంగా కూడా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మహిళలు ఇబ్బందిపడుతున్నారని అప్పుడే తెలిసింది. ఇక్కడి కొన్ని మూస పద్ధతుల వల్ల నటించేందుకు అందరు మహిళలకు సమాన అవకాశాలు రావడం లేదు. అయినా నాకెంతో ఇష్టమైన సినిమా పరిశ్రమలో నేను కోరుకున్న లక్ష్యానికి చేరుకున్నాను’..
చిన్నప్పటి నుంచి నటనంటే ఇష్టం!
‘మోడల్‌గా కెరీర్ మొదలెట్టిన నాకు అనతి కాలంలోనే అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొనే అవకాశం రావడం, అందులో విజేతగా నిలవడమంటే చాలా పెద్ద విషయమే. ఇది నాకు ఓ స్వరాన్ని, వేదికను ఇచ్చింది. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దోహదం చేసింది. నాకిష్టమైన సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు ఒక మార్గాన్ని చూపించింది. ఒకవేళ నేను అందాల పోటీలో గెలవకపోయుంటే నా జీవితం ఎలా ఉండేదో నాకు తెలియదు. కానీ సినిమా ఇండస్ట్రీని మాత్రం వదిలేదాన్ని కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు నటనంటే చాలా ఇష్టం. స్కూల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాల్లో చురుకుగా పాల్గొనేదాన్ని. అదేవిధంగా మా అమ్మమ్మకి సినిమాలన్నా, కథలన్నా చాలా ఇష్టం. తను చెప్పిన ఎన్నో కథలను తిరిగి మా అమ్మ నాకు చెప్పేది. ఏ రంగమైనా మన సృజనాత్మకత, ప్రత్యేకతను చూపించినప్పుడు మనం కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. నేను కూడా ఈ విషయాన్ని గట్టిగా నమ్మాను. అదే పంథాను అనుసరించాను’ అని చెప్పుకొచ్చింది దియా.