Photo: Instagram
ఆడపిల్లలు చిన్నప్పుడు నాన్న వేలు పట్టుకొని నడిచినా యుక్త వయసులోకొచ్చాక మాత్రం అమ్మే ఆమెకు మంచి స్నేహితురాలవుతుంది. అటు వ్యక్తిగత జీవితంలో, ఇటు కెరీర్‌ని ఎంచుకోవడంలో ఏది మంచి, ఏది చెడు.. ఇలా అన్ని విషయాలను వారికి నేర్పుతుంది. తన కూతురిని ప్రోత్సహించడానికి అవసరమైతే తన కెరీర్‌నూ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుంది అమ్మ. ‘మా అమ్మ కూడా అలాంటి వ్యక్తే!’ అంటోంది బాలీవుడ్ అందాల భామ జెనీలియా డిసౌజా. నటిగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోమంటూ అమ్మ ఇచ్చిన ప్రోత్సాహమే ఇప్పుడు తననింత ఉన్నత స్థితిలో ఉంచిందంటోంది. తల్లిగా గైడ్ చేస్తూనే, ఓ మంచి స్నేహితురాలిగా ప్రతి అడుగులోనూ తోడైందంటూ తన కెరీర్ గురించి అమ్మ చేసిన త్యాగాన్ని తలచుకుంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది జెన్నీ. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ఈ పోస్ట్ పిల్లల కోసం తల్లి చేసే త్యాగాన్ని మరోసారి జ్ఞప్తికి తెచ్చిందనడంలో సందేహం లేదు.
అనుక్షణం పిల్లల మంచి కోసమే పరితపిస్తుంది తల్లి మనసు. ఇక పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆమె అందించే ప్రోత్సాహం, త్యాగం వెలకట్టలేనివి. తన తల్లి తన కోసం చేసిన త్యాగం కూడా ఎంతో గొప్పదని చెబుతోంది అందాల అమ్మ జెనీలియా. 2003లో నటిగా వెండితెరపై అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషా చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే పెళ్లి తర్వాత పూర్తిగా కుటుంబానికే పరిమితమైన జెన్నీ.. నటిగా తాను త్వరలోనే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు ఇటీవలే ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. అయితే తనకు ఇన్ని పేరుప్రఖ్యాతులు రావడం వెనుక అమ్మ ప్రోత్సాహం ఎంతగానో ఉందంటోందీ బాలీవుడ్ బేబ్. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా తన కోసం అమ్మ చేసిన త్యాగాన్ని తలచుకుంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టిందీ క్యూటీ.
ఉద్యోగం వదులుకుంది!
ఓ సందర్భంలో తన తల్లితో దిగిన అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న జెన్నీ.. ‘నా జీవితం గురించి ఆలోచించినప్పుడల్లా నేనెంత ముందుకెళ్లానో తలచుకుంటే అప్పుడప్పుడూ ఆశ్చర్యమేస్తుంటుంది. ఇక వృత్తి విషయానికొస్తే.. నటిగా సక్సెసవుతానని కలలో కూడా అనుకోలేదు. నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని. తొలిసారి నాకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పుడు ఇది ఒక మంచి అవకాశం అంటూ అమ్మ నన్ను ప్రోత్సహించింది. నా కోసం తన ఉద్యోగాన్ని సైతం వదులుకుంది. రోజూ నాతో పాటే సెట్స్‌కి వచ్చేది. నాకు ఈ రంగం పట్ల పూర్తిగా అవగాహన లేకపోయినా నా కెరీర్ గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంది మా అమ్మ.
అదంతా ఆమె చలవే!
నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో చాలా సినిమాల్లో నటించే అవకాశాలు నా తలుపు తట్టాయి. ఆ సమయంలో ఇటు కెరీర్లో నన్ను ప్రోత్సహిస్తూనే.. అటు చదువు పైనా దృష్టి సారించేలా చేసింది తను. ఆమె చొరవతోనే నేను నా డిగ్రీ పూర్తిచేయగలిగాను. అందుకు అమ్మకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఇలా పిల్లల్ని బాధ్యతగా, ప్రేమగా చూసుకునే విషయంలో ఈ లోకంలో మా అమ్మకు సాటి మరెవరూ లేరు.. ఆమె చేతి చలువను మించింది మరొకటి లేదు. ఈ విషయాల గురించి ఆలోచించినప్పుడల్లా ప్రస్తుతం నేను ఉన్నత స్థితిలో ఉన్నాననిపిస్తోంది. ఇందుకు కారణం అమ్మే!
నేను వేసే ప్రతి అడుగులోనూ తడబడకుండా ముందుకెళ్లగలుగుతున్నానంటే అదంతా అమ్మ నింపిన ధైర్యమే! ‘నీకు తోడుగా నేనున్నా.. ధైర్యంగా అడుగు ముందుకు వెయి.. ఈ క్రమంలో ఎలాంటి ఆటంకాలెదురైనా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్నిస్తాను..’ అంటూ అమ్మ చెప్పిన మాటల వల్లే! బాధైనా, సంతోషమైనా పంచుకుంటూ మనకంటూ ప్రత్యేకంగా సమయం గడపడంలో మనిద్దరం మంచి స్నేహితులం.. లవ్యూ అమ్మా! హ్యాపీ బర్త్‌డే!!’ అంటూ తన మనసులోని అందమైన భావాలను క్యాప్షన్‌గా రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ.