Photo: Instagram
బ్యాచిలర్ లైఫ్‌కి బై..బై చెబుతూ మరికొన్ని గంటల్లో మిసెస్‌గా ప్రమోషన్ పొందనుంది మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల. ఈ క్రమంలో మెగా కుటుంబంలో ముందస్తు పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివాహ ముహూర్తం దగ్గర పడుతుండడంతో మెగా-అల్లు కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకుంటున్నారు. వరుణ్ తేజ్ దగ్గరుండి తన సోదరి పెళ్లి పనులు చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో నిహారిక ప్రి వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది మెగా ఫ్యామిలీ. దీంతో ఇవి బాగా వైరలవుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
నిన్ను ప్రేమించే నాన్నగా!
గుంటూరు ఐజీ జె.ప్రభాకరరావు తనయుడు చైతన్య జొన్నలగడ్డతో కలిసి పెళ్లిపీటలు ఎక్కనుంది నిహారిక. ఇరు పెద్దల సమక్షంలో ఆగస్టులో వీరు ఉంగరాలు మార్చుకున్నారు. ఈనెల 9న రాత్రి 7.15 నిమిషాలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలస్ వేదికగా నిహారిక వివాహం జరగనుంది. ఈ క్రమంలో మరికొద్ది గంటల్లో తన కూతురు మరొక ఇంటికి కోడలుగా వెళ్లనున్న తరుణంలో నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా నిహారికను పెళ్లికూతురుగా అలంకరించిన సమయంలో తన అన్నావదినలతో కలిసి దిగిన ఓ ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘ఓ కుటుంబంగా నీకు మూలాలు అందించాం. నువ్వు ఎగరడానికి ఓ తండ్రిగా రెక్కలు ఇచ్చాను. ఆ రెక్కలు నిన్ను మరింత ఎత్తుకు తీసుకువెళ్తాయి. ఆ మూలాలు నిన్ను ఎప్పుడూ సంరక్షిస్తూనే ఉంటాయి. నిన్ను ప్రేమించే తండ్రిగా నీకు అందించే రెండు అద్భుతమైన బహుమతులివే. లవ్యూ నిహారిక’ అంటూ తన కూతురుపై ఉన్న ప్రేమకు అక్షర రూపమిచ్చారు.
ఆయన ప్రేమకు అవధుల్లేవు!
దీంతో పాటు పెదనాన్న చిరంజీవితో కలిసి నవ్వులు చిందిస్తూ నిహారిక దిగిన సెల్ఫీ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘ఆయన ప్రేమ... సమయం, వయసు అనే సరిహద్దులను దాటేసింది. ఆయన చిరునవ్వు ప్రతి సందర్భాన్ని ఓ పండగలా మార్చుతుంది’ అంటూ తన అన్నపై ప్రేమను కురిపించారు నాగబాబు.
నా కూతురు ఏంజెల్లా ఉంది!
పెళ్లి వేడుకల్లో భాగంగా తన తల్లి పద్మజ నిశ్చితార్థం నాటి చీరను ధరించింది నిహారిక. ఈ సందర్భంగా బ్లూ కలర్ బనారస్ శారీలో తళుక్కుమన్న ఆమె అప్పటి తన తల్లి ఫొటోను, అమ్మచీరను కట్టుకుని తాను దిగిన ఫొటోను కలిపి అందరితో పంచుకుంది. ‘మా అమ్మ నిశ్చితార్థం అప్పుడు ధరించిన చీర. ఇది 32 ఏళ్ల నాటి చీర’ అన్న క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటో చూసిన పలువురు సెలబ్రిటీలు ‘నిహా! చాలా అందంగా ఉన్నావ్. ముందస్తు పెళ్లి శుభాకాంక్షలు’ అని అభినందనలు తెలిపారు. ఇక ఒకే ఫ్రేములో ఉన్న భార్య, కూతుళ్లను చూసిన నాగబాబు ‘మా ఆవిడ చాలా అందంగా ఉంది. అయితే నా కూతురు మాత్రం ఏంజెల్లా ఉంది’ అని కామెంట్ పెట్టారు.
ప్రత్యేక విమానంలో ప్యాలస్‌కు!
పెళ్లి సమయం దగ్గరపడుతుండడంతో మెగా-అల్లు కుటుంబ సభ్యులంతా ఉదయ్‌పూర్‌కు చేరుకుంటున్నారు. ఇక కాబోయే వధూవరులు నిహారిక-చైతన్య, వారి కుటుంబ సభ్యులు మాత్రం ప్రత్యేక విమానంలో ఉదయ్‌పూర్ బయలుదేరారు. ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకుంది నిహారిక.
చిలకపచ్చ రంగు చీరలో!
అంతకుముందు నిహారికను పెళ్లికూతురుగా ముస్తాబు చేశారు. తన స్వగృహంలోనే ఈ శుభకార్యం నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నిహారికకు పసుపు రాసి, మంగళ స్నానం చేయించారు. ఈ సందర్భంగా ఇంటిని రంగురంగులు పువ్వులు, తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ వేడుకలో చిలకపచ్చరంగు చీరలో కళకళలాడింది నిహారిక. ఈ సందర్భంగా తనను పెళ్లికూతురుగా ముస్తాబు చేస్తున్న తన స్నేహితుల ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసుకున్న నిహా ‘వీళ్లు నాకు హీల్స్ వేయడంలో చాలా సహాయం చేస్తున్నారు. వీరు కాకుండా నన్ను పెళ్లి కూతుర్ని చేసేందుకు పర్ఫెక్ట్ పర్సన్స్ ఉన్నారని నేను అనుకోవడం లేదు. లవ్యూ గర్ల్స్’ అని రాసుకొచ్చింది. ఈ క్రమంలో నిహారిక ప్రివెడ్డింగ్ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా ఈ ముద్దుగుమ్మ పెళ్లి వేడుకల ఫొటోలపై ఓ లుక్కేయండి.
https://www.instagram.com/p/CIaYTWxj26J/