Photo: Instagram
‘వీలైతే ప్రేమిద్దాం... మహా అయితే తిరిగి ప్రేమిస్తారు’.. అని ఓ సినిమాలో చెప్పినట్లు మనం ప్రేమించిన వ్యక్తి తిరిగి మనల్ని ప్రేమిస్తే ఫర్వాలేదు... కానీ అలా జరగనప్పుడే ప్రేమలో విఫలమయ్యామని తెగ ఫీలైపోతుంటారు చాలామంది. మరీ సున్నిత మనస్కులైతే ఈ రకమైన తిరస్కారాన్ని అసలు తట్టుకోలేరు. ‘ప్రేమలో విఫలమయ్యాం.. ఇక జీవితమంతా శూన్యం’ అంటూ మానసిక కుంగుబాటుకు గురవ్వడం, బలవన్మరణాలకు పాల్పడడం వంటివి చేస్తుంటారు. అయితే ప్రేమలో ఓడినంత మాత్రాన ఇలాంటి ప్రతికూల ఆలోచనలు ఏ మాత్రం సరైనవి కావంటోంది రేణూదేశాయ్. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించే ఆమె తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా రిలేషన్షిప్, బ్రేకప్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అందరితో షేర్ చేసుకుంది.
చాలా రోజుల తర్వాత!
నటిగానే కాకుండా దర్శకురాలిగా, రచయిత్రిగా, ఫొటోగ్రాఫర్‌గా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది రేణూ దేశాయ్. ‘బద్రి’ సినిమా చిత్రీకరణ సమయంలో పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడిన ఆమె కొంతకాలానికి వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత పలు వ్యక్తిగత కారణాల వల్ల పవన్-రేణూ విడిపోయారు. విడాకులు తీసుకుని ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం సింగిల్ మదర్‌గా తన ఇద్దరు పిల్లల ఆలనాపాలన చూసుకుంటున్న ఆమె కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంది. చాలారోజుల తర్వాత ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన రేణు... పలువురు నెటిజన్లు, అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది.
జీవితం, ప్రాణం కంటే ఎవరూ ఎక్కువ కాదు!
ఈ సందర్భంగా ‘ప్రేమలో ఓడిపోతే చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు? దానిపై మీ అభిప్రాయం ఏమిటి? అలాంటి సున్నిత మనస్కులకు మీరు ఓ మంచి సందేశమివ్వండి’ అని ఓ నెటిజన్ ఆమెను కోరాడు. దీనికి స్పందించిన రేణు ‘ప్రేమలో విఫలమైతే ఎంత బాధ కలుగుతుందో నాకు తెలుసు. మనం ఎంతగానో ప్రేమించిన వ్యక్తి మన పక్కన లేడని, మనం మోసపోయామని అనిపించినప్పుడు మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. అంతమాత్రాన ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడమనేది సరైన నిర్ణయం కాదు. కౌన్సెలింగ్ తీసుకుంటే ఆ బాధ నుంచి బయటపడొచ్చు. అలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో అధిక సమయం గడిపితే మళ్లీ మనుపటిలా సాధారణ జీవితం ప్రారంభించవచ్చు. అయినా మన జీవితం, ప్రాణం కంటే ఎవరూ ఎక్కువ కాదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఒకేలా జీవించాలి. బాధ వచ్చినప్పుడు కుంగిపోకూడదు. సంతోషం కలిగినప్పుడు పొంగిపోకూడదు’ అని సమాధానమిచ్చింది.
పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చేశాను!
దీంతో పాటు తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది రేణు. ‘ప్రస్తుతం నేను ‘ఆద్య’ అనే ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాను. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో నేను ఓ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవోగా నటిస్తున్నాను. ఈ పాత్ర నాకు బాగా నచ్చడంతో వెంటనే అంగీకరించాను. దీంతో పాటు మరో కథలో నటించడానికి నేను ఓకే చెప్పాను. త్వరలోనే ఆ ప్రాజెక్టు వివరాలు కూడా వెల్లడిస్తాను. ఇక రైతుల సమస్యలపై నేను తెరకెక్కించనున్న సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది వేసవిలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.