పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అందులోనూ రంగుల ప్రపంచం లాంటి సినిమా పరిశ్రమలో అయితే అడుగడుగునా పురుషాధిక్య భావనలే కనిపిస్తుంటాయి. ఈక్రమంలో చాలామంది తారలు ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నా మౌనంగా భరిస్తున్నారు. మరికొందరేమో తమకు జరిగిన అన్యాయంపై ధైర్యంగా నోరు విప్పుతున్నారు. ఈ రెండో కోవకే చెందుతుంది బాలీవుడ్ నటి మందనా కరిమి. ప్రస్తుతం తనతో కలిసి పనిచేస్తోన్న ఓ చిత్ర నిర్మాత తనతో అనైతికంగా ప్రవర్తించాడని, మానసికంగా తనని వేధించాడంటోందీ అందాల తార. ఈ సందర్భంగా ఇటీవల షూటింగ్ సెట్లో తనకెదురైన ఓ చేదు అనుభవాన్ని అందరితో షేర్ చేసుకుందీ ముద్దుగుమ్మ.
ఆయన మొదటి నుంచీ అంతే!
ఇరాన్‌కు చెందిన మందన మొదట ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించింది. అయితే కొన్నేళ్ల తర్వాత ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. తల్లిది ఇండియా కావడంతో ఈ క్రమంలోనే ఏడేళ్ల క్రితం ముంబయి వచ్చి ఇక్కడే స్థిరపడింది. మొదట కొన్ని కమర్షియల్ యాడ్స్‌లోనూ నటించిన ఆమె.. 2015లో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ‘రాయ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘భాగ్ జానీ’, ‘మై ఔర్ ఛార్లెస్’, ‘క్యా కూల్ హై హమ్ 3’ వంటి సినిమాల్లో నటించింది. బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోల్లోనూ పాల్గొని సందడి చేసింది. ప్రస్తుతం ఆమె సన్నీలియోనీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘కోకా కోలా’ అనే చిత్రంలో నటిస్తోంది. గతేడాది మొదలైన ఈ సినిమా షూటింగ్ లాక్డౌన్ కారణంగా మధ్యలో ఆగిపోయింది. కొద్ది రోజుల క్రితమే మళ్లీ పట్టాలెక్కింది. అయితే ఓ చిత్ర షూటింగ్లో నిర్మాత తనను మానసికంగా వేధిస్తున్నాడంటోంది మందన. ఈ సందర్భంగా షూటింగ్ సెట్లో తనకెదురైన ఓ చేదు అనుభవాన్ని అందరితో పంచుకుందీ అందాల తార.
నేరుగా వ్యానిటీ వ్యాన్‌లోకి వచ్చేశాడు!
‘దీపావళి ముందు రోజు(నవంబర్ 13) రాత్రి నా సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. అయితే నాకు వేరే ప్రాజెక్టు ఉండడంతో రెండు రోజుల ముందు నుంచే అనుకున్న సమయానికంటే ముందుగానే షూటింగ్‌కు హాజరవుతున్నాను. కానీ నా షూటింగ్ చివరి రోజు ఆ నిర్మాత నాతో అనైతికంగా ప్రవర్తించారు. ఆయన ప్రవర్తన నన్ను చాలా కంగారు పెట్టింది. షూట్ చేయాల్సిన సీన్స్ ఇంకొన్ని ఉన్నాయని...మరో గంట పాటు సెట్లోనే ఉండాలని చెప్పారు. అయితే ఆ సమయానికి నాకు వేరే మీటింగ్స్ ఉండడం వల్ల కుదరదని కచ్చితంగా చెప్పేశాను. దానికి ఆయన కూడా సరేనన్నారు. దీంతో బ్యాలన్స్ ఉన్న నా సీన్లు పూర్తి చేసుకుని దుస్తులు మార్చుకోవడానికి వ్యానిటీ వ్యాన్‌లోకి వెళ్లాను. అలా నేను వెళ్లిన కొంత సమయానికే ఆ నిర్మాత నా వ్యానిటీ వ్యాన్‌లోకి ప్రవేశించి నన్ను తిట్టడం ప్రారంభించారు. ‘నువ్వు ఇప్పుడు వెళ్లడానికి వీల్లేదు. మరో గంట సెట్లో ఉండమని చెప్పాను కాబట్టి నువ్వు కచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే నీకు డబ్బులు ఇచ్చిన నిర్మాతను నేను’ అని గట్టిగా కేకలు వేశారు. ‘నేను దుస్తులు మార్చుకోవాలి సర్.. బయటకు వెళ్లండి.. నేను వచ్చి మాట్లాడతాను’ అని చెప్పినప్పటికీ ఆయన వినలేదు. అదృష్టవశాత్తూ షూటింగ్ సెట్లో ఉన్న ఓ స్టైలిస్ట్ నిర్మాతను వ్యాన్‌లో నుంచి లాక్కెళ్లారు. అయితే ఆయన అరుపులు విన్న అక్కడి వారందరూ నన్ను అదోలా చూశారు. అది నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది..’
ఇక్కడ నాకెలాంటి గాడ్ ఫాదర్ లేరు!
‘ఇక ఈ సంఘటన జరిగిన తర్వాత నాకు కేటాయించిన ప్రొడక్షన్ కార్లో ఇంటికెళ్లేందుకు నేను సిద్ధమయ్యాను. కానీ ఆ నిర్మాత కుమారుడు నా కారు డ్రైవర్‌ను కిందకు దింపేశాడు. అక్కడున్న వారిలో ఎవరూ దీని గురించి ఆయనను ప్రశ్నించలేదు. దీంతో గత్యంతరం లేక సెట్లో ఉన్న ఓ కొరియోగ్రాఫర్ సహాయంతో ఇంటికి చేరుకున్నాను. ప్రస్తుతం నేను వర్కింగ్ వీసాపై ఇండియాలో ఉంటున్నాను. నాకు తోడుగా కనీసం కుటుంబ సభ్యులెవరూ నాతో లేరు. సినిమా పరిశ్రమలో నాకెలాంటి గాడ్ ఫాదర్ లేరు. కనీసం నాకు ఓ మేనేజర్ కానీ పీఆర్ కానీ లేరు. అన్ని విషయాలూ నేనే చూసుకుంటూ ముందుకు సాగుతున్నా. ఇక నా వృత్తి పట్ల నాకెంతటి అంకిత భావం ఉందో నాతో పనిచేసిన సహనటులకు బాగా తెలుసు. అలాంటిది నాపై ఓ పెద్దమనిషి, ఆయన కుమారుడు వేధింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం?’ అని ఆవేదన వ్యక్తం చేస్తోందీ అందాల తార.