Photo: Instagram
ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. శరీరాకృతి, అందం, బరువు, రంగు... మొదలైన విషయాల గురించి వాళ్ల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం చాలా మామూలు విషయమై పోయింది. ఇక రంగుల ప్రపంచం లాంటి సినిమా ఇండస్ట్రీలో చర్మఛాయ పేరుతో అడుగడుగునా వివక్ష, అవమానాలు ఎదుర్కొన్నట్లు ఇప్పటికే చాలామంది సినీతారలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తన స్కిన్‌టోన్ కారణంగా తాను కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటోంది బాలీవుడ్ అందాల తార చిత్రాంగద సింగ్. అంతేకాదు తన చర్మఛాయ కారణంగా కెరీర్లో పలు అవకాశాలు కోల్పోయానంటోంది. ఈ సందర్భంగా తన స్కిన్‌టోన్‌కు సంబంధించి తనకెదురైన చేదు అనుభవాలను అందరితో పంచుకుందీ అందాల తార.
చిత్రాంగద సింగ్... హిందీ సినిమాలు చూసే ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ పలు బ్రాండ్ల ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనల్లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ‘సారీ భాయ్’, ‘దేశీ బాయ్స్’, ‘జోకర్’, ‘ఇంకార్’, ‘అంజాన్’, ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’, ‘మున్నామైఖేల్’, ‘సూర్మా’, ‘సాహెబ్, బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్-3’, ‘బాజార్’ ‘ఘూమ్కేతు’ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సిల్వర్ స్ర్కీన్‌పై ఎక్కువగా బోల్డ్ క్యారక్టర్స్‌లో దర్శనమిచ్చే ఈ ముద్దుగుమ్మ నిజ జీవితంలోనూ ముక్కుసూటిగా వ్యవహరిస్తుంటుంది. గతంలో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల లాంటి సున్నితమైన అంశాలపై తనదైన శైలిలో స్పందించి వార్తల్లో నిలిచిందీ బాలీవుడ్ బ్యూటీ.

చాలా అవకాశాలు కోల్పోయాను!
ఇక కొద్దిరోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ వేదికగా ‘బ్రౌన్ అండ్ హ్యాపీ’ అంటూ తన స్కిన్ టోన్‌తో తాను చాలా సంతోషంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది చిత్రాంగద. తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందించిన ఆమె తన స్కిన్‌టోన్ కారణంగా తనకెలాంటి అవమానాలు ఎదురయ్యాయో అందరితో పంచుకుంది. ‘నాలాంటి డార్క్ స్కిన్ ఉన్న అమ్మాయిలు తమ జీవితంలో ఎలాంటి అనుభవాలు, అవమానాలు ఎదుర్కొంటున్నారో నాకు తెలుసు. మనకు తెలియకుండానే మన చర్మఛాయను కించపరుస్తూ చాలామంది మాట్లాడుతుంటారు. నేను కూడా ఇలాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నాను. నేను రాజస్థాన్‌లో పుట్టినప్పటికీ ఉత్తరప్రదేశ్, పంజాబ్, దిల్లీ తదితర రాష్ట్రాల్లో నా విద్యాభ్యాసం గడిచింది. అక్కడ చదువుకుంటున్నప్పుడే నా స్కిన్ టోన్‌కు సంబంధించి ఎన్నో రకాల అవమానాలు, వివక్ష ఎదుర్కొన్నాను. ఇక మోడలింగ్ కోసం ముంబయిలో అడుగుపెట్టినప్పుడు కూడా ఇలాంటి వివక్షే ఎదురైంది. నా స్కిన్‌టోన్ కారణంగా నా దగ్గరకు వచ్చిన కొన్ని మోడలింగ్ అసైన్మెంట్లు కూడా రద్దు చేశారు. అంతకుముందు నేను నటించాల్సిన ఓ యాడ్ షూట్‌ను కూడా వేరేవారితో భర్తీ చేయించారు. దీంతో నేను పలు రకాల ఒత్తిళ్లకు గురయ్యాను. అయితే అదృష్టవశాత్తూ నేను యాక్ట్ చేసిన ఓ యాడ్షూట్ను గుల్జార్ సాబ్ చూశారు. వెంటనే ఆడిషన్‌కు పిలిపించి తన మ్యూజిక్ వీడియోలో అవకాశం కల్పించారు. ఆ తర్వాతే నా జీవితం మలుపు తిరిగింది. స్కిన్ కలర్ గురించి ఆలోచించడం మానేశాను. నేను ఎలాగైతే ఉన్నానో... అలాగే నన్ను అంగీకరించుకోవడం మొదలుపెట్టాను’ అని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
లాక్డౌన్ కాలంలో పలు లఘు చిత్రాల్లో నటించి అలరించిన చిత్రాంగద ప్రస్తుతం ‘బాబ్ బిశ్వాస్’ అనే సినిమాలో నటిస్తోంది. అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్న ఈ క్రైం థిల్లర్ మూవీని గౌరీఖాన్ నిర్మిస్తున్నారు.