రంగుల ప్రపంచం లాంటి సినిమా ఇండస్ర్టీలో ఒక మహిళ హీరోయిన్గా రాణించాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టడం నుంచి అవకాశాలు దక్కించుకునే దాకా ఎన్నో అవమానాలు భరించాల్సి ఉంటుంది. తెరపై కనిపించి అభిమానుల మెప్పు పొందాలంటే తెర వెనుక వారు ఎదుర్కొనే వేధింపులు, చేదు అనుభవాలు ఎన్నో! ఈక్రమంలో సినిమా పరిశ్రమలో తాను కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానంటోంది తాప్సీ. తాను అందంగా ఉండనని, గొంతు బాగోలేదని.. ఇలా పలు కారణాలను సాకులుగా చూపి తనను చాలా సినిమాల్లోంచి తప్పించారంటోంది. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమలో తనకెదురైన చేదు అనుభవాలు, అవమానాల గురించి అందరితో షేర్ చేసుకుందీ అందాల తార.
ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా!
పదేళ్ల క్రితం ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తొలిసారి వెండితెరపై మెరిసింది తాప్సీ. తనదైన అందం, అభినయంతో తెలుగు, తమిళం, మలయాళం.. వంటి భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత 2012లో ‘ఛష్మే బద్దూర్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అప్పటివరకు ఒకటి, రెండు సినిమాల్లో తప్ప పెద్దగా ఛాలెంజింగ్ పాత్రల్లో నటించే అవకాశం రాని తాప్సీకి 2016లో విడుదలైన ‘పింక్’ చిత్రం తన దశని మార్చేసింది. ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. ఈ విజయం తర్వాత కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకోవడం ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ‘ఘాజీ అటాక్’, ‘నామ్ షబానా’, ‘జుడ్వా-2’, ‘సూర్మా’, ‘ముల్క్’ ‘నీవెవరో’, ‘మన్మర్జియా’, ‘బద్లా’, ‘గేమ్ ఓవర్’, ‘మిషన్ మంగళ్’, ‘శాండ్ కీ ఆంఖ్’, ‘థప్పడ్’.. వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోన్న ఆమె.. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. తాజాగా ఈ విషయానికి సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాలను అందరితో షేర్ చేసుకుందీ చక్కనమ్మ.
‘హీరోయిన్’గా నన్ను ఇష్టపడేవారు కాదు!
‘అందం విషయంలో నేను సినీ ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఈ కారణంతో కొంత మంది హీరోల భార్యలు నన్ను ఇష్టపడేవారు కాదు. తమ భర్త పక్కన నేను హీరోయిన్గా కనిపించడాన్ని సిగ్గుచేటుగా భావించేవారు. పైగా దురదృష్టవంతురాలిగా నాపై ముద్ర వేసి నా స్థానంలో ఇతర హీరోయిన్లకు అవకాశం ఇప్పించేవారు. ఇక కొందరు నిర్మాతలు కూడా నన్ను హీరోయిన్గా తీసుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడేవారు కాదు. ఈనేపథ్యంలో నేను నటించిన ఓ సినిమాకు నేనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాను. అయితే ఇందులో నా గొంతు అంత బాగా లేదని, నేను చెప్పిన డైలాగులు హీరోకు నచ్చకపోవడంతో అది మార్చుకోవాలని ఆ హీరో నాకు సూచించాడు. కానీ నేను దానిని తిరస్కరించడంతో నాకు తెలియకుండా డబ్బింగ్ ఆర్టిస్టులను పిలిపించుకున్నారు. ఇక మరో సినిమాలో నా పరిచయ సన్నివేశం.. హీరో పరిచయ సన్నివేశం కంటే బాగా వచ్చిందన్న ఉద్దేశంతో డైరెక్టర్‌కు చెప్పి ఆ హీరో నా సన్నివేశాలను మార్చేశాడు. నేను నటించిన కొన్ని చిత్రాలు సరిగ్గా ఆడకపోవడం వల్ల వారు నష్టపోకుండా ఉండేందుకు నా రెమ్యునరేషన్ తగ్గించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నాకు తెలిసి జరిగినవి మాత్రమే! ఇక నాకు తెలియకుండా తెరవెనుక ఇంకెన్ని జరిగాయో!’ అంటూ తన చేదు అనుభవాలను గుర్తుకుతెచ్చుకుందీ బ్యూటీ.
కొంచెం కష్టమైనదే... కానీ హ్యాపీ!
ఇలా ఎన్నో ఇబ్బందులు, సమస్యలను అధిగమించిన తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఈ విషయంపై స్పందిస్తూ.. ‘కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా గ్లామరస్ పాత్రల్లోనే నటించాను. వాటి వల్ల నాకు పెద్దగా పేరు రాలేదు. పైగా నటన పరంగా నాకెలాంటి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. అందుకే నాకు సంతోషాన్నిచ్చే సినిమాలనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. నేటికీ అదే పద్ధతిని ఫాలో అవుతున్నాను. అయితే నా నిర్ణయం సరైనది కాదని చాలామంది నాకు నచ్చజెప్పాలని చూశారు. నా నిర్ణయం వల్ల హీరోయిన్గా ఎక్కువ కాలం రాణించలేనని సలహాలు ఇచ్చారు. ఎందుకంటే వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే హీరోలు తమ సినిమాల్లో అవకాశాలు కల్పించేందుకు వెనకాడతారు. ఇది కొంచెం కష్టమైనదే. కానీ నా నిర్ణయం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని అంటోంది తాప్సీ.
‘ఈ ఏడాది ప్రారంభంలో ‘థప్పడ్’ సినిమాతో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్న తాప్సీ.. ప్రస్తుతం ‘రష్మీ రాకెట్’ సినిమా షూటింగ్లో పాల్గొంటోంది. ఈ సినిమాలో గుజరాత్‌కు చెందిన రన్నర్ రష్మీ పాత్రలో కనిపించనుందీ ముద్దుగుమ్మ. దీంతో పాటు హైదరాబాదీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ ‘శభాష్ మిథూ’, ‘హసీన్ దిల్రుబా’, ‘లూప్ లాపెటా’.. వంటి చిత్రాల్లో నటిస్తోంది.