చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకొనే పండగల్లో దీపావళి ఒకటి. రామాయణం ప్రకారం 14 ఏళ్ల వనవాసం తర్వాత రాముడు సీతతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా.. మహాభారతం ప్రకారం సత్యభామ నరకాసురుడిని వధించిన రోజుగా.. మనమంతా ఈ పండగను జరుపుకొంటాం. దీపావళి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది దీపకాంతులు. ఈరోజున లక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజించి, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇళ్లంతా దీపాలతో అందంగా అలంకరిస్తాం. ఇక చీకటి పడ్డాక అసలైన ఘట్టం మొదలవుతుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఇంటి సభ్యులంతా కలిసి దీపావళి టపాసులు కాలుస్తూ ఆనందంగా గడుపుతారు. అయితే ఈసారి కరోనా నిబంధనల కారణంగా చాల రాష్ట్రాల్లో బాణాసంచా కాల్చకూడదని నిషేధం విధించారనుకోండి.. ఈసారి మనం టపాసులు కాల్చకపోయినా- వీటిలో ఆకాశానికి ఎగసి వెలుగులు విరజిమ్మేవి కొన్నైతే.. నేలపైనే పేలుతూ కాంతితో పాటు శబ్దాలను ఇచ్చేవి మరికొన్ని. ఈ క్రమంలో మనల్ని ఎంతగానో అలరిస్తోన్న ఈతరం తారలకు, దీపావళి టపాసులకు పోలికలెన్నో..! మరి ఏ తార ఏ టపాసు లాంటిదో మీరే చూడండి..!
కాకరపువ్వొత్తి - సమంత
వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వారికైనా ఇష్టమైన టపాసుల్లో కాకరపువ్వొత్తులు ఒకటి. సాధారణంగా ఏ ఇంట్లోనైనా దీపావళి టపాసుల లిస్ట్ దాని పేరుతోనే మొదలవుతుంది. ఇది వెలిగినంత సేపూ కాంతులు విరజిమ్ముతూ ఆనందాన్ని పంచుతుంటుంది. దీని లాగే టాలీవుడ్ నటీమణుల్లో సమంత నటనను కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టపడతారు. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ఆద్యంతం ప్రేక్షకులను అలరించేందుకు ఎప్పుడూ ముందుంటుందీ భామ. పైగా కాకరపువ్వొత్తుల వల్ల ప్రమాదం జరగడం ఎంత అరుదో.. సమంత సినిమాలు ఫ్లాప్ కావడం కూడా అంతే అరుదు..! లాక్‌డౌన్‌కు సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చిన ఈ కాకరపువ్వొత్తి త్వరలో ‘ది ఫ్యామిలీ మెన్2 వెబ్‌సిరీస్‌తో ‘ఫన్’ పంచేందుకు రడీ అవుతోంది.
తారాజువ్వ - కాజల్
కాలం ఎంత మారుతోన్నా కొన్నిటి ప్రాముఖ్యం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. దీపావళి టపాసుల్లో తారాజువ్వ కూడా ఈ కోవకు చెందిందే. మన అమ్మమ్మల తరం నుంచి ఈతరం వరకు దీనికున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో హీరోయిన్ల విషయానికొస్తే పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 14 ఏళ్లు దాటినా అభిమానుల్లో తనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గని హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ భామ సినిమాల లిస్టు చూస్తుంటే ఈ క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా లేదు..!
టెన్ థౌజండ్ వాలా - తమన్నా
దీపావళి టపాసుల్లో 10,000 వాలాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అది పేలేది కాసేపే అయినప్పటికీ పేలినంత సేపూ నిప్పులు చెరుగుతూ, శబ్దాలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. మన హీరోయిన్లలో తమన్నా నటన కూడా అలాంటిదే. సినిమాలో తన నటన, అందంతో ప్రేక్షకుల దృష్టిని తనవైపుకి తిప్పుకుంటుంది. పాత్ర నచ్చితే చాలు సినిమాలో ఆ పాత్ర నిడివిని పట్టించుకోకుండా నటించి మెప్పిస్తుంటుంది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ‘డ్యాంగ్ డ్యాంగ్’ అంటూ స్టెప్పులేసి 10,000 వాలాలా అందరినీ ఆకట్టుకుంది.
రాకెట్ - రకుల్
చూడడానికి సన్నగా ఉన్నప్పటికీ ఒక్కసారి వెలిగిస్తే నింగిలోకి దూసుకెళ్లి అందంగా కాంతులు విరజిమ్మే దీపావళి బాంబు రాకెట్. దీని లాగే ఈతరం హీరోయిన్లలో నాజూగ్గా, ఫిట్‌గా ఉండి వరుస అవకాశాలతో దూసుకెళ్తోన్న తార రకుల్. తన అందం, అభినయంతో ఇటు దక్షిణ భారత ప్రేక్షకులనే కాదు అటు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ‘సిమ్లా మిర్చి’లా ఆకట్టుకుంటోంది.
చిచ్చు బుడ్డి - కీర్తి సురేష్
దీపావళి టపాసుల్లో ఎక్కువమంది ఇష్టపడేది చిచ్చు బుడ్డిని. దీనికి కారణం చూడడానికి స్థిరంగా, సాధారణంగా కనిపించినా ఒక్కసారి వెలిగిస్తే ఇది అందించే కాంతులు అందరినీ ఆకర్షిస్తాయి. మన నటీమణుల్లో కీర్తి కూడా అంతే. చూడడానికి పక్కింటి అమ్మాయిలా కనిపించినా.. ఒక్కసారి తెర పైకి వచ్చిందంటే చాలు జాతీయ స్థాయి పురస్కారాలు సైతం దాసోహం అనాల్సిందే. లాక్డౌన్లో ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ గా మెప్పించిన ఈ చిచ్చుబుడ్డి త్వరలో ‘రంగ్‌దే’ అంటూ నవ్వుల వెలుగులు పంచేందుకు సిద్ధమవుతోంది.
ఆటం బాంబ్ - పూజా హెగ్డే
ఈ బాంబ్ పేరుకు తగ్గట్లే పెద్దగా శబ్దాలు చేసి అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. అందుకే ఈ బాంబ్ అంటే కుర్రకారు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో ఈతరం నటీమణుల్లో పూజ తీరు కూడా ఇంతే. తన అందచందాలతో యువతలో మంచి క్రేజ్‌ని సంపాదించుకుందీ భామ. టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోన్న ఈ ఆటం బాంబ్.. ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠపురములో’ అంటూ భారీ సౌండ్‌తో పేలింది. ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’ తో కలిసి మురిపించేందుకు ముస్తాబవుతోంది.
లక్ష్మీ బాంబ్ - సాయి పల్లవి
పైన లక్ష్మీదేవి ఫొటోతో చూడడానికి చాలా సాధారణంగా కనిపించే ఈ టపాసు.. ఒక్కసారి పేలితే కొన్ని మీటర్ల వరకు రీసౌండ్ వినిపిస్తుంది. ఇప్పటి హీరోయిన్లలో సాయి పల్లవి స్త్టెల్ కూడా అంతే. బయట చూడడానికి పెద్దగా హంగు, ఆర్భాటాలు లేకుండా సాధారణంగా కనిపించే ఈ తార.. తెరపైన తన నటన, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంటుంది. అంతేకాదు తను నటించిన 'వచ్చిండే..' (ఫిదా), 'రౌడీ బేబీ' (మారీ-2) పాటలు యూట్యూబ్‌లో వందల మిలియన్ల లైకులు సంపాదించి.. నిర్మాతలకు లాభాలు చేకూర్చాయి. ఈ క్రమంలో నిర్మాతల పాలిట లక్ష్మీ దేవి గా మారిన ఆమె త్వరలో నాగచైతన్యతో కలిసి తన ‘లవ్‌స్టోరీ’ చెప్పనుంది.
భూచక్రం - నయనతార
దీపావళి టపాసుల్లో చూడడానికి నిరాడంబరంగా కనిపిస్తూ వెలిగించిన తర్వాత వెలుగులు విరజిమ్మే టపాకాయల్లో భూచక్రం ఒకటి. మిగతా టపాసులు వెలిగించిన వెంటనే పై పైకి దూసుకెళ్తుంటే భూచక్రం మాత్రం ఎంత వెలిగినా, ఎంత పేలినా నేలనే అంటిపెట్టుకొని ఉంటుంది. భూచక్రం లాగే ఈతరం హీరోయిన్లలో నయనతార కూడా ఎన్నో విజయాలు అందుకొని సూపర్‌స్టార్‌గా ఎదిగినప్పటికీ నిరాడంబరంగా కనిపిస్తుంది. త్వరలో ఈ భూ చక్రం ‘అమ్మోరు తల్లి’గా మన ముందుకు రానుంది.
స్కై షాట్స్ - అనుష్క
స్కై షాట్స్ అంటే చూడడానికి భారీగా కనిపిస్తూ వెలిగించిన తర్వాత ఒక్కొక్క షాట్‌గా ఆకాశంలోకి దూసుకెళ్లి అందంగా కాంతులు విరజిమ్ముతాయి. మన హీరోయిన్లలో అనుష్క తీరు కూడా ఇంతే. స్కై షాట్స్ వెలిగించాక ఒక షాట్ పేలిన తర్వాత కొంత సమయానికి మరో షాట్ పేలుతుంది. అనుష్క కెరీర్ కూడా అంతే. ఒక సినిమాకు, మరో సినిమాకు మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. కానీ, నటించిన ప్రతి సినిమాలో కూడా తన నటనతో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించడం స్వీటీ స్త్టెల్. ఇటీవల ‘నిశ్శబ్దం’గా ఆకాశంలోకి వెళ్లిన ఈ స్కై షాట్ మరోసారి తన అద్భుతమైన నటనతో మెప్పించింది.
కేవలం ఇవే కాదు.. దీపావళి టపాసులకు ఈతరం నటీమణులకు మధ్య మరేవైనా పోలికలున్నాయని మీకు అనిపిస్తే.. వసుంధర.నెట్ ద్వారా వాటిని మాతో పంచుకోండి. హ్యాపీ దీపావళి..