సామాజిక మాధ్యమాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత భాగమయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక వెండితెరపై వెలిగిపోయే సెలబ్రిటీలకు తమ వృత్తితో పాటు సోషల్ మీడియా కూడా ముఖ్యమే. ఎందుకంటే తమను ఆరాధించే అభిమానులకు మరింత చేరువయ్యేందుకు సామాజిక మాధ్యమాలు వారధిగా ఉపయోగపడుతున్నాయి. తమ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను ఈ వేదిక ద్వారానే ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఇదే సమయంలో తమ అభిమాన తారల గురించి తెలుసుకోవడానికి చాలామంది వారిని ఫాలో అవుతున్నారు. ఈక్రమంలో సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉన్న శ్రద్ధా కపూర్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య తాజాగా 56.5 మిలియన్లకు చేరుకుంది. తద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఇండియన్ సెలబ్రిటీల్లో మూడో స్థానానికి చేరుకుందీ ముద్దుగుమ్మ.
శక్తి కపూర్ నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రద్ధా కపూర్. తన అందం, అభినయంతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘తీన్ పత్తి’, ‘ఆషిఖీ-2’, ‘ఏక్ విలన్’, ‘హైదర్’, ‘ఉంగ్లీ’, ‘ఏబీసీడీ2’, ‘బాఘీ’, ‘రాక్ఆన్-2’, ‘హసీనా పార్కర్’, ‘స్ర్తీ’, ‘చిచ్చోరే’, ‘స్ట్రీట్ డ్యాన్సర్-3’ తదితర హిట్ సినిమాలతో సినీ ప్రియుల్ని ఆకట్టుకుందీ కపూర్ బ్యూటీ. ఇక తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిందీ బాలీవుడ్ అందం.
మూడో స్థానానికి!
పదేళ్లలోనే 21 చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది. లాక్డౌన్ సమయంలో తన గ్లామరస్ ఫొటోలతో పాటు త్రో బ్యాక్ ఫొటోలు, వర్కవుట్ వీడియోలు, సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోలు, స్నేహితులు-కుటుంబ సభ్యులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం, కుకింగ్ వీడియోల ద్వారా.. ఇలా అభిమానులకు మరింత చేరువైంది శ్రద్ధ. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను అనుసరించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది జులై 16న 50 మిలియన్ల ఫాలోవర్స్ మార్క్‌ను దాటేసిన ఈ అందాల తార.. తాజాగా మరో గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా 56.5 మిలియన్ల ఫాలోవర్స్‌తో అత్యధిక ఫాలోయింగ్ సొంతం చేసుకున్న భారతీయ ప్రముఖుల్లో మూడో స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 82.5 మిలియన్ల ఫాలోవర్స్‌తో మొదటి స్థానంలో ఉండగా, 58.2 మిలియన్ల ఫాలోవర్స్‌తో గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఈ సందర్భంగా శ్రద్ధా కపూర్ షేర్ చేసిన కొన్ని ఇన్‌స్టా పోస్టులపై మనమూ ఓ లుక్కేద్దాం రండి.
శ్రద్ధాతో పాటు ఎక్కువ మంది ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్న సినీ తారలు ఎవరంటే!
ప్రియాంకా చోప్రా(58.2 మిలియన్లు)
దీపికా పదుకొణె(52.2 మిలియన్లు)
అలియా భట్(50.1 మిలియన్లు)
నేహా కక్కర్ (48.2 మిలియన్లు)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (46.2 మిలియన్లు)
కత్రినా కైఫ్ (44.8 మిలియన్లు)