ఏ రంగంలోనైనా ఉద్యోగానికి ప్రతిభే కొలమానం అన్న సంగతి తెలిసిందే! కానీ చిత్రపరిశ్రమలో అవకాశాలు సొంతం చేసుకోవాలంటే నెపోటిజం (బంధుప్రీతి), క్యాస్టింగ్ కౌచ్ ముఖ్యమని పలు సందర్భాల్లో కొంతమంది తారలు వెల్లడించిన విషయాలు, వారి అనుభవాలను బట్టి ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఇలాంటి చేదు అనుభవాలు తన జీవితంలోనూ ఉన్నాయంటోంది బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్. ‘దంగల్’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిన్నది.. సినిమాల్లో అవకాశాల కోసం పడరాని పాట్లు పడ్డానని, ముక్కుపచ్చలారని వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యానంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. ఇలాంటి వేధింపులు మహిళలకు ప్రతి రంగంలోనూ ఎదురవుతున్నాయని, దీంతో వారు నిత్యం నరకం అనుభవిస్తున్నారని తన మనసులోని ఆవేదనను బయటపెట్టిందీ క్యూటీ.
సినిమాల్లో నటిస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోన్న నటీమణుల్ని చూసి ‘అబ్బ.. వీళ్లు నిజంగా లక్కీ! చేతినిండా డబ్బు.. లగ్జరీ లైఫ్‌స్టైల్..! వాళ్లకేంటి మహారాణులు!’ అనుకుంటాం. కానీ వాళ్లు ఆ దశకు చేరుకోవడానికి మొదట్లో ఎంత కష్టపడ్డారో మనం ఊహించి ఉండం. ఈ క్రమంలో వాళ్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి కొంతమంది తారలు పలు సందర్భాల్లో పంచుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలాంటి అనుభవాలు తనకూ ఎదురయ్యాయని చెబుతోంది ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. తాను మూడేళ్ల వయసులోనే లైంగిక వేధింపుల్ని ఎదుర్కొన్నానంటూ తాజాగా చెప్పుకొచ్చింది.
అవకాశాలు రావాలంటే అదొక్కటే మార్గమన్నారు!
‘నేను మూడేళ్లున్నప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యా. సినిమాల్లో అవకాశాలు రావాలంటే శృంగారానికి అంగీకరించడమే ఏకైక మార్గం అని చాలామంది నాతో అన్నారు. ఈ కారణంగా నేను కొన్ని అవకాశాలు కోల్పోయా.. మరికొన్ని సార్లు ఎంపిక చేసిన ప్రాజెక్ట్స్ నుంచి నన్ను తొలగించి ఇతరులకు ఆ అవకాశం ఇచ్చారు. మహిళలకు ఇలాంటి సమస్యలు ఈ ఒక్క రంగంలోనే ఉన్నాయని చెప్పను.. ఎందుకంటే ప్రతి రంగంలో, ప్రతి రోజూ ఎంతోమంది ఆడవారు ఇలాంటి వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు. ఆ బాధను పంటి బిగువన భరిస్తున్నారు. మైనార్టీ మహిళలైతే ఈ విషయంలో మరెన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇలా తమకు జరిగిన అన్యాయాల్ని బయటికి చెబితే ఎవరెలా స్పందిస్తారో, సమాజం వారిని ఎలా ట్రీట్ చేస్తుందోనన్న భయంతో చాలామంది చెప్పడానికి సాహసించరు. కానీ ఈ విషయంలో మహిళల్లో మార్పు రావాలి. లైంగిక వేధింపుల గురించి ఉన్న అపోహల్ని, భయాల్ని పక్కన పెట్టి తమకు జరిగిన అన్యాయాల్ని బయటపెట్టే ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. అప్పుడే మన భవిష్యత్తు, మన ముందు తరాల వారి భవిష్యత్తు ఉత్తమంగా ఉంటుందనేది నా భావన..’ అంటూ తన మనసులోని భావోద్వేగాల్ని అందరి ముందుంచిందీ దంగల్ బ్యూటీ.
‘నువ్వు హీరోయిన్లా అందంగా లేవ’న్నారు!
ఇప్పుడే కాదు.. తన కెరీర్ తొలినాళ్లలో అవకాశాలను చేజిక్కించుకోవడానికి తాను పడిన కష్టాల గురించి గతంలో ఓ సందర్భంలో కూడా చెప్పుకొచ్చింది ఫాతిమా. ‘నేను ఐదేళ్ల వయసులోనే బాలనటిగా పనిచేశా. కానీ ఆ తర్వాత అవకాశాలు రావడం గగనంగా మారిపోయింది. అవకాశాల కోసం ప్రయత్నిస్తే.. ‘నువ్వేమైనా దీపికా పదుకొణె, కత్రినా కైఫ్‌లా ఉన్నావనుకుంటున్నావా’, ‘నువ్వు హీరోయిన్లా అందంగా లేవు.. కాబట్టి వచ్చిన ఆఫర్‌ను వదులుకోకుండా అందులో నటించు..’ అనేవారు. ఇలాంటి మాటలు నన్ను నిరుత్సాహ పరచలేదు. నటన పట్ల నాలో మరింత మక్కువను పెంచాయి. అందుకే ఎక్కడ ఆడిషన్ జరిగినా అక్కడికి వెళ్లేదాన్ని. అది చిన్న షూటింగ్ అయినా సరే కెమెరా ముందు నటించేదాన్ని. దంగల్‌కు ముందు నాకంటూ ఎంచుకోవడానికి సినిమాలు, అవకాశాలు ఏమీ లేవు. నాకున్న ఒకే ఒక్క ఛాన్స్ ‘దంగల్’! దీంతో పాటు ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ కూడా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు నటిగా నాకంటూ ఓ గుర్తింపొచ్చింది.. వరుస అవకాశాలూ వస్తున్నాయి..’ అంటూ మొదట్లో తాను కష్టపడినా ప్రస్తుతం సంతోషంగా, సంతృప్తిగా ఉన్నానంటూ చెప్పుకొచ్చిందీ బాలీవుడ్ బేబ్.
‘దంగల్’తో గుర్తింపు!
1997 లో తన ఐదేళ్ల వయసులో ‘ఛాఛీ 420’ సినిమాతో బాలనటిగా వెండితెరపై అడుగుపెట్టింది ఫాతిమా. ఇందులో కమల్‌హాసన్ కూతురిగా నటించింది. ఆపై ‘బడే దిల్వాలా’ అనే సినిమాలోనూ బాలనటిగా మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. ‘నువ్వూ నేను ఒక్కటవుదాం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్నీ పలకరించింది. ఇక 2016లో ‘దంగల్’తో హిట్టుకొట్టిన ఫాతిమా అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2018లో ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ.. ప్రస్తుతం ‘లూడో’, ‘సూరజ్ పే మంగళ్ భరీ’.. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.