‘హలో బాసు..మహా క్లాసు’ అంటూ ‘బాస్’ సినిమాలో అక్కినేని నాగార్జునతో కలిసి స్టెప్పులేసి ఆకట్టుకుంది పూనమ్ బజ్వా. 15 ఏళ్ల క్రితం ‘మొదటి సినిమా’తో కెరీర్ ప్రారంభించిన ఆమె ‘బాస్’ చిత్రంతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి దక్షిణాది సినీ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈక్రమంలో తాజాగా అభిమానులందరినీ ఆశ్చర్యపరుస్తూ తాను ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించిందీ అందాల తార. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా తన ప్రియుడిని పరిచయం చేసిన ఆమె.. వివిధ సందర్భాల్లో అతడితో కలిసి దిగిన ఫొటోలను అందరితో షేర్ చేసుకుంది.
‘బాస్’ సినిమాతో గుర్తింపు!
పంజాబీ కుటుంబానికి చెందిన పూనమ్ ముంబైలో పుట్టి పెరిగింది. తల్లి జయలక్ష్మీ బజ్వా. తండ్రి అమృత్‌సింగ్. చదువుకునే సమయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన పూనమ్.. 2005లో ‘మిస్ పుణే’ కిరీటం గెలుచుకుంది. ఆ తర్వాత నటన మీద ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చింది. ఈక్రమంలో నవదీప్ సరసన ‘మొదటి సినిమా’లో అవకాశం దక్కించుకుంది. ఇందులో సాధారణ మధ్య తరగతి యువతి పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్’, ‘వేడుక’, ‘పరుగు’ వంటి చిత్రాల్లో టాలీవుడ్ అభిమానులను అలరించింది. అదేవిధంగా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరైందీ చిన్నది. టాలీవుడ్ కంటే మాలీవుడ్, కోలివుడ్ సినిమాల్లో ఎక్కువగా నటించిన ఆమె.. ‘యన్.టి.ఆర్ - కథానాయకుడు’ సినిమాతో గతేడాది మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అతిథి పాత్రలో మెరిసి మెప్పించిందీ ముంబై బ్యూటీ.
నిన్ను మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నా!
2019లో విడుదలైన ‘కుప్పతురాజా’ అనే తమిళ సినిమాలో చివరిసారిగా కనిపించింది పూనమ్. అయితే గతంలో ఎప్పుడూ ప్రేమ గురించి మాట్లాడని ఆమె.. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ప్రియుడిని పరిచయం చేసింది. అతని పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన ఈ అందాల తార... వివిధ సందర్భాల్లో అతనితో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ‘సునీల్ రెడ్డి... మై రూట్స్.. గ్రౌండ్.. వింగ్స్... హ్యాండ్సమ్... అందమైన మనసున్న నా లైఫ్ మేట్, సోల్ మేట్‌కు హ్యాపీ బర్త్ డే. నా ఆనందం, ఉత్సాహం, సర్వస్వం నువ్వే. నీతో కలిసి ఉండే ప్రతి క్షణం ఓ మ్యాజిక్‌లా ఉంటుంది. నీ జీవితంలో సంతోషం, ఆరోగ్యం, ప్రేమ, ఫన్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. నిన్ను మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను..!’ అంటూ ప్రియుడిపై ప్రేమను కురిపించింది పూనమ్.
తాను ప్రేమలో ఉన్నట్లు తెలుపుతూ పూనమ్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా నటీనటులు కామ్నా జెఠ్మలానీ, ఆర్తీ చాబ్రియా, సందీప్ కిషన్లతో పాటు అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.