మిస్ వరల్డ్... అందాల పోటీలకు సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే టైటిల్స్‌లో ఇది కూడా ఒకటి. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొనాలని, విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఎన్నో వడపోతలు, మరెన్నో రౌండ్లను చాకచక్యంగా దాటుకుంటూ ‘ప్రపంచ సుందరి’ కిరీటం అందుకోవాలంటే అంత సులభమేమీ కాదు. కానీ 18 ఏళ్ల వయసులోనే ఈ కిరీటాన్ని దక్కించుకుని ప్రపంచాన్ని తన వైపుకి తిప్పుకుంది బాలీవుడ్ అందాల తార ప్రియాంకా చోప్రా. ఈ ముద్దుగుమ్మ ఈ కిరీటం గెలుచుకుని రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈక్రమంలో అప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ సోషల్ మీడియాలో వరుసగా పోస్ట్‌లు షేర్ చేస్తోంది ప్రియాంక.
దేశ చరిత్రలో 2000 సంవత్సరాన్ని మరిచిపోలేనిదిగా చెప్పుకోవచ్చు. 1999లో యుక్తాముఖి మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకుంది. ఈ పరంపరను అలాగే కొనసాగిస్తూ 2000 సంవత్సరంలో లారా దత్తా ‘మిస్ యూనివర్స్’ టైటిల్ దక్కించుకోగా, అదే ఏడాది ప్రియాంక ‘ప్రపంచ సుందరి’గా అవతరించింది. ఈక్రమంలో అప్పుడు చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకుందీ అందాల తార. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆమె... ఆ క్షణంలో తల్లి మధు చోప్రా చెప్పిన మాటలను గుర్తుచేసుకుంది.
‘బేబీ నీ చదువు సంగతేంటి?’అంది!
‘నేను 2000లో ‘మిస్ వరల్డ్’ టైటిల్ గెలుచుకున్న నాటి వీడియో ఇది. అప్పుడు నాకు 18 ఏళ్లు నిండాయి. ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్నాను. ఆ తర్వాత వేదికపై నా కుటుంబ సభ్యులను కలుసుకోవడం, అభినందనలు తెలుపుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే మా అమ్మ నా దగ్గరకు వచ్చి ‘బేబీ... మరి ఇప్పుడు నీ చదువు సంగతేంటి?’ అని అడిగింది’ అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చింది ప్రియాంక.
తెలివి తక్కువగా ప్రశ్నించాను!
2000మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన మధుర జ్ఞాపలకాలన్నింటినీ గుర్తు చేసే ఫొటోలతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. పోటీల్లో భాగంగా ముగ్గురు ఫైనలిస్టులలో ప్రియాంక ప్రపంచ సుందరి టైటిల్ గెలిచిందని ప్రకటించడం, అనంతరం భావోద్వేగంతో ఆమె మిగతా ఇద్దరు ఫైనలిస్టులను కౌగిలించుకోవడం, ఆ తర్వాత తలపై కిరీటం ధరించి అందరికీ అభివాదం చేయడం వంటి సన్నివేశాలు ఇందులో కనిపిస్తాయి. ఇక ఆ సమయంలో ప్రియాంక, ఆమె తల్లి మధుచోప్రా మధ్య చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికర పరిణామాల గురించి గుర్తుచేసుకుంటూ ఇద్దరూ మాట్లాడుకుంటారు. ముందుగా ప్రియాంక తన తల్లిని ‘అమ్మా...నేను ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న క్షణాలు గుర్తున్నాయా?’అని అడుగుతుంది. దీనికి ఆమె తల్లి సమాధానం ఇస్తూ ‘మొదట ఫస్ట్ రన్నరప్‌ను ప్రకటించారు. ఆ తర్వాత మిస్ వరల్డ్‌గా ప్రియాంక పేరును ప్రకటించగానే హాల్ అంతా చప్పట్లు, అరుపులతో మోగిపోయింది. అక్కడకు వచ్చిన భారతీయులంతా నిల్చొని కరతాళ ధ్వనులతో శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో అక్కడున్న నేను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాను. నా కళ్ల నిండా నీళ్లు తిరిగాయి. ముందు నిన్ను గట్టిగా హత్తుకుని అభినందనలు తెలపాలనుకున్నాను. అనుకున్నట్లే నిన్ను ఆనందంతో గట్టిగా కౌగిలించుకున్నాను. కానీ శుభాకాంక్షలు తెలిపే బదులు ‘బేబీ.. మరి ఇప్పుడు నీ చదువు సంగతేటి?’ అని తెలివి తక్కువగా ప్రశ్నించాను’ అని చెప్పుకొచ్చారు మధుచోప్రా.
గెలిచినందుకు చాలా సంతోషించాను.. కానీ!
ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ చోప్రా తన సోదరి మిస్ వరల్డ్‌గా అవతరించిన సమయంలో తన మదిలో మెదిలిన ఆలోచనలను ఈ వీడియోలో పంచుకున్నాడు. ‘అప్పుడు నాకు 11-12 సంవత్సరాల వయసు ఉంటుంది. నాకు బాగా గుర్తుంది. నువ్వు ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకోగానే ఒక్కసారిగా నాలో ఎన్నో రకాల ఆలోచనలు మెదిలాయి. నువ్వు గెలిచినందుకు చాలా సంతోషించాను. కానీ అంతలోనే నేను నా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చాడు. దీనిపై స్పందించిన ప్రియాంక ‘అవును..ఆ క్షణాలు కొంచెం కఠినంగా గడిచాయి. నా విజయం తర్వాత నా కుటుంబం ఎలా స్పందిస్తుందో నేను కూడా ఆలోచించలేదు’ అని చెప్పుకొచ్చింది.
లాక్డౌన్లో పూర్తిగా ఇంటికే పరిమితమైన ప్రియాంక తన 38 ఏళ్ల జీవితానుభవాలకు అక్షర రూపమిస్తూ ‘అన్ ఫినిష్డ్’ అనే పేరుతో ఓ పుస్తకాన్ని రాసింది. ‘పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా’ సంస్థ త్వరలోనే ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆమె ప్రస్తుతం ‘మ్యాట్రిక్స్4’(హాలీవుడ్) సినిమా షూటింగ్‌కు హాజరవుతోంది. దీంతో పాటు ‘ది వైట్ టైగర్’(బాలీవుడ్), ‘ఎస్ఎంఎస్ ఫర్ డిచ్’(హాలీవుడ్) రీమేక్ సినిమాల్లో నటిస్తోందీ గ్లోబల్ బ్యూటీ.