ఒంటరితనం.. కరోనా వచ్చాకే చాలామందికి దీని అసలైన అర్థమేంటో తెలిసింది. వైరస్ సోకి స్వీయ నిర్బంధంలో ఉంటూ కొందరు, వృత్తిరీత్యా కుటుంబానికి దూరంగా ఉంటూ మరికొందరు.. ఇలా ఎక్కడి వారక్కడే ఏకాకిగా మారిపోతున్నారు. ఫలితంగా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. అలాంటి గడ్డు రోజుల్ని తానూ ఎదుర్కొన్నానంటోంది ‘బొమ్మరిల్లు’ బ్యూటీ జెనీలియా డిసౌజా. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రితేష్ దేశ్ముఖ్తో వివాహం తర్వాత పూర్తిగా కుటుంబానికే పరిమితమైన జెన్నీ.. ఇద్దరు కొడుకులతో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది. అయితే ఇలా హ్యాపీగా ఉన్న సమయంలోనే కరోనా వల్ల తన కుటుంబానికి మూడు వారాల పాటు దూరంగా ఉండాల్సి వచ్చిందని తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
హ..హ..హాసిని.. అంటూ ‘బొమ్మరిల్లు’ సినిమాతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేసింది జెనీలియా. ‘బాయ్స్’, ‘హ్యాపీ’, ‘రెడీ’, ‘ఆరెంజ్’.. వంటి తెలుగు చిత్రాలతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు సంపాదించిన ఈ చిన్నది.. 2012లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వారి ప్రేమకు గుర్తుగా రియాన్, రాహిల్ అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. ప్రస్తుతం తన ఇద్దరు చిన్నారులతో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోన్న ఈ అందాల అమ్మ.. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌ను అనునిత్యం పలకరిస్తూనే ఉంటుంది. తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్నీ అభిమానులతో పంచుకుంటుంటుందీ క్యూట్ బేబీ.
ఆ మూడు వారాలు మూడు యుగాలయ్యాయి!
ఈ క్రమంలోనే.. తాను కరోనా వైరస్ బారిన పడ్డానంటూ తాజాగా మరో పోస్ట్ ద్వారా అందరితో పంచుకుందీ క్యూట్ మామ్. చిన్న లేఖ రూపంలో ఉన్న ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది జెన్నీ. తనకు పాజిటివ్ రావడం, ఈ క్రమంలో తనకు ఎదురైన అనుభవాలతో పాటు కరోనా నుంచి బయటపడేందుకు పలు చిట్కాలను సైతం అందించి తన ఫ్యాన్స్‌లో ధైర్యాన్ని నింపిందీ బాలీవుడ్ అందం.
‘మూడు వారాల క్రితం కరోనా పరీక్షలు చేయించుకోగా నాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే నాకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దాంతో గత 21 రోజుల నుంచి నేను ఐసోలేషన్‌లోనే గడిపాను. దేవుడి దయ వల్ల తాజాగా నెగెటివ్ వచ్చింది. ఈ మహమ్మారి నుంచి నేను సులభంగా బయటపడ్డానంటే అదంతా నా అదృష్టమనే చెప్పుకోవాలి. అదే సమయంలో ఈ 21 రోజులు ఒంటరిగా ఐసోలేషన్‌లో గడపడమంటే నాకెంతో సవాలుగా అనిపించింది. ఫేస్‌టైమ్ (వీడియో కాలింగ్ యాప్) ద్వారా కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నప్పటికీ, ప్రతి క్షణం ఆన్లైన్లోనే మునిగి తేలినప్పటికీ ఒంటరితనాన్ని మాత్రం దూరం చేసుకోలేకపోయా. ఏదైతేనేం.. తాజాగా నెగెటివ్ రావడంతో తిరిగి నా కుటుంబం, సన్నిహితుల చెంతకు చేరడం చాలా సంతోషంగా అనిపిస్తోంది.
మీరు కూడా మీ చుట్టూ ఉన్న వారి పట్ల ప్రేమతో మెలగండి.. అదే వారికి కొండంత ధైర్యాన్నిస్తుంది. అలాగే లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోండి.. పోషకాహారం తీసుకోండి.. ఫిట్‌గా ఉండండి.. కరోనా రాకాసితో పోరాడేందుకు ఇవే అసలు సిసలైన మార్గాలు!’ అంటూ కొవిడ్ బాధితుల పట్ల వివక్ష చూపొద్దంటూ చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
మీ పోస్ట్ ఎంతో స్ఫూర్తిదాయకం!
ఇలా జెన్నీ పంచుకున్న తన కరోనా అనుభవాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె పోస్ట్‌ను చూసిన చాలామంది సెలబ్రిటీలు ‘హార్ట్’ ఎమోజీని పోస్ట్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ కాంచీ కౌల్ ‘నువ్వు కరోనాను జయించావు.. చాలా చాలా సంతోషంగా ఉంది జెన్నీ!’ అంటూ కామెంట్ పెట్టింది. కేవలం సెలబ్రిటీలే కాదు.. కొందరు సామాన్యులూ తమ అనుభవాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘నేను కూడా కరోనా బారిన పడ్డాను. మీరు పెట్టిన పోస్ట్ నేను కరోనాను జయించగలనన్న ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నాలో నింపుతుంది..’ అంటూ తన కొవిడ్ అనుభవాన్ని పంచుకున్నారు.
Also Read:
కరోనా నుంచి కోలుకుంటున్నా.. కానీ వాళ్ళ గురించి భయంగా ఉంది!
అక్కడి నుంచి తిరిగి రాగానే కరోనా బారిన పడ్డాను!
అలా నేనూ కరోనా బారిన పడ్డా!
5 నెలలుగా ఇంట్లోనే ఉన్నాం... అయినా మాకు కరోనా సోకింది!