శ్రీలంకలో పుట్టి పెరిగినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా భారతీయులకు దగ్గరైంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. అందం, అభినయం కలగలసిన ఈ అందాల తార పలు సూపర్‌హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. గతేడాది విడుదలైన ‘సాహో’ సినిమాలో ప్రభాస్ పక్కన స్టెప్పులేసి టాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఇలా తన సినిమాలతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న ఈ శ్రీలంకన్ బ్యూటీ సమాజ సేవలోనూ ముందుంటుంది. తాజాగా తన పుట్టిన రోజు (ఆగస్టు 11)ని పురస్కరించుకుని మరో మంచి నిర్ణయం తీసుకుందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న రెండు గ్రామాల ప్రజలను దత్తత తీసుకుంది జాక్వెలిన్. ఇందులో భాగంగా ఆ గ్రామాల్లో ఉంటున్న సుమారు 1,550 మందికి మూడేళ్ల పాటు అవసరమైన ఆహార సామగ్రిని సమకూర్చేందుకు ముందుకొచ్చింది.
‘అలాదిన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాక్వెలిన్. ఆ తర్వాత ‘హౌస్‌ఫుల్’ సిరీస్, ‘రేస్ సిరీస్’, ‘మర్డర్ 2’, ‘రాయ్’, ‘బ్రదర్స్’, ‘కిక్’, ‘డిష్యూం’ ‘జుద్వా 2’, ‘డ్రైవ్’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదేవిధంగా ‘బాఘీ 2’, ‘సాహో’ తదితర సినిమాల్లో ప్రత్యేక గీతాల్లోనూ నటించి మెప్పించింది. అందమైన రూపంతో పాటు తనకు అందమైన మనసు కూడా ఉందని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకుందీ బ్యూటీ. తాజాగా తన పుట్టిన రోజును పురస్కరించుకుని మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జాక్వెలిన్.
పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు!
భారతదేశంలో పోషకాహార లోపం కారణంగా మరణించే చిన్నారులు, మహిళల సంఖ్య ఏటేటా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. సరైన ఆహారం, శుభ్రమైన తాగునీరు అందకపోవడమే ఈ మరణాలకు కారణమని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో పోషకాహార సమస్యను అధిగమించేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తానంటూ ముందుకొచ్చింది జాక్వెలిన్. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని పతార్డి, సాకూర్ అనే రెండు గ్రామాలను దత్తత తీసుకుంది జాక్వెలిన్. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ రెండు గ్రామాల్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న సుమారు 1,550 మందికి మూడేళ్ల పాటు సరిపడా ఆహార సామగ్రిని సమకూర్చనుందీ అందాల తార. అక్కడి ప్రజలకు ఈ సమస్యపై మరింత అవగాహన పెంచేందుకు పలు అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపట్టనుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాక్వెలిన్ తన ప్రాజెక్టు వివరాల గురించి ఇలా చెప్పుకొచ్చింది.
ఎప్పటి నుంచో ఈ ఆలోచన ఉంది!
‘కరోనా మహమ్మారి ప్రభావంతో ఈ ఏడాది అందరికీ కఠినంగా మారిపోయింది. ఈ ఆపత్కాలంలో మనలో చాలామంది ప్రాథమిక అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమే నా వంతుగా ఈ రెండు గ్రామాలను దత్తత తీసుకున్నాను. నా మనసులో ఎప్పటి నుంచో ఈ ఆలోచన ఉంది. అది ఇప్పటికి నెరవేరింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 1,550 మంది ప్రజల బాగోగుల బాధ్యతలను మేం తీసుకుంటున్నాం. స్త్రీలు, చిన్నారులతో పాటు అందరికీ పోషకాహార సమస్యకు సంబంధించిన ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం. ఈ సమస్యను అధిగమించేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపడతాం. ఇక మొదటిసారి తల్లులయిన మహిళల రక్షణకు మరింత ప్రాధాన్యమిస్తాం. నవజాత శిశువుల సంరక్షణ కోసం గ్రామాల్లో ఆరోగ్య సిబ్బందితో ప్రత్యేక కిచెన్ గార్డెన్లు ఏర్పాటుచేయిస్తాం. ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం కొందరు నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తాం’ అని చెబుతోంది జాక్వెలిన్.
నా తల్లిదండ్రుల నుంచే నేర్చుకున్నా!
ఇప్పుడే కాదు గతంలోనూ పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగమైంది జాక్వెలిన్. ఇందులో భాగంగా పెటాతో చేతులు కలిపి ముంబయిలో గుర్రపు బండి సవారీలకు చరమగీతం పాడడంలో ముఖ్య పాత్ర పోషించింది. దీంతో పాటు మరిన్ని సందర్భాల్లో జంతు సంరక్షణపై తాను చూపిన చొరవకు గాను 2014లో పెటా నుంచి 'వుమెన్ ఆఫ్ ది ఇయర్'గా గుర్తింపు సొంతం చేసుకుంది. పిల్లల ప్రాథమిక విద్య కోసం పనిచేస్తున్న ప్రథమ్ అనే స్వచ్ఛంద సంస్థ కోసం భారీ మొత్తంలో నిధులను అందించింది. ఇక 2015లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో వచ్చిన వరదల్లో బాధితులకు సహాయం చేయడం కోసం 'జాక్వెలిన్ బిల్డ్స్' అనే ప్రచార కార్యక్రమం ద్వారా నిధుల్ని సమకూర్చి తన వంతుగా వారికి సహాయపడింది. వీటితోపాటు సముద్ర పరిరక్షణపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈనేపథ్యంలో తన తల్లిదండ్రులను చూసే ఈ సేవా స్ఫూర్తి కలిగిందంటోంది జాక్వెలిన్.
‘నేను చిన్నప్పటి నుంచి అమ్మానాన్నలను చూస్తూ పెరిగాను. వారి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. మనకెంతో ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వడమనేది కూడా నా తల్లిదండ్రులు నేర్పించినదే. రెండు గ్రామాలను దత్తత తీసుకోవాలన్న నా నిర్ణయాన్ని వారు ఎంతో సంతోషంగా స్వాగతించారు’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ శ్రీలంకన్ బ్యూటీ.
‘మనకెంతో ఇచ్చిన ఈ సమాజానికి కొంతైనా తిరిగి ఇవ్వాలిగా’ అంటున్న జాక్వెలిన్ ఉదార స్వభావంపై ప్రముఖులతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే లాక్డౌన్ కారణంగా జాక్వెలిన్ కూడా ఇంటికే పరిమితమైంది. ఈ మధ్యకాలంలో ‘తేరేబినా’ అంటూ సల్మాన్‌ఖాన్‌తో ఆమె కలిసి నటించిన మ్యూజిక్ ఆల్బమ్ సంగీతాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అదేవిధంగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘మిస్టర్ సీరియల్ కిల్లర్’ సినిమాలోనూ సందడి చేసిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె జాన్ అబ్రహాంతో కలిసి ‘అటాక్’ అనే సినిమా చేస్తోంది.