జయసుధ... నాలుగున్నర దశాబ్దాలుగా సినీ కళామతల్లికి సేవలు అందిస్తున్న ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలనాడు కథానాయికగా కుర్రకారు మనసులు దోచుకున్న ఆమె... నేడు మోడ్రన్ మదర్‌గా వైవిధ్యమైన పాత్రల్లో మెప్పిస్తున్నారు. ఇలా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిలో ‘సహజనటి’గా సుస్థిర స్థానం సంపాదించుకున్న జయసుధ చివరిగా రెండేళ్ల క్రితం ‘రూలర్’ సినిమాలో నటించారు. ఆ సినిమా తర్వాత ఎక్కడా కనిపించని ఆమె చాలా రోజుల తర్వాత మన ముందుకొచ్చారు. ఇందులో భాగంగా ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ బృందానికి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారీ అందాల తార.
చాలా రోజుల తర్వాత!
14 ఏళ్ల వయసులో బాలనటిగా వెండితెరకి పరిచయమయ్యారు జయసుధ. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, రజనీకాంత్, కమల్‌హాసన్ లాంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించారు. తన అందం, అభినయంతో శ్రీదేవి, జయప్రద లాంటి గ్లామర్ కథానాయికల మధ్య తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 1990ల్లో కూడా ‘మనీ’, ‘హేండ్సప్’ లాంటి సినిమాలతో మెప్పించిన ఈ అందాల తార... ఆ తర్వాత తల్లి పాత్రలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ‘బొమ్మరిల్లు’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘కొత్త బంగారు లోకం’లో ఆమె పోషించిన అమ్మ పాత్రలను ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. ఇక ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ , ‘బ్రహ్మోత్సవం’, ‘శతమానం భవతి’, ‘శ్రీనివాస కల్యాణం’, ‘మహర్షి’ వంటి హిట్ చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించిన ఆమె చివరిగా 2019లో విడుదలైన ‘రూలర్’ చిత్రంలో కనిపించారు.
ఇక జయసుధ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే... 1985లో ఆమె నితిన్ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ నిహార్, శ్రేయాన్ అనే ఇద్దరు కుమారులున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో నితిన్ కపూర్ మరణించారు. ప్రస్తుతం తన ఇద్దరు కుమారుల దగ్గరే ఉంటోన్న ఆమె గతేడాది తన పెద్ద కుమారుడు నిహార్ వివాహాన్ని ఘనంగా చేశారు.
‘జానకి కలగనలేదు’ అంటూ!
1983లో జయసుధ, శోభన్‌బాబు జంటగా ‘రాజ్‌కుమార్’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాలోని ‘జానకి కలగనలేదు... రాముడి సతి కాగలనని ఏనాడు’ అనే పాట అప్పట్లో ఓ పెద్ద ప్రభంజనమే సృష్టించింది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ఈ పాట పేరుతోనే ఓ కొత్త సీరియల్ ప్రారంభం కానుంది. దీంతో ఆ సీరియల్ బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు జయసుధ.
‘జానకి కలగనలేదు’ అనే కొత్త సీరియల్ త్వరలో మన ముందుకు రాబోతోంది. ‘రాజ్ కుమార్’ సినిమాలో నేను, శోభన్‌బాబు కలిసి నటించిన ఈ పాట అప్పట్లో పెద్ద ప్రభంజనమే సృష్టించింది. ఇప్పటికీ ఎక్కడ పాటల పోటీలు జరిగినా... ఆ పాట ఎవరో ఒకరు పాడుతున్నారు. ఇళయరాజా గారు సంగీతం అందించిన ఈ పాటను ఊటీలో షూట్ చేశాం. ఆ పాట పేరుతో సీరియల్ రావడం సంతోషంగా ఉంది. ఇది పెద్ద హిట్ కావాలి’ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారీ అందాల తార.
మా ‘సహజనటి’కి ఏమైంది?
ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత తమ అభిమాన నటిని చూసి సంతోషించిన అభిమానులు... ఆమె లుక్ విషయంలో మాత్రం తెగ ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే మొన్నటివరకు మనకు కనిపించిన జయసుధకు పూర్తి డిఫరెంట్ లుక్‌లో ఆమె ఈ వీడియోలో కనిపించారు. ఉన్నట్లుండి తన వయసు ఒక్కసారిగా పెరిగిపోయినట్లు పూర్తిగా నెరిసిన జుట్టు, పాలిపోయిన ముఖంతో ఉన్న జయసుధను చూసి అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మా సహజ నటికి ఏమైంది’, ‘ఆమె ఎందుకిలా మారిపోయారు’ అంటూ అభిమానులు, నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.