బిగ్‌బాస్.. ఈ టీవీ కార్యక్రమానికి ఉన్న పాపులారిటీ, ప్రత్యేకతే వేరు! వివిధ భాషల్లో ప్రసారమవుతోన్న ఈ షోకు విపరీతమైన జనాదరణ ఉంది. ఏటా ఓ సీజన్‌తో మన ముందుకొస్తోన్న ఈ టీవీ షో.. ఏ భాషలో ప్రసారమైనప్పటికీ అందరి కళ్లూ విజేత ఎవరవుతారన్న ఆతృతతోనే ఎదురుచూస్తుంటాయి. అలా ఈసారి హిందీ బిగ్‌బాస్-14 విజేతగా నిలిచింది టీవీ నటి రుబీనా దిలాయిక్. ప్రపంచంతో సంబంధం లేకుండా 143 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో గడిపిన ఆమె.. తన పెర్ఫార్మెన్స్తో ఇతర కంటెస్టెంట్స్‌కి గట్టి పోటీ ఇచ్చింది. అందుకే ఈ సీజన్ విజేతగా నిలిచి ట్రోఫీతో పాటు రూ. 36 లక్షల నగదు బహుమతిని సొంతం చేసుకుంది. మరి, షో ఆద్యంతం తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో, పోటీతత్వంతో అలరించిన రుబీనా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి..
‘ఛోటీ బహూ’ అనే సీరియల్లో రాధిక పాత్రతో టీవీ తెరకు పరిచయమైంది రుబీనా. సిమ్లాలో 1987, ఆగస్టు 26న జన్మించిన ఆమె.. అక్కడే చదువు పూర్తి చేసింది. కాలేజీలో ఉన్న సమయంలోనే స్థానికంగా రెండు అందాల పోటీల్లో పాల్గొని గెలిచిన రుబీనా.. 2006లో ‘మిస్ సిమ్లా’, 2008లో ‘మిస్ నార్త్ ఇండియా’గా విజయం సాధించింది.
ఐఏఎస్ కావాలనుకొని..!
మనమొకటనుకుంటే దైవమొకటి తలుస్తాడంటారు.. రుబీనా విషయంలోనూ ఇదే జరిగింది. నిజానికి ఐఏఎస్ కావాలని కలలు కందామె. ఇందులో భాగంగానే సివిల్స్‌కు సన్నద్ధమయ్యే సమయంలో ‘ఛోటీ బహూ’ సీరియల్ ఆడిషన్స్‌కు హాజరైంది రుబీనా. కానీ అందులో తాను ఎంపికవుతానని అస్సలు అనుకోలేదు. అలా ఆ సీరియల్లో అవకాశం దక్కించుకొన్న ఆమె ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ఆపై ‘ఛోటీ బహూ’ సీరియల్ సీక్వెల్‌తో పాటు ‘సాస్ బినా ససురాల్’, ‘పునర్వివాహ్-ఏక్ నయీ ఉమీద్’, ‘శక్తి-అస్తిత్వ కే ఎహ్సాస్ కీ’.. వంటి ధారావాహికలతో తనని తాను నిరూపించుకుందీ ముద్దుగుమ్మ. ‘శక్తి’ సీరియల్‌కు ఉత్తమ నటిగా (జ్యూరీ) ఇండియన్ టీవీ అకాడమీ పురస్కారం అందుకున్న ఆమె.. ఈస్టర్న్ ఐ విడుదల చేసిన 50 మంది ‘సెక్సీయెస్ట్ ఏషియన్ ఉమెన్’ జాబితాలో పదకొండో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత ఏడాది ఇదే లిస్టులో పదో స్థానానికి ఎగబాకిందీ టీవీ తార.
మూడేళ్ల ప్రేమ.. నూరేళ్ల బంధం!
టీవీ సీరియల్స్‌తో బిజీగా ఉన్న సమయంలోనే మోడల్, నటుడు అయిన అభినవ్ శుక్లాతో ప్రేమలో పడింది రుబీనా. 2015లో ఓ వేడుకలో మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా వీరి పరిచయం జరిగింది. అది కాస్తా ప్రేమగా మారడంతో మూడేళ్ల పాటు డేటింగ్ చేసిందీ జంట. ఆ తర్వాత 2018, జూన్ 21న సిమ్లాలోనే ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు రుబీనా-అభినవ్. తమ వైవాహిక బంధాన్ని నిత్యనూతనం చేసుకుంటూ ముందుకు సాగుతోన్న ఈ క్యూట్ కపుల్.. వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ దంపతులందరికీ రిలేషన్షిప్ పాఠాలు నేర్పుతుంటారు. అంతేకాదు.. ఈ సీజన్ బిగ్‌బాస్‌లోనూ కలిసే పాల్గొని ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందీ జంట.
నేనేంటో తెలుసుకున్నా!
బిగ్‌బాస్-14 విజేతగా అవతరించిన మరుక్షణం తనను సపోర్ట్ చేసి, ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన రుబీనా.. ఇదంతా ఓ కలలా ఉందంటూ మురిసిపోయింది.
‘ప్రస్తుతం నేనెంత హ్యాపీగా ఉన్నానో చెప్పడానికి మాటలు చాలవు. హౌస్‌లోకి అడుగుపెట్టినప్పుడే ఇక్కడిదాకా రావాలనుకున్నా.. ఇక ఇప్పుడు ట్రోఫీ గెలవడం ఓ కలలా అనిపిస్తోంది. హౌస్‌లో ఈ 143 రోజులు నేను చేసిన ప్రయాణం అద్భుతం. ఈ క్రమంలో నన్ను నేను తెలుసుకోగలిగా.. చాలా గర్వంగా అనిపిస్తోంది. నేను బిగ్‌బాస్ విజేతగా నిలవడంలో నా భర్త అభినవ్ ప్రోత్సాహం ఎంతగానో ఉంది.. తను నాతో పాటు హౌస్‌లో ఉన్నన్నాళ్లూ ఇద్దరం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇవే మా మధ్య అనుబంధాన్ని మరింత దృఢం చేశాయేమో! స్వేచ్ఛగా బయటి ప్రపంచంలో ఉన్నప్పుడు సవాళ్లు ఎదురైతే వాటి నుంచి తప్పించుకోవచ్చేమో గానీ.. ఇలా ఒక ఇంట్లో బంధించి ఉంచినప్పుడు మనం ముందుకు సాగాలంటే ఆ సవాళ్లను ఎదుర్కోవడానికి పోరాటం చేయాల్సిందే! ఈ జర్నీలో నేను నేర్చుకుంది అలాంటి పోరాట తత్వమే’ అంటూ తన బిగ్‌బాస్ జర్నీ గురించి పంచుకుంది రుబీనా.
ఫ్యాషన్ బేబ్!
* ఇంటీరియర్ డిజైనింగ్ అంటే మక్కువ చూపే రుబీనా.. దీనికి సంబంధించిన కోర్సు కూడా చేసింది. అంతేకాదు.. ప్రస్తుతం ఓవైపు నటిగా తన వృత్తిని కొనసాగిస్తూనే.. మరోవైపు ఇంటీరియర్ డిజైనర్‌గా తన ప్రవృత్తిని సైతం కొనసాగిస్తోంది. * స్కూల్లో చదువుకునే రోజుల్లో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ కనబరిచిందీ బ్యూటీ. * తన నట ప్రతిభకు గుర్తింపుగా 2015లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకుందీ సిమ్లా అందం. * సీరియల్స్‌లోనే కాదు.. ‘బరేలీ కీ బేటీ : ది యంగెస్ట్ సర్వైవర్’ అనే షార్ట్ ఫిల్మ్‌లోనూ నటించింది రుబీనా.
* లేటెస్ట్ ఫ్యాషన్స్, విభిన్న హెయిర్‌స్టైల్స్‌పై ఆసక్తి కనబరిచే ఆమె.. ఈ క్రమంలో తాను ధరించిన ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్స్, వేసుకున్న హెయిర్స్టైల్స్కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. * కాయగూరలు, పండ్ల రసాలు, నీళ్లు ఎక్కువగా తాగడం, కొబ్బరి నూనె.. ఇవే తన మృదువైన చర్మం వెనకున్న అసలు సిసలైన రహస్యాలంటూ ఓ సందర్భంలో తన బ్యూటీ సీక్రెట్స్ గురించి పంచుకుందీ బిగ్‌బాస్ సుందరి. * మనసుకు బాధగా, ఒత్తిడిగా అనిపించినప్పుడు యోగాతో ఆ మానసిక స్థితి నుంచి బయటపడతానంటోన్న ఈ ముద్దుగుమ్మ.. అందుకోసం ఆరోగ్యంగా ఉండడమూ ముఖ్యమేనంటోంది. ఈ క్రమంలో తాను చేసే యోగాసనాలు, ఇతర వ్యాయామాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టా వేదికగా పంచుకుంటుంటుంది.
|
ఇష్టమైనవి ఇవే!
* నటీనటులు - అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, లియోనార్డో డికాప్రియో * సినిమాలు - టైటానిక్, హమ్ ఆప్కే హై కౌన్ * ప్రదేశం - ఫ్రాన్స్ * రంగు - నియాన్ కలర్స్ * కార్టూన్ సిరీస్ - టామ్ అండ్ జెర్రీ * కేక్ - రెడ్ వెల్వెట్ ఛీజ్ కేక్
|
ఇలా ‘బిగ్‌బాస్-14’ సీజన్ విజేతగా నిలిచిన రుబీనాపై ప్రస్తుతం సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఫాలోవర్ల విషయానికొస్తే.. ఇన్‌స్టాలో 3.6 మిలియన్ల మంది, ట్విట్టర్లో 2 లక్షలకు పైగా అభిమానులు ఈ బుల్లితెర బ్యూటీని ఫాలో అవుతున్నారు.
కంగ్రాట్స్ రుబీనా!