భర్తతో పదేళ్ల ప్రేమ బంధం... రెండేళ్ల దాంపత్య బంధానికి ప్రతిరూపంగా కొన్ని నెలల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది నటి మేఘనా రాజ్. దీంతో తనను విడిచి వెళ్లిన చిరంజీవే మళ్లీ తన దగ్గరకు వచ్చాడని తెగ సంబరపడిపోయింది. తన భర్త వదిలి వెళ్లిన మధుర జ్ఞాపకాలను కుమారుడిలో చూసుకుంటూ మురిసిపోయింది. ఈ క్రమంలో బిడ్డే సర్వస్వంగా బతుకుతోన్న మేఘన తాజాగా తన రాకుమారుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ క్రమంలో తన భర్త జ్ఞాపకార్థం కుమారుడికి ‘జూనియర్ చిరు’ (సింబా) అని నామకరణం చేసినట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపింది. ఈ సందర్భంగా తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలతో మేఘన షేర్ చేసుకున్న ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
తన రాకుమారుడిని పరిచయం చేస్తూ!
ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా గతేడాది జూన్ 7న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటికే మూడు నెలల గర్భవతి అయిన చిరు భార్య నటి మేఘనతో పాటు అతడి కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే తన భర్త భౌతికంగా దూరమైనా, తన మనసులో శాశ్వతంగా నిలిచి ఉంటారంటూ భర్త కటౌట్ పెట్టుకుని సీమంతం చేసుకుంది మేఘన. గతేడాది అక్టోబర్ 22న ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె... తన భర్త జ్ఞాపకార్థం ఆ చిన్నారికి ‘జూనియర్ సి (చిరు)’ అని ముద్దుపేరు కూడా పెట్టుకుంది. ఇక ఆ చిన్నారికి వేడుకగా బారసాల చేసి నామకరణం చేయాలనుకున్న సమయంలో దురదృష్టవశాత్తూ తల్లీకొడుకులిద్దరూ కరోనా బారిన పడ్డారు. ఇక బాబు పుట్టిన తర్వాత పిల్లాడికి సంబంధించిన విషయాలను అటు మేఘన కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా వెల్లడించలేదు. ఈ క్రమంలో తన బిడ్డను అందరికీ పరిచయం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది మేఘన.
నేను మీ జూనియర్ చిరు!
సుమారు ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో అక్టోబర్ 22, 2017న జరిగిన దివంగత నటుడు చిరంజీవి సర్జా-మేఘనల నిశ్చితార్థంతో ప్రారంభమవుతుంది. సరిగ్గా మూడేళ్ల తర్వాత అదే రోజు (అక్టోబర్ 22, 2020)న మేఘన జూనియర్ చిరుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవి, మేఘన చిన్ననాటి ఫొటోలు... భర్త చిత్రపటం దగ్గరకు కుమారుడిని తీసుకెళ్లి తండ్రి దీవెనలు అందించడం లాంటి మధుర జ్ఞాపకాలతో ఈ వీడియోను రూపొందించారు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మేఘన ‘నేను పుట్టక ముందు నుంచే మీరు నన్ను ఎంతో అభిమానిస్తున్నారు. మొదటిసారి మిమ్మల్ని కలుసుకుంటున్న సందర్భంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అమ్మా.. అప్పాతో పాటు మా కుటుంబ సభ్యులందరిపై మీరు చూపుతోన్న ప్రేమానురాగాలకు కృతజ్ఞతలు. నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను... నేను మీ జూనియర్ చిరు’ అంటూ తన కుమారుడి తరఫున చెప్పుకొచ్చిందీ అందాల తార.
జూనియర్ సింబా ఎంతో క్యూట్!
తన కుమారుడిని పరిచయం చేస్తూ మేఘన షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ‘సూపర్బ్ వీడియో... జూనియర్ చిరు చాలా క్యూట్‌గా ఉన్నాడు’, ‘చిరంజీవి సర్జాను మళ్లీ చూసినట్లుంది.. కంగ్రాట్స్’ అంటూ పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు తల్లీకొడుకులిద్దరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.
‘పొగరు’ చూపించేలా!
చిరంజీవి సర్జా సోదరుడు ధ్రువ్ సర్జా, బ్యూటీ క్వీన్ రష్మిక మందన నటించిన ‘పొగరు’ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ధ్రువ్‌కు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది మేఘన. ‘పొగరు’ సినిమాకు సంబంధించిన ఫిల్టర్స్‌తో తన కుమారుడిని జత చేస్తూ రూపొందించిన ఈ వీడియో కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.