అనిర్వచనీయమైన ఆనందాన్నిచ్చే అమ్మతనం ఆడవారికి మాత్రమే దక్కిన గొప్ప వరం. ఎన్నెన్నో సందేహాలు, మది నిండా సంతోషంతో కొత్తగా తల్లయ్యే అమ్మలందరూ తొలిసారి అమ్మతనాన్ని ఆస్వాదిస్తే.. ఇప్పటికే అమ్మగా ప్రమోషన్ పొందిన మహిళలు అటు అనుభవం, ఇటు మాతృత్వపు మాధుర్యం కలగలిసిన ఈ సరికొత్త అనుభూతిని తనివితీరా ఆస్వాదిస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి అంతులేని ఆనందంలోనే మునిగితేలుతోంది బాలీవుడ్ అందాల తార లిసా హెడెన్. నాలుగేళ్ల క్రితం జాక్ అనే పండంటి మగబిడ్డను ప్రసవించిన ఈ ముద్దుగుమ్మ గతేడాది ఫిబ్రవరిలో లియో అనే మరో బాబుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతోంది ఈ అందాల అమ్మ. ఈ సందర్భంగా ఓ బ్యూటిఫుల్ వీడియోతో తానే స్వయంగా ఈ శుభవార్తను అందరితో షేర్ చేసుకుందీ బ్యూటిఫుల్ మామ్. దీంతో అటు సెలబ్రిటీలు, ఇటు అభిమానుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మళ్లీ అమ్మను కాబోతున్నా!
చెన్నైకి చెందిన లిసా మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. 2010లో ‘ఐషా’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ‘రాస్కెల్స్’, ‘క్వీన్’, ‘హౌస్‌ఫుల్ 3’, ‘యే దిల్ హై ముష్కిల్’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘రచ్చ’ చిత్రంలోని ఓ పాటలో కనిపించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. వెండితెరతో పాటు ‘ఇండియాస్ నెక్ట్స్ టాప్ మోడల్’, ‘ద ట్రిప్’ వంటి టీవీ షోలు, కార్యక్రమాలతో బుల్లితెర పైనా సందడి చేసింది. ఇలా మోడల్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా, నటిగా బాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న లిసా 2016లో డినో లల్వానీ అనే బ్రిటిష్ వ్యాపారవేత్తను వివాహమాడింది. తమ దాంపత్య బంధానికి గుర్తుగా 2017లో జాక్ లల్వానీ అనే మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ అందాల తార గతేడాది ఫిబ్రవరిలో లియో అనే ఓ బాబుకు జన్మనిచ్చింది.
బోల్డ్ అండ్ బ్యూటిఫుల్!
‘బోల్డ్ అండ్ బ్యూటిపుల్’గా పేరున్న లిసా మొదటిసారి గర్భం దాల్చినప్పుడు బికినీలో తన బేబీ బంప్‌ని ప్రదర్శిస్తూ తల్లులందరి మదిలో ప్రెగ్నెన్సీపై ఉండే అపోహలు, మూసధోరణుల్ని బద్దలు కొట్టింది. ఆ తర్వాత తల్లి పాల ఆవశ్యకత, ప్రసవం తర్వాత బరువు తగ్గడం.. మొదలైన అంశాల గురించి సోషల్ మీడియా ద్వారా మహిళల్లో స్ఫూర్తి నింపింది. ఈ క్రమంలో మాతృత్వపు మాధుర్యాన్ని వివరిస్తూ గతంలో పలు ఫొటోలు షేర్ చేసిన ఆమె... తాజాగా మనసుకు హత్తుకునే ఓ వీడియోతో తాను మూడోసారి తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది.
జూన్‌లో నంబర్ 3 !
ఈ సందర్భంగా ‘ఈ జూన్‌లో నంబర్ 3 రాబోతున్నారు’ అన్న క్యాప్షన్‌తో ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది లిసా. ఇందులో ‘ఇన్నాళ్లూ ఈ శుభవార్తను పంచుకోలేకపోయాను. ఇప్పుడు నేను మీతో ఛాట్ చేయడానికి ఓ కారణం ఉంది’ అంటూ తన ప్రెగ్నెన్సీ విషయం చెబుతున్న లిసా దగ్గరకు ఆమె పెద్ద కుమారుడు జాక్ వస్తాడు. దీంతో ఆమె ‘జాకీ... అమ్మ కడుపులో ఎవరు ఉన్నారో అందరికీ చెప్తావా’ అని అడగ్గా... ‘చెల్లెలు’ అని సమాధానం చెప్తాడు జాక్.
మూడోసారి అమ్మగా ప్రమోషన్ పొందనున్నానంటూ లిసా షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఇసాబెల్లా, షిబానీ దండేకర్ లాంటి సెలబ్రిటీలతో పాటు పలువురు అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.