కరోనా కారణంగా ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో చాలామందికి తెలిసొచ్చింది. వైరస్ సోకి స్వీయ నిర్బంధంలో ఉంటూ కొందరు; ఆస్పత్రులు, క్వారంటైన్ సెంటర్లలో చికిత్స పొందుతూ మరికొందరు... ఇలా ఎక్కడి వారక్కడే ఏకాకిగా మిగిలిపోతున్నారు. ఫలితంగా ఒంటరితనంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. అలాంటి గడ్డు పరిస్థితుల్ని తానూ ఎదుర్కొన్నానంటోంది హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. పదేళ్ల క్రితం పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో కలిసి పెళ్లిపీటలెక్కిన ఈ టెన్నిస్ క్వీన్ రెండేళ్ల క్రితం ఇజాన్‌కు జన్మనిచ్చింది. అమ్మయ్యాక అటు కుటుంబ బాధ్యతల్ని నెరవేరుస్తూనే... ఇటు తన కెరీర్‌నూ కొనసాగిస్తోందీ సూపర్ మామ్. ఈక్రమంలో తన కుమారుడి ఆలనాపాలనలో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోన్న సానియా కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిందట. ఈ కారణంగా కొద్ది రోజుల పాటు తన కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చిందంటూ తన అనుభవాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరితో షేర్ చేసుకుందీ టెన్నిస్ బ్యూటీ. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
నాకూ కరోనా సోకింది!
క్యాలెండర్ మారినా కరోనా మాత్రం ప్రపంచాన్ని వీడడం లేదు. కంటికి కనిపించకుండా, లక్షణాలు తెలియనివ్వకుండా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, కొత్త రకం ‘స్ట్రెయిన్’ అంటూ అందరినీ కలవరపాటుకు గురిచేస్తోందీ మహమ్మారి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత అప్రమత్తంగా ఉంటున్నా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. అదే సమయంలో ఇంకా సరైన మందు లేని ఈ మహమ్మారిని మనోధైర్యంతో జయిస్తున్నారు. సరైన సమయంలో వైద్యం తీసుకుని వైరస్‌పై విజయం సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే తాను కూడా కరోనా వైరస్ బారిన పడ్డానంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా తాజాగా ఓ పోస్ట్ పెట్టింది సానియా. ఈక్రమంలోనే కొవిడ్‌కు సంబంధించి తన అనుభవాలను అందరితో షేర్ చేసుకుంది.
అదే నాకు అత్యంత కష్టమనిపించింది!
‘ఈ ఏడాది ప్రారంభంలో నా జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే...నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే దేవుడి దయ వల్ల ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నా. వైరస్‌కు సంబంధించి నా అనుభవాలను పంచుకోవాలని ఇలా మీ ముందుకొచ్చాను. కరోనా సోకినప్పటికీ అదృష్టవశాత్తూ నాకెలాంటి లక్షణాలూ కనిపించలేదు. అయినా ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్‌లో ఉన్నాను. అయితే ఈ సమయంలో నా రెండేళ్ల కుమారుడికి, కుటుంబానికి దూరంగా ఉండడం నాకు అత్యంత కష్టంగా అనిపించింది. అదే సమయంలో కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురై, ఆస్పత్రిలో ఒంటరిగా, కుటుంబానికి, ఆత్మీయులకు దూరంగా ఉంటోన్న వారి పరిస్థితిని ఊహించుకోలేకపోతున్నాను’.
ఎవరూ కరోనాను జోక్‌గా తీసుకోవద్దు!
‘కొవిడ్‌కు సంబంధించి రోజుకో కొత్త లక్షణం, రోజుకో కొత్త కథ వింటున్నప్పుడు అటు శారీరకంగానూ, ఇటు మానసికంగానూ ఎంతో మథన పడాల్సి వస్తుంది. కొద్దో గొప్పో నేను అదృష్టవంతురాలిని కాబట్టే త్వరగా ఈ మహమ్మారి నుంచి కోలుకున్నాను. కానీ ఈ క్రమంలో నా కుమారుడు, కుటుంబం నుంచి దూరంగా ఉండడాన్ని మాత్రం తట్టుకోలేకపోయాను. తిరిగి వారిని ఎప్పుడు చూస్తానో అంటూ తీవ్ర మనోవేదనకు గురయ్యా. అందుకే కరోనా మహమ్మారిని ఎవరూ జోక్‌గా తీసుకోవద్దు. ఈ వైరస్ ఇప్పటికీ వ్యాప్తి చెందుతూనే ఉంది. దీని నుంచి మన కుటుంబ సభ్యులు, స్నేహితులను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటిద్దాం. నిత్యం మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా మన ఆత్మీయులను కాపాడుకుందాం. కరోనాను ఓడించేందుకు కలిసికట్టుగా యుద్ధం చేద్దాం..!’ అంటూ తన అభిమానుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసిందీ సూపర్ మామ్.
అది చాలా కష్టం!
ఇలా సానియా పంచుకున్న తన కరోనా అనుభవాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె పోస్ట్‌ను చూసిన చాలామంది సెలబ్రిటీలు ‘హార్ట్’ ఎమోజీలను పోస్ట్ చేస్తూ వైరస్‌ను జయించిన సానియాను అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ‘బొమ్మరిల్లు’ బ్యూటీ జెనీలియా డిసౌజా ‘నిజమే..నువ్వు చెప్పినట్లు పిల్లలకు దూరంగా ఉండడం అత్యంత కష్టమైన విషయం. అందరూ క్షేమంగా ఉండాని కోరుకుంటున్నా!’ అని కామెంట్ పెట్టింది. త్రిష, అనన్యా బిర్లా, పూర్ణా పటేల్, సోఫీ చౌదరి.. తదితర సెలబ్రిటీలతో పాటు కొందరు సామాన్యులు తమ అనుభవాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు.