తమకు పుట్టబోయే బుజ్జి పాపాయిని ఊహించుకోవడం, ఎప్పుడెప్పుడు తమ ముద్దుల చిన్నారిని చేతుల్లోకి తీసుకుందామా అని ఆత్రంగా ఎదురుచూడడం... ఇలా ప్రతిక్షణం పుట్టబోయే బిడ్డ ఆలోచనల్లోనే గడపడం తల్లయ్యే ప్రతి మహిళకు సహజమే. ఇక పుట్టబోయేది తొలుచూరు బిడ్డ అయితే కాబోయే తల్లిదండ్రుల ఆనందానికి అంతే ఉండదు. మరికొన్ని రోజుల్లో తమ గారాల పట్టిని ఈ లోకంలోకి తీసుకురాబోతున్న అనితా హస్సానందాని-రోహిత్ రెడ్డి ప్రస్తుతం ఇలాంటి ఆనందంలోనే తేలియాడుతున్నారు. తను తల్లిని కాబోతున్నానని ప్రకటించిన మరుక్షణం నుంచే ఆ మధుర క్షణాలను ఫొటోల్లో బంధిస్తోన్న ఈ బ్యూటీ.. ఇటీవలే మెటర్నిటీ ఫొటోషూట్ కూడా తీయించుకుంది. అనంతరం ఆ మధురానుభూతుల్ని ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో పంచుకుంటూ తెగ మురిసిపోయింది.
అనిత...‘నువ్వు-నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన వైపుకి తిప్పుకున్న అందాల తార. తెలుగుతో పాటు పలు కన్నడ, తమిళ చిత్రాల్లోనూ నటించి అక్కడి అభిమానుల మెప్పు కూడా పొందిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత బాలీవుడ్ బుల్లితెరపై అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో నటిస్తున్నప్పుడే రోహిత్ రెడ్డి అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది అనిత. ఆ తర్వాత పెద్దల అనుమతితో 2013లో అతనితో కలిసి ఏడడుగులు నడిచింది. ఈ క్రమంలోనే తమ ఏడేళ్ల ప్రణయ బంధానికి గుర్తుగా తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నట్లు గతేడాది అక్టోబర్‌లో ప్రకటించిందీ అందాల జంట.
ఫొటోషూట్‌లో మెరిసిపోయారు!
గర్భం ధరించిన మరుక్షణం నుంచే మాతృత్వపు మధురానుభూతిని పూర్తిగా ఆస్వాదిస్తోంది అనిత. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు తన క్యూట్ బేబీ బంప్ ఫొటోలు, మెటర్నిటీ ఫ్యాషన్స్‌కి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అందరితో షేర్ చేసుకుంటోంది. ఇటీవల అనిత అత్యంత సన్నిహితురాలు ఏక్తా కపూర్ సారథ్యంలో బేబీ షవర్ (సీమంతం) వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. బాలీవుడ్ బుల్లితెరకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్న అనిత-రోహిత్ తాజాగా మెటర్నిటీ ఫొటోషూట్ తీయించుకున్నారు.
పాలరాతి శిల్పంలా!
ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భంతో ఉన్న అనిత ఫొటోషూట్ సందర్భంగా తన క్యూట్ బేబీ బంప్‌తో అందమైన ఫ్యాషనబుల్ దుస్తుల్లో ముస్తాబైంది. ఈ సందర్భంగా ఆఫ్ షోల్డర్ వైట్ క్రాప్ టాప్, అదే కలర్ సైడ్ స్లిట్ స్కర్ట్‌లో పాలరాతి శిల్పంలా మెరిసిపోయిందీ ముద్దుగుమ్మ. దుస్తులకు తగ్గట్టుగా హాఫ్ టైడ్ లూజ్ హెయిర్‌పై ధరించిన పూలు ఆమె అందాన్ని రెట్టింపు చేశాయని చెప్పచ్చు. ఇక వైట్ కలర్ షర్ట్, బ్లూ కలర్ డెనిమ్ జీన్స్‌లో సూపర్బ్ అనిపించాడు రోహిత్. ఫొటోషూట్‌లో భాగంగా ఒకరి కళ్లల్లోకి ఒకరు తదేకంగా చూస్తూ, ఒకరినొకరు అనుకరిస్తూ ముద్దులు పెట్టుకుంటూ మురిసిపోయారీ లవ్లీ కపుల్. అనంతరం డిఫరెంట్ యాంగిల్స్‌లో దిగిన ఫొటోలు, వీడియోలను అనిత, రోహిత్లిద్దరూ ఇన్‌స్టా వేదికగా తమ ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఈ సందర్భంగా తను షేర్ చేసిన ఓ వీడియోకి ‘షూటింగ్ విత్ బేబ్ అండ్ టు-బి-బేబీ’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది అనిత. కాగా ఈ రొమాంటిక్ మెటర్నిటీ ఫొటోషూట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్‌ని చూసి సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కరిష్మా తానా, క్రిస్టల్ డిసౌజా, సనాయా ఇరానీ, నివేదితా బసు తదితర బుల్లితెర సెలబ్రిటీలు ‘హార్ట్’ ఎమోజీలతో కామెంట్ సెక్షన్‌ని నింపేశారు. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న ఈ బ్యూటిఫుల్ కపుల్‌కు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక గతంలోనూ ఇద్దరూ కలిసి దిగిన కొన్ని లవ్లీ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తో పంచుకుందీ అందాల జంట. అలాంటి స్వీట్ అండ్ క్యూట్ ఫొటోలు, వీడియోలపై మనమూ ఓ లుక్కేద్దాం రండి...!