గర్భం ధరించిన క్షణం నుంచి నెలలు నిండుతున్న కొద్దీ కాబోయే అమ్మగా ప్రతి క్షణాన్నీ మహిళలు ఎలా ఆస్వాదిస్తారో.. తమకు పుట్టబోయే చిన్నారిని ఎప్పుడెప్పుడు చేతుల్లోకి తీసుకుందామా అన్న ఉత్సాహం కాబోయే తండ్రుల్లో మిన్నంటుతుంది. ప్రస్తుతం విరుష్క జంట అలాంటి ఆనందోత్సాహాల్లోనే తేలియాడుతోంది. తాజాగా బాలీవుడ్ అందాల తార అనుష్కా శర్మ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో తండ్రిగా ప్రమోషన్ పొందిన విరాట్ ఈ ఆనందకరమైన క్షణాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘బుజ్జాయి రాకతో మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది’ అంటూ పట్టరానంత సంతోషంలో మునిగి తేలుతున్నారీ లవ్లీ కపుల్.
గతేడాది ఆగస్టులో ‘త్వరలోనే మేం ముగ్గురం కాబోతున్నాం’ అంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది అందాల తార అనుష్కా శర్మ. ఇక అప్పట్నుంచి అమ్మగా తాను అనుభవిస్తోన్న ప్రతి క్షణాన్నీ, మధురానుభూతుల్ని సోషల్ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తో పంచుకుంటూనే ఉంది. అంతేకాదు.. ఈ సమయంలో విదేశాల్లో జరిగిన మ్యాచ్‌లకు భర్త విరాట్‌తో కలిసి వెళ్లి మరీ అతడిని ప్రోత్సహించిందీ బ్యూటీ. ఇక తన చిట్టిపొట్టి పొట్టను ప్రదర్శిస్తూ ప్రతి సందర్భంలో అనుష్క ధరించిన మెటర్నిటీ ఫ్యాషన్స్, మెటర్నిటీ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు కాబోయే అమ్మలకు ఫ్యాషన్ పాఠాలు నేర్పాయంటే అతిశయోక్తి కాదు.
గర్భిణిగా ఉన్నప్పుడు కూడా..
‘గర్భం ధరించడమంటే అనారోగ్యం కాదు.. ఈ సమయంలోనూ మహిళలు ఏ పనైనా చేయగల సమర్థులు’ అని నిరూపించింది అనుష్క. ఈ క్రమంలో నెలలు నిండుతున్నా సినిమా షూటింగ్స్‌కి హాజరవుతూ పలుమార్లు కెమెరా కంటికి చిక్కిందీ చక్కనమ్మ. ఇక గర్భిణిగా ఉన్నప్పుడు తన ఆహారపు కోరికల్ని ఇన్‌స్టా స్టోరీస్ రూపంలో బయటపెడుతూ వచ్చింది అనుష్క. ఈ క్రమంలో పిజ్జా, పానీ పూరీ.. వంటివి తినాలన్న కోరికను తీర్చుకున్నానని చూపుతూ పలు ఫొటోలు పోస్ట్ చేసిన ఈ బాలీవుడ్ బేబ్.. ఇటీవలే తన ఇంట్లో ఏర్పాటుచేసిన సింధీ వంటకాల విందుకు సంబంధించిన ఫొటోలను సైతం స్టోరీస్‌లో భాగంగా పంచుకుంది. ఇక మరోవైపు నిండు గర్భంతో యోగా, శీర్షాసనం, ట్రెడ్‌మిల్‌పై జాగింగ్.. వంటి వ్యాయామాలు చేస్తూ కాబోయే అమ్మలకు వ్యాయామం ఎంతో ఉపయుక్తం అన్న సందేశాన్ని చాటింది. విరాట్ కూడా గర్భంతో ఉన్న తన భార్యతో కలిసి ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయాడు.
మాకు అమ్మాయి పుట్టింది!
ఇక తొమ్మిది నెలల పాటు తమ చిన్నారి కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన విరుష్క జంటకు ఆ ఆనంద క్షణం రానే వచ్చింది. జనవరి 11న మధ్యాహ్నం అనుష్క పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో తండ్రిగా ప్రమోషన్ పొందిన విరాట్ తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా తన ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.
‘మాకు అమ్మాయి పుట్టిందన్న శుభవార్తను మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. పాపాయి రాకతో మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. మాపై మీరు కురిపించిన ప్రేమకు ధన్యవాదాలు..!’ అంటూ ట్వీట్ చేశాడు విరాట్. దీంతో ఇటు సెలబ్రిటీలు, అటు ఫ్యాన్స్ దగ్గర్నుంచి ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
కంగ్రాట్స్ విరుష్క!