Photo: Instagram
హరితేజ... సీరియల్ నటిగా కెరీర్ మొదలు పెట్టి సిల్వర్ స్ర్కీన్‌పైకి అడుగుపెట్టిన ఈ అందాల తార గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘అ ఆ’ సినిమాతో పలువురి ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై యాంకర్‌గానూ, హోస్ట్‌గానూ సత్తాచాటింది. ఇక ‘బిగ్‌బాస్ 1’ తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఇలా బుల్లితెరపై, వెండితెరపై వరుస సినిమాలు, షోలతో దూసుకెళుతోన్న హరితేజ త్వరలో అమ్మగా ప్రమోషన్ పొందనున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు వేడుకగా సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘మంగమ్మ’పాత్రతో!
తొమ్మిదేళ్ల క్రితం ఈటీవీలో ప్రసారమైన ‘మనసు మమత’ సీరియల్‌తో తొలిసారిగా ముఖానికి మేకప్ వేసుకుంది హరితేజ. ఆ తర్వాత వరుస సీరియళ్లలో నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇదే క్రమంలో వరుసగా సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంది. 2016లో విడుదలైన ‘అ ఆ’ సినిమాలో ఆమె పోషించిన ‘మంగమ్మ’ పాత్ర పలువురి ప్రశంసలు అందుకుంది. మరుసటి ఏడాదే బిగ్‌బాస్ సీజన్ 1 కంటెస్టెంట్‌గా అలరించి టాప్-3లో నిలిచింది. ‘అ ఆ’తో పాటు ‘విన్నర్’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘నేనేరాజు నేనే మంత్రి’, ‘రాజా ది గ్రేట్’, ‘సమ్మోహనం’, ‘శ్రీనివాస కల్యాణం’, ‘యూటర్న్’, ‘అరవింద సమేత’, ‘ఎన్టీఆర్ : కథానాయకుడు’, ‘ఎఫ్ 2’, ‘118’, ‘ప్రతిరోజూ పండగే’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘హిట్’.. తదితర సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార.
బేబీ బంప్‌తో డ్యాన్స్!
కూచిపూడి నాట్యంలోనూ నైపుణ్యమున్న హరితేజ 2016లో దీపక్‌రావుతో కలిసి పెళ్లిపీటలెక్కింది. ఈక్రమంలో తమ నాలుగేళ్ల దాంపత్య బంధానికి గుర్తుగా త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుందీ అందాల తార. గతేడాది డిసెంబర్లో మొదటిసారిగా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అందరితో పంచుకున్న ఆమెకు తాజాగా కుటుంబ సభ్యులు ఘనంగా సీమంతం ఏర్పాటుచేశారు. బుల్లితెర నటీమణులు హిమజ, నవ్య స్వామితో పాటు బంధువులు, అత్యంత సన్నిహితులు, స్నేహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిలకపచ్చ రంగు పట్టుచీర, ఆభరణాలు ధరించి సంప్రదాయబద్ధంగా ముస్తాబైన హరితేజ స్నేహితులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసింది. వరుణ్‌తేజ్ హీరోగా ‘గద్దల కొండ గణేష్’ సినిమాలోని ‘జర్రా జర్రా’ అనే పాటకు హిమజ, నవ్య స్వామిలతో కలిసి హుషారుగా కాలు కదిపిందీ అందాల తార. ఈ క్రమంలో హరితేజ బేబీ బంప్‌తో డ్యాన్స్ చేసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తల్లి కాబోతున్న ఆనందం ఆమె కళ్లల్లో స్పష్టంగా కనిపించిందని కామెంట్లు పెడుతున్నారు.
గర్భం ధరించినప్పటి నుంచి సినిమాలు, టీవీ షోలకు దూరంగా ఉంటోంది హరితేజ. ఇక ఆమె నటించిన ‘జాంబీ రెడ్డి’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.