రంగుల ప్రపంచం లాంటి సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే సాధారణ విషయమేమీ కాదు. పరిశ్రమలోకి అడుగుపెట్టడం నుంచి అవకాశాలు దక్కించుకునేదాకా ఇన్నో ఇబ్బందులు, అవమానాలు భరించాల్సి ఉంటుంది. తెరపై కనిపించి అభిమానుల ప్రేమాభిమానాలు పొందాలంటే తెర వెనుక వారు ఎదుర్కొనే వేధింపులు, చేదు అనుభవాలు ఎన్నో! ప్రస్తుతం సినీ పరిశ్రమలో స్టార్ హోదాను అనుభవిస్తున్న నటీమణులు కెరీర్ తొలినాళ్లలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. ఈక్రమంలో తాను కూడా కెరీర్ తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటోంది ‘బాహుబలి’ ఫేం నోరా ఫతేహి. తనకు ట్యాలెంట్ లేదన్న ఓ క్యాస్టింగ్ డైరెక్టర్ మాటలు తనను చాలా రోజులు వేధించాయంటోందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో తనకెదురైన చేదు అనుభవాల గురించి అందరితో షేర్ చేసుకుంది.
కెనడా టు ముంబయి!
ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ లోని ‘మనోహరి’ పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకుంది హాట్ బ్యూటీ నోరా ఫతేహి. ఇదొక్కటే కాదు ‘టెంపర్’, ‘కిక్2’, ‘షేర్’, ‘లోఫర్’, ‘ఊపిరి’ వంటి సినిమాల్లో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ తెలుగు కుర్రకారును ఉర్రూతలూగించాయి. ఇక బాలీవుడ్ సినిమా ‘సత్యమేవ జయతే’ లోని ‘దిల్బర్’ పాటకు నోరా వేసిన స్టెప్పులు యూట్యూబ్ రికార్డులన్నింటినీ తిరగరాశాయి. ‘రాకీ హ్యాండ్సమ్’, ‘స్త్రీ’, ‘భారత్’, ‘బాట్లా హౌస్’, ‘మర్జావన్’... తదితర సినిమాల్లో ప్రత్యేక గీతాలతో సందడి చేసిన ఈ అందాల తార ‘స్ట్రీట్ డ్యాన్సర్3D’ సినిమాతో తనలోని నటనా ప్రతిభను నిరూపించుకుంది. కొన్ని తమిళ, మలయాళ సినిమాల్లోనూ కనిపించిన ఈమె పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లో ఆడిపాడి అలరించింది. ఇలా నటిగా, డ్యాన్సర్‌గా, సింగర్‌గా, ప్రొడ్యూసర్‌గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ కెనడాలో పుట్టి పెరిగింది. అక్కడే మోడలింగ్‌లో కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం ముంబయికి చేరుకుంది. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను కరీనాకపూర్ నిర్వహిస్తున్న ‘వాట్ ఉమెన్ వాంట్’ టాక్ షో ద్వారా అందరితో పంచుకుంది.
నాకు ట్యాలెంట్ లేదన్నారు!
‘మోడలింగ్ చేశాక బాలీవుడ్ ఇండస్ట్రీలో నా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కెనడా నుంచి ముంబయికి వచ్చేశాను. అప్పుడు ఇండియాలో నాకు తెలిసిన వారేవరూ లేరు. అయితే ఓ సినిమా కోసం నటీనటుల ఎంపిక, స్ర్కీనింగ్ జరుగుతుందని ఓ క్యాస్టింగ్ డైరెక్టర్ పిలిస్తే కలిసేందుకు వెళ్లాను. అయితే ఆ సమయంలో నా గురించి ఏమీ తెలుసుకోకుండానే ఆ క్యాస్టింగ్ డైరెక్టర్ నాపై విరుచుకుపడ్డారు. ‘నీలాగా ఇక్కడ చాలామంది ఉన్నారు. మా సినీ ఇండస్ట్రీ మీ లాంటి వారితో విసిగిపోయి క్షీణావస్థలో ఉంది. నీకు ట్యాలెంట్ లేదని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. నువ్వు మాకవసరం లేదు’ అంటూ ఉన్నట్లుండి నాపై బిగ్గరగా అరిచేశారు. ఆ సమయంలో నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. కొద్ది సేపు షాక్‌లో ఉండిపోయాను. ఆ తర్వాత తేరుకుని వెంటనే బయటికొచ్చేశాను. కానీ ఆ మాటలు నన్ను చాలా కాలం పాటు వెంటాడాయి. ఎన్నో ఆశలతో వచ్చిన నన్ను మానసికంగా కుంగదీశాయి. ఆ క్యాస్టింగ్ డైరెక్టర్ పేరు కూడా నాకు తెలియదు. తను పిలిస్తేనే స్ర్కీనింగ్‌కు హాజరయ్యాను. కానీ అక్కడ తన ప్రవర్తన నాకెంతో వింతగా అనిపించింది. సినిమా పరిశ్రమలో అందరూ ఇలాగే ఉంటారా? అని భయమేసింది. ఒక్కోసారి నేనిక బ్యాగ్ సర్దుకుని తిరిగి కెనడాకు వెళదామని కూడా అనిపించింది. కానీ నేను కోరుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు వెనకడుగు వేయకూడదనుకున్నాను. ఏదేమైనా నా సక్సెస్‌తోనే అందరికీ సమాధానం చెప్పాలనుకున్నాను’ అని తన అనుభవాలను గుదిగుచ్చిందీ అందాల తార.
సోషల్ మీడియాలోనూ హవా!
అలా కెరీర్ తొలిరోజుల్లో ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్న నోరా నేడు బాలీవుడ్లో సూపర్ డ్యాన్సర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఆమెకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే సుమారు 21.2 మిలియన్ల మంది నోరాను అనుసరిస్తుండడం విశేషం. ఇటీవల బిగ్‌బాస్-14 సీజన్లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘భుజ్’: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు మరికొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌తో మనల్ని మెప్పించేందుకు సిద్ధమవుతోంది.