కొంగొత్త ఆశలు, కలలను మోసుకొస్తూ కొత్త ఏడాది ప్రారంభమైంది. గతేడాది మిగిల్చిన చేదు అనుభవాల నుంచి బయటపడుతూ అందరూ కోటి ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొందరు తమ స్వస్థలంలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తే, మరికొందరు తమకు నచ్చిన ప్రదేశానికి వెళ్లి కొత్త ఏడాదికి ఆహ్వానం పలికారు. అనంతరం తమ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో కొందరు సినీతారలు కొత్త సంవత్సరాన్ని ఎలా ఆహ్వానించారో, వారి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటో చూద్దాం రండి...
‘హ్యాపీ 2021. ఈ కొత్త ఏడాది మీ జీవితంలో సంతోషం, ప్రేమ, శాంతిని నింపాలి’. - అక్కినేని సమంత
‘హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఏడాది మొత్తం ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషమే ఉండాలని కోరుకుంటున్నా’. - కాజల్ అగర్వాల్
‘గతంలో మనం వదిలిపెట్టిన వాటి కంటే మరెన్నో మంచి విషయాలు భవిష్యత్‌లో మన ముందుకు రానున్నాయి. సహనం, స్నేహం, కృతజ్ఞతా భావం... ఇలా 2020 మనకు ఎన్నో విషయాలను నేర్పించింది. ఈ కొత్త ఏడాదిలో అందరికీ ఆయురారోగ్యాలు, సంతోషం మెండుగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’. - నమ్రతా శిరోద్కర్
‘అందరి జీవితాలు ప్రేమ, సంతోషంతో నిండేలా ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ‘హ్యాపీ 2021’. - ఐశ్వర్యారాయ్ బచ్చన్
‘నా ప్రియమైన లైఫ్ పార్ట్నర్తో కలిసి 2021 మొత్తాన్ని సంతోషంగా గడిపేందుకు సిద్ధంగా ఉన్నాను. ప్రేమ, కుటుంబం, స్నేహితులు, ప్రయాణం, దైవ భక్తి... ఇలా ఎన్నో మంచి విషయాలతో ఈ ఏడాది సాగాలని కోరుకుంటున్నాను. మనందరి జీవితాల్లో మంచి రోజులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నాను. గడిచిన వాటి కోసం ఆలోచించడం మానేసి కలిసి పని చేద్దాం. కలిసికట్టుగా ముందుకు సాగుదాం’. - సోనమ్ కపూర్
‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎన్నో గడ్డు పరిస్థితులను దాటుకుని కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. 2021ని మన జీవితంలో ఓ మధుర జ్ఞాపకంగా మలుచుకుందాం. ప్రేమ, సంతోషం, ఆరోగ్యం, విజయం అందరికీ సమృద్ధిగా అందాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ ఏడాది అద్భుతంగా గడవాలని కోరుకుంటూ ‘హ్యాపీ న్యూ ఇయర్’!! - నయనతార
‘ఈ కొత్త ఏడాది అందరికీ ఆయురారోగ్యాలు, సంతోషాన్ని మెండుగా అందించాలని ఆకాంక్షిస్తున్నాను. మన వ్యాధి నిరోధక శక్తితో అన్ని రకాల వైరస్‌లపై విజయం సాధిద్దాం. మళ్లీ మన సాధారణ జీవితం ప్రారంభిద్దాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’. - హేమామాలిని
‘నా గోవా గ్యాంగ్‌తో కలిసి ఒక అందమైన ప్రదేశంలో కొత్త ఏడాదికి స్వాగతం పలికాను. 2021 కోసం ఎలాంటి నిర్ణయాలు, తీర్మానాలు తీసుకోలేదు. 2020 కోసం మనం చేసుకున్న తీర్మానాలు ఏమయ్యామో అందరికీ తెలుసుగా’. నేను సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నాలుగేళ్లు పూర్తయింది. నా జీవితంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. వాటిలో కొన్ని అందరికీ తెలుసు. ఇది కొత్త ఏడాది. కలలు కనండి. మీరు చేయాలనుకున్నది చేయండి. ఎప్పుడూ నవ్వుతూ జీవితాన్ని ఆస్వాదించండి’. - రష్మిక మందన
‘2020 మనందరికీ ఎంతో కఠినంగా గడిచింది. ఎన్నో గుణ పాఠాలు నేర్పించింది. ఈ ఏడాది ఆరంభంలో మూడు సినిమాలకు సంతకాలు చేశాను. ఓ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతుండగానే... మార్చిలో లాక్డౌన్ మొదలైంది. కొన్ని రోజులు ఏం చేయాలి? ఏంటి? అని మైండ్ బ్లాంక్ అయిపోయినట్లయింది. కానీ, కుటుంబంతో కలిసి హ్యాపీగా గడిపే అవకాశమొచ్చిందని సంతోషపడ్డాను. ‘మనం ఎంత గొప్ప వాళ్లమైనా... జరిగే దాన్ని మార్చలేం’ అని ఆ సమయంలో నాకు అర్థమైంది. అందుకే అందరూ ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం’. - అనుపమా పరమేశ్వరన్
‘నా కలలు, నా మనసు, నా నమ్మకాలు... ఇలా 2020 నా గురించి నాకు చాలానే నేర్పించింది. ఈ విశ్వం నుంచి నేను నేర్చుకున్న పాఠాలకి గాను ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను. మరిన్ని పాఠాల్ని నేర్చుకునేందుకు, మరిన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’. - శ్రుతిహాసన్
‘కొవిడ్ - 19 నెగెటివ్ సాధించి 2020కి వీడ్కోలు పలికాను. జనవరి 2 నుంచే మళ్లీ సినిమా షూటింగ్‌లతో బిజీ అయిపోతాను. కొన్నాళ్ల పాటు సెలవులు లేకుండా పని చేయాల్సి ఉంటుంది. గతేడాది చాలా విషయాల్నే నేర్పింది. ఎంత డబ్బు, ఎంత పేరు ఉన్న వాళ్లయినా కరోనా వల్ల ఇళ్లకే పరిమితమయ్యారు. అందరూ సమానమే అనే సంకేతాన్ని ఇచ్చింది కరోనా మహమ్మారి. వాసన, రుచిని కోల్పోయేలా చేసే కరోనా... మనమేమిటో ఒకసారి మనకి తెలియజేసింది. రుచుల్ని ఆస్వాదిస్తున్న మనం కృతజ్ఞతతో ఉండాలనే విషయాన్ని చాటి చెప్పింది. కొవిడ్ పరీక్షల్లో నాకు పాజిటివ్ అని తేలాక నా కోసం మా అమ్మ హైదరాబాద్‌కి వచ్చింది. మా నాన్న ఇక్కడే ఉన్నారు. వాళ్ల మధ్యే కొత్త ఏడాది సంబరాల్ని జరుపుకొన్నా’. - రకుల్ ప్రీత్ సింగ్
‘2020 చాలా విషయాల్ని నేర్పింది. ముఖ్యంగా జీవితం ఎంత చిన్నదో, ఇక్కడ మనం ఎంత బాధ్యతగా ఉండాలో అర్థమయ్యేలా చేసింది. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి కావల్సినంత సమయం దొరికింది. ఒక రకంగా గతేడాది నేర్చుకున్న కొత్త పాఠాలతో, ఇప్పుడు కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నట్టుగా ఉంది. యోగా చేయడం మొదలు పెట్టాను. ఈ అలవాటును ఇలాగే కొనసాగిస్తాను. ఇక చాలా యేళ్ల తర్వాత అమ్మానాన్నతో కలిసి కొత్త ఏడాదికి స్వాగతం పలికాను. వారితో కలిసి గడిపేందుకు ఇంతకు మించిన అందమైన ప్రదేశం మరొకటి ఉండదు’. - లావణ్యా త్రిపాఠి
‘365 రోజుల పుస్తకంలో మొదటి ఖాళీ పేజీ ఈ రోజు. దీనిని అందంగా రాసుకుందాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’. - మీనా
వీరితో పాటు అల్లు అర్జున్-స్నేహారెడ్డి, కరీనా-సైఫ్, గౌరీ ఖాన్-షారుఖ్, ట్వింకిల్ ఖన్నా-అక్షయ్, తహీరా కశ్యప్-ఆయుష్మాన్ ఖురానా, మలైకా అరోరా-అర్జున్ కపూర్, కరిష్మా కపూర్, సారా అలీఖాన్, రెజీనా, సోనాలీ బింద్రే, సింగర్ సునీత, రోజా, అను ఇమ్మాన్యుయేల్, అనసూయ, సౌందర్యా రజనీకాంత్, సోహా అలీఖాన్, దిశాపటానీ, కృతి సనన్, అనితా హస్సానందానీ, హరితేజ, నందినీ రాయ్, నేహా ధూపియా, నటాషా తదితర సెలబ్రిటీలు తమ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అభిమానులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరి వాటి పైన మీరూ ఓ లుక్కేయండి..