నర్సింగ్ విద్యను అభ్యసించిన ఆమె నటనపై ఉన్న ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్ని పోషిస్తూనే ప్రేక్షకుల్ని అలరించింది. ఆ తర్వాత తన నటనా ప్రతిభతో షారుఖ్ లాంటి స్టార్ హీరో పక్కన నటించి ఎంతో క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ సినిమాల్లోకి వెళ్లినా తన సేవాభావాన్ని మరచిపోలేదామె. అందుకే కోరుకోని అతిథిలా వచ్చిన కరోనా వైరస్ నుంచి సామాన్యులను కాపాడేందుకు మళ్లీ సేవకే ఓటేసింది. ఆరు నెలల పాటు కరోనా బాధితులను కంటికి రెప్పలా కాపాడింది. కానీ దురదృష్టవశాత్తూ అదే వైరస్ బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా. కొవిడ్‌ను జయించి ఇంటికి చేరుకున్న ఆమె పక్షవాతానికి గురై మళ్లీ ఆస్పత్రి పాలైంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె తన ఆరోగ్య పరిస్థితి గురించి అందరితో షేర్ చేసుకుంది.
సినిమాల్లోకి వెళ్లినా సేవకే ఓటు!
శిఖా మల్హోత్రా.. నటిగా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైనా.. ఈ కరోనా పరిస్థితుల్లో నర్సుగా విధుల్లో చేరి ప్రపంచానికి తనని తాను సరికొత్తగా పరిచయం చేసుకుందీ ముద్దుగుమ్మ. షారుఖ్ నటించిన ‘ఫ్యాన్’ చిత్రంతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన శిఖ.. 2014లో నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది. నటన పట్ల మక్కువ ఉన్నా.. వైద్య వృత్తిలో సైతం రాణించడానికి తన తల్లినే స్ఫూర్తిగా తీసుకుందీ బాలీవుడ్ బ్యూటీ. మార్చి-సెప్టెంబర్ వరకు సుమారు ఏడు నెలల పాటు ముంబయిలోని హిందూ హృదయ్ సామ్రాట్ బాలా సాహెబ్ థాక్రే ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వర్తించింది. ఈ క్రమంలో కొవిడ్ బాధితులకు ఉచితంగా సేవ చేస్తూ తనలోని సేవా భావాన్ని చాటుకుందీ బాలీవుడ్ బ్యూటీ.
కరోనాను జయించినా!
కరోనా రోగులకు సేవలందించే క్రమంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దురదృష్టవశాత్తూ కొంతమంది వైద్యులు, నర్సులు అదే వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో శిఖా మల్హోత్రా కూడా అక్టోబర్‌లో వైరస్ బారిన పడింది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చక్కెర స్థాయులు పడిపోవడంతో వెంటిలేటర్ దాకా వెళ్లింది. అయితే డాక్టర్ల తోడ్పాటు, అభిమానుల ఆశీర్వాద బలంతో ఎట్టకేలకు కరోనాను జయించింది. చికిత్స సమయంలో వెంటిలేటర్‌పై ఉన్నప్పటికీ తన అనుభవాలను పంచుకుంటూ వైరస్ విషయంలో అందరినీ అలర్ట్ చేసిందీ కొవిడ్ వారియర్. కొవిడ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందిన శిఖ కొద్ది రోజుల క్రితమే పూర్తిగా కోలుకుని ఇంటికి చేరుకుంది. ఇక అంతా బాగుందనుకుంటున్న సమయంలో డిసెంబర్ 10న పక్షవాతానికి గురైంది. స్ట్రోక్ రావడంతో కుడి వైపు కాళ్లు, చేతులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. దీంతో వెంటనే ఆమెను జుహూలోని కూపర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో రెండు రోజుల తర్వాత ముంబైలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం ప్రారంభించారు. పది రోజుల నుంచి ఐసీయూలో చికిత్స తీసుకుంటోన్న ఆమె ఆరోగ్యం కాస్త కుదుటపడింది.
మళ్లీ ఎప్పుడు నడుస్తానో తెలియడం లేదు!
లాక్‌డౌన్‌కు ముందు శిఖ నటించిన చిత్రం ‘కాంచ్లీ’. ఈ ఏడాది ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇటీవల ఓటీటీ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సినిమా. ఈ క్రమంలో అభిమానులందరూ తన సినిమాను చూడాలంటూ ఓ బహిరంగ లేఖను పంచుకుందీ అందాల తార. దీంతో పాటు తన ఆరోగ్య పరిస్థితేంటో ఆ లేఖ ద్వారా అందరితో షేర్ చేసుకుంది.
‘ఇక్కడి వైద్య నిపుణులు నన్ను బాగా చూసుకుంటున్నారు. మహారాష్ర్ట ప్రభుత్వం నిత్యం నా క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ నాకు అండగా నిలుస్తోంది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. అయితే చాలా నెమ్మదిగా కోలుకుంటున్నాను. ఇప్పటికీ నా కుడివైపు భాగంలో ఎలాంటి కదలికలు కనిపించడం లేదు. మునపటిలా మళ్లీ ఎప్పుడు నా కాళ్లపై నడుస్తానో నాకు తెలియడం లేదు. నా శరీర నిస్సహాయతను చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. అదే సమయంలో నేను లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘కాంచ్లీ’ ఓటీటీలో విడుదలైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే చాలామందికి ఈ సినిమా విడుదల గురించి తెలియడం లేదు. అందుకే ఇలా మీ ముందుకు వచ్చాను’
మళ్లీ మీ ప్రేమాభిమానాలు కావాలి!
‘నాకిష్టమైన నటనను వదిలిపెట్టి కరోనా రోగుల సేవ కోసం వెళ్లినప్పుడు అందరూ నన్ను అభినందించారు. న్యూస్, ఆర్టికల్స్, సోషల్ మీడియా పోస్టులు, షేరింగుల ద్వారా నన్ను ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేశారు. మీ అందరి ఆశీర్వాద బలం కారణంగానే కరోనా కూడా నన్ను ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు కూడా మీ ప్రేమాభిమానాలే నన్ను కాపాడుతున్నాయనుకుంటున్నా. నేను జీవితంలో ఇప్పటివరకు సాధించిన విజయాలన్నింటికీ మీరే కారణం. అలాంటి ప్రేమాభిమానాలు మళ్లీ నాపై చూపాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.
సినిమాలంటే నాకెంతో ఇష్టం. అందులోనే నా జీవితాన్ని వెతుక్కుంటున్నాను. సినిమా కెరీర్లో రాణించేందుకు కావాల్సిన అన్ని అర్హతలు నాకున్నాయని అనుకుంటున్నాను. ఇక నాకు కావాల్సిందల్లా మీ ప్రేమాభిమానాలు మాత్రమే. మీ అందరి సహకారంతో సినిమా ఇండస్ట్రీలో నేను మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నాను’. అని ఆ లేఖలో రాసుకొచ్చింది శిఖ.
మరి, ప్రస్తుతం పక్షవాతంతో పోరాటం చేస్తున్న శిఖ...త్వరలోనే కోలుకోవాలని, తన కోరిక మేరకు మళ్లీ సినిమాలు చేసి అందరినీ మెప్పించాలని మనమూ కోరుకుందాం.
గెట్ వెల్ సూన్ శిఖ!!