అనితా హస్సానందాని... ‘నువ్వు-నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపుకి తిప్పుకున్న అందాల తార. మొదటి సినిమాతోనే కుర్రకారు మనసులు కొల్లగొట్టిన ఈ భామ పలు కన్నడ, తమిళ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్ బుల్లితెరపై అడుగుపెట్టి అక్కడి ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. సినిమాల్లో ఉండగానే రోహిత్ రెడ్డి అనే వ్యాపారవేత్తను ప్రేమ వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆమె బేబీ షవర్ (సీమంతం) ఫంక్షన్ వేడుకగా జరిగింది. అనిత సన్నిహితురాలు, ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఏర్పాటుచేసిన ఈ ఫంక్షన్లో పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న అనిత-రోహిత్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తెలుగులో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నువ్వు-నేను’ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది అనిత. అంతకు ముందు ‘తాళ్’ వంటి కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా మెరిసింది. ‘నువ్వు-నేను’తో పాటు ‘శ్రీరామ్’, ‘తొట్టి గ్యాంగ్’, ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘ఆడంతే అదో టైపు’, ‘నేను పెళ్లికి రెడీ’...తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. పలు కన్నడ, తమిళ చిత్రాల్లోనూ నటించి మెప్పించిన ఆమె ‘ఝలక్ దిక్లా జా’, ‘కామెడీ సర్కస్’, ‘బిగ్‌బాస్’, ‘నచ్ బలియే’.. వంటి టీవీ రియాలిటీ షోల్లో పాల్గొని సత్తా చాటింది. ‘యే హై మొహబ్బతే’, ‘నాగిన్ సిరీస్’తో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఈక్రమంలో సినిమాల్లో నటిస్తున్నప్పుడే రోహిత్ రెడ్డి అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడిందీ అందాల తార. ఆ తర్వాత పెద్దల అనుమతితో ఏడేళ్ల క్రితం అతనితో కలిసి ఏడడుగులు నడిచింది. ఈక్రమంలో తమ ప్రణయ బంధానికి గుర్తుగా తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రకటించిందీ అందాల జంట.
వేడుకగా బేబీ షవర్ ఫంక్షన్!
త్వరలో తమకు పుట్టబోయే బుజ్జి పాపాయిని వూహించుకుంటూ, అనుక్షణం ఆ బిడ్డ ఆలోచనల్లోనే గడుపుతూ మాతృత్వపు మధురానుభూతిని ఆస్వాదిస్తోంది అనిత. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు తన క్యూట్ బేబీ బంప్ ఫొటోలు, మెటర్నిటీ ఫ్యాషన్స్‌కి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేసుకుంటోందీ టు-బి-మామ్. తాజాగా అనిత అత్యంత సన్నిహితురాలు ఏక్తాకపూర్ సారథ్యంలో బేబీ షవర్ (సీమంతం) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ డిజైనర్ కనికా మిట్టల్ రూపొందించిన యెల్లో కలర్ మ్యాక్సీ డ్రస్‌లో సూపర్బ్ అనిపించింది అనిత. ఇక రోహిత్ గ్రే కలర్ టీషర్ట్ అండ్ జీన్స్ ధరించి రడీ అయ్యాడు. ఏక్తాతో పాటు ఊర్వశీ ధోలాకియా, కరిష్మా తానా, క్రిస్టల్ డిసౌజా, సనాయా ఇరానీ, తనుశ్రీ దాస్ గుప్తా, రిధిమా పండిట్, సుహానే రోషన్, అదితీ భాటియా, అంకితా భార్గవ, కరణ్ పటేల్...తదితర సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకలో భాగంగా సెలబ్రిటీలందరూ అనిత-రోహిత్ దంపతులతో కలిసి సరదాగా ఫొటోలు, సెల్ఫీలు దిగారు. వారితో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేసుకున్నారు.
మై పర్ఫె్క్ట్ బేబీ షవర్!
ఈ సందర్భంగా ‘మై పర్ఫెక్ట్ బేబీ షవర్’ అంటూ తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నారు అనిత దంపతులు. ఈ కార్యక్రమాన్ని ఎంతో వేడుకగా, అందంగా నిర్వహించిన ఏక్తా, తనుశ్రీ దాస్ గుప్తాలకు కృతజ్ఞతలు తెలిపారు.
మీరు బెస్ట్ పేరెంట్స్ అవుతారు!
అనిత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అమ్మగా ప్రమోషన్ పొందనుంది. ఈక్రమంలో ‘యే హై మొహబ్బతే’ సీరియల్లో ఆమెతో కలిసి నటించిన కరణ్ పటేల్-అంకిత దంపతులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. అనంతరం పార్టీకి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘మరికొద్ది రోజుల్లో అమ్మానాన్నలు కాబోతున్న మీరు కచ్చితంగా ఉత్తమ తల్లిదండ్రులవుతారు. మీ బుజ్జాయితో కలిసి సరదాగా గడిపేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మీ ఇద్దరితో పాటు త్వరలో ఈ భూమ్మీదకు రాబోతున్న మీ బిడ్డపై ఆ దేవుడి కృప ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని శుభాకాంక్షలు తెలిపాడు కరణ్.
వీరితో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అనిత-రోహిత్ దంపతులకు అభినందనలు తెలిపారు. దీంతో ఈ బేబీ షవర్ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు అనిత-రోహిత్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. మరి అనిత బేబీ షవర్ ఫంక్షన్‌కి సంబంధించిన కొన్ని లవ్లీ ఫొటోలు, వీడియోలపై మనమూ ఓ లుక్కేద్దాం రండి.