Photo: Instagram
‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్న మాటలను అక్షరాలా నిరూపిస్తూ ఎందరో సినీ తారలు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. సమయం వచ్చినప్పుడల్లా తమ వంతు సాయంగా ఏదో ఒకటి చేస్తూ మరికొందరు తమ దారిలో నడిచేలా స్ఫూర్తినిస్తున్నారు. ఈ క్రమంలో పేద పిల్లలకు అక్షర జ్ఞానాన్ని అందించేందుకు ప్రముఖ బాలీవుడ్ తారలు విద్యాబాలన్, దియామీర్జా ముందుకొచ్చారు. ఇందులో భాగంగా తమకిష్టమైన వస్తువులను వేలంలో ఉంచుతున్నారు.
అక్షర జ్ఞానం పంచేందుకు!
దేశ రాజధానిలో ఉన్న ‘ది కమ్యూనిటీ లైబ్రరీ ప్రాజెక్ట్ (టీసీఎల్పీ)’ అనే ట్రస్ట్ మరికొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి రెండేళ్లుగా దిల్లీలో పబ్లిక్ లైబ్రరీల ఏర్పాటుకు కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ లైబ్రరీలకు పుస్తకాలు సమకూర్చే ఈ ట్రస్ట్ పుస్తకాలు కొనుక్కోలేని పిల్లలకు ఉచితంగా పుస్తకాలు సమకూరుస్తుంది. అయితే కరోనా నేపథ్యంలో ఈ సంస్థకు తీవ్రమైన నిధుల కొరత ఏర్పడింది. దీంతో లైబ్రరీల నిర్వహణ కోసం ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఆన్లైన్ ఆక్షన్ (వేలం)కు పిలుపునివ్వగా పలువురు కళాకారులు తమకిష్టమైన వస్తువులను వేలానికి పెడుతున్నారు.
నాకెంతో ఇష్టమైన చీర ఇది!
పేరులోనే ‘విద్య’ను ఉంచుకున్న విద్యాబాలన్ గతంలో చదువుకున్న విలువేంటో చాలాసార్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు చదువుకోవడానికి ఆర్థిక స్థోమత లేని పిల్లలకు తన వంతు సహాయం కూడా చేసింది. తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్న ఈ అందాల తార ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం కోసం తనకెంతో ఇష్టమైన చీరను వేలానికి ఇచ్చింది.
‘నాకు చీరలంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అందులోనూ చేనేత చీరలంటే నాకు చాలా ఇష్టం. అందుకే దేశంలో ఎక్కడికెళ్లినా ఆయా ప్రాంతాల్లో నేసే చీరలను సేకరించడం అలవాటుగా చేసుకున్నాను. అలాగే అప్పుడప్పుడు వాటిని పంచిపెట్టడం కూడా హాబీగా మార్చుకున్నాను. ఇందులో భాగంగా టీసీఎల్పీ ఫండ్ రైజింగ్ కార్యక్రమం కోసం నాకెంతో ఇష్టమైన ‘ప్యూర్ ఇక్కత్ టస్సర్’ చీరను ఆన్లైన్ వేలంలో ఉంచుతున్నాను. డిసెంబర్ 20 వరకు ఈ చీర అందుబాటులో ఉంటుంది’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
అక్కడ ప్రపంచాన్ని మరచిపోవచ్చు!
ఈ సందర్భంగా తనకు కూడా పుస్తకాలంటే చాలా ఇష్టమంటోంది విద్య. ‘పుస్తకాలు చదవడమంటే నాకు చాలా ఇష్టం. విద్యకున్న విలువేంటో కూడా నాకు తెలుసు. క్లాస్ రూంలో మనం నేర్చుకున్నవన్నీ గొప్ప పాఠాలే. అదేవిధంగా తరగతి గది బయట మనం కలిసే వ్యక్తులు, వాళ్లతో సంభాషించినప్పుడు తెలుసుకునే విషయాలు, పుస్తకాల ద్వారా వచ్చే జ్ఞానం మనకు వెలకట్టలేని జీవిత పాఠాలను నేర్పిస్తాయి. ఇక లైబ్రరీకి వెళితే ప్రపంచాన్ని సైతం మరచిపోవచ్చు. లైబ్రరీలో మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుంది. మన దేశంలో మరిన్ని ఉచిత లైబ్రరీలు రావాలి. అయితే దానికి చాలా నిధులు కావాలి. అందులో భాగంగా నా వంతు సాయంగా చేసిన చిన్న ప్రయత్నమే ఇది’ అని తెలిపారీ అందాల తార.
నా ఫేవరెట్ బ్యాగ్‌ను ఇచ్చేస్తున్నా!
సినిమాలే కాదు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుంది హైదరాబాదీ నటి దియామీర్జా. ఈ క్రమంలో తన ఫేవరెట్ బ్యాగ్‌ను వేలానికి ఇచ్చి తన మనసెంత అందమైనదో మరోసారి నిరూపించుకుంది. వీరితో పాటు ప్రముఖ యానిమేషన్ ఫిల్మ్‌మేకర్ ప్రియా కురియన్ తను గీసిన చిత్రాలను, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన ట్రాక్‌సూట్స్, ప్రముఖ రచయిత గుల్జార్ తాను ఆటోగ్రాఫ్ చేసిన సొంత పుస్తకాలను వేలంలో ఉంచారు. ఈ నెల 5న మొదలైన ఈ ఫండ్ రైజింగ్ 20 వరకు కొనసాగనుంది.