Photo: Instagram
చూడగానే ఆకట్టుకునే రూపం, తేనె కంటే తియ్యనైన తన అద్భుతమైన స్వరంతో గాయనిగా తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేశారు సింగర్ సునీత. ‘ఈ వేళలో నీవు’, ‘పెదవి దాటని మాటొకటుంది’, ‘ఝుం ఝుం మాయ’, ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ’.. అంటూ కొన్ని వందల పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారామె. ఇలా తన గాత్రంతో పరవశించిపోయే అభిమానులకు తాజాగా ఓ తీపి కబురు చెప్పారీ బ్యూటిఫుల్ సింగర్. త్వరలోనే తాను మరోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నానంటూ తాజాగా జరిగిన తన నిశ్చితార్థపు ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
గుంటూరులో పుట్టి పెరిగిన సునీత.. ఆరేళ్ల వయసులోనే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత పలు వేదికలపై పాటలు పాడుతూ తనలోని ప్రతిభకు మరింతగా సానపెట్టారు. 17 ఏళ్ల వయసులోనే గాయనిగా వెండితెరపై అడుగుపెట్టిన ఆమె.. తొలిసారిగా ‘గులాబి’ సినిమాలోని ‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో’ అనే పాట పాడారు. తొలి పాటకే సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్న ఆమె.. ఆపై కొన్ని వందల పాటలు పాడారు. ‘మురారి’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘నేనున్నాను’, ‘బాస్’, ‘అతడు’, ‘శ్రీరామదాసు’, ‘మహానటి’.. వంటి ఎన్నో సినిమాల్లో తన గాన మాధుర్యంతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారామె.
డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ!
ఇక ఇటీవల ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాలో ‘నీలి నీలి ఆకాశం’ అంటూ ఆమె పాడిన పాట ఎంతలా ట్రెండ్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలుగుతో పాటు కన్నడ వంటి ఇతర భాషా చిత్రాల్లోనూ పాటలు పాడారు సునీత. ఇలా కేవలం గాయనిగానే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ సుమారు 750 సినిమాల్లో 110 మందికి పైగా నాయికలకు తన గాత్రాన్ని అరువిచ్చారు. పలు కార్యక్రమాలకు యాంకర్‌గానూ వ్యవహరించారు.
స్నేహితుడిగా వచ్చారు.. సహచరుడు కాబోతున్నారు!
అయితే తాను త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు సునీత. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపునేనితో ఆమె ఏడడుగులు నడవబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో దండలు మార్చుకొని నిశ్చితార్థం చేసుకుందీ జంట. ఈ ఫొటోలను ఫేస్బుక్లో పంచుకున్న ఈ లవ్లీ సింగర్.. ‘ప్రతి తల్లిలాగే నేనూ నా పిల్లలు తమ జీవితాల్లో ఉన్నతంగా స్థిరపడాలని కలలు కంటున్నాను. అదే సమయంలో నాకంటూ ఓ అందమైన జీవితం ఉండాలని నా తల్లిదండ్రులు, పిల్లలు కోరుకుంటున్నారు.. ఆ విషయంలో నేనెంతో అదృష్టవంతురాలిని! అలాంటి అందమైన క్షణం ఇది. ఒక మంచి ఫ్రెండ్‌గా నా జీవితంలోకి వచ్చారు రామ్.. ఇప్పుడు నా జీవిత భాగస్వామిగా మారబోతున్నారు. మేమిద్దరం త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నాం. నా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచానని అర్థం చేసుకున్న వారందరికీ కృతజ్ఞతలు. ఇలాగే నన్ను ఎప్పటికీ సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నా..’ అంటూ తన మనసులోని భావాలను అందంగా అక్షరీకరించారు సునీత.
ఇలా తన పెళ్లి విషయాన్ని బయటపెడుతూ సునీత పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో అటు సెలబ్రిటీలతో పాటు ఇటు అభిమానులూ ఈ బ్యూటిఫుల్ సింగర్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘మీ అనుబంధం పది కాలాల పాటు పచ్చగా ఉండాలని’ ఆశీర్వదిస్తున్నారు.
కంగ్రాట్స్ లవ్లీ కపుల్!