Photo: Instagram
‘దిల్లీ క్రైమ్’... గత వారం రోజుల నుంచి బాగా వినిపిస్తోన్న పేరు. దేశ రాజధాని దిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ గతేడాది ఓటీటీలో విడుదలైంది. ఆ సమయంలో బాగుందనే ప్రశంసలు తప్ప అందులో నటించిన నటీనటుల గురించి ఎవ్వరూ పెద్దగా మాట్లాడుకోలేదు. అయితే ఎప్పుడైతే ఈ చిత్రం ఎమ్మీ అవార్డు గెలుచుకుందో అందులో నటించిన ఒక క్యారక్టర్... ఆ పాత్ర పోషించిన నటి పేర్లు బాగా మార్మోగిపోతున్నాయి. మహేశ్‌బాబు, హృతిక్‌రోషన్ లాంటి సెలబ్రిటీలు ఆమె అభినయాన్ని అభినందిస్తున్నారు. ఆ క్యారక్టర్ పేరు డీసీపీ వర్తికా చతుర్వేది కాగా... ఆ పాత్ర పోషించిన నటి షెఫాలీ షా.
ముంబయి వేదికగా ఇటీవల 48వ ఎమ్మీ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. అందులో ఉత్తమ డ్రామాగా గతేడాది విడుదలైన ‘దిల్లీ క్రైమ్’ వెబ్ సిరీస్ ఎంపికైంది. ఈ విభాగంలో అర్జెంటీనా, జర్మనీ, యూకేకు చెందిన వెబ్ సిరీస్‌లను వెనక్కి నెట్టి మరీ ఈ అవార్డు దక్కించుకోవడం విశేషం. 2012లో దిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో షెఫాలీ డీసీపీ వర్తికా చతుర్వేదిగా కనిపించింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నేరస్థులను పట్టుకోవాలనే కసి... బాధితురాలికి న్యాయం చేయాలనే తపన కనపరిచే పాత్రలో ఆమె పండించిన అభినయం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. షెఫాలీ ఇంతకుముందు పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. అయితే డీసీపీ వర్తికా చతుర్వేది పాత్ర తనలోని నటనా ప్రతిభను మరో మెట్టు ఎక్కించిందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం రండి.
ఆ నాటకాన్ని మరిచిపోయారు కానీ..!
ముంబయికి చెందిన షెఫాలీ సినిమాల్లోకి రాక ముందు ‘Ant Vagarni Antakshari’ అనే ఓ గుజరాతీ స్టేజ్ డ్రామాలో నటించింది. కొంత కాలానికి ఆ నాటకాన్ని అందరూ మరిచిపోయారు. కానీ... షెఫాలీ అభినయం మాత్రం అందరి మనసుల్లో అలాగే ఉండిపోయింది. అక్కడి నుంచి ఆమె అడుగులు సినిమా రంగం వైపు పడ్డాయి. మొదట దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ఆరోహణ్’ అనే సీరియల్లో కనిపించింది. ఆ తర్వాత 1995లో ‘రంగీలా’తో వెండితెరపై అడుగు పెట్టింది. ఈ సినిమాలో కొద్ది సేపే కనిపించినా అందరినీ ఆకట్టుకుంది. 1998లో ‘సత్య’ చిత్రంలో నటించి రెండో సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకుంది. దీంతో పాటు ఉత్తమ సహాయ నటిగా స్టార్ స్ర్కీన్ అవార్డు కూడా అందుకుంది. ఆ తర్వాత 1999 నుంచి 2006 వరకు వరుసగా ఆరుసార్లు పలు అవార్డులకు నామినేట్ అయింది. ఆ తర్వాత 2007లో ‘ది లాస్ట్ లీర్’ సినిమాతో మరోసారి ఫిల్మ్‌ఫేర్ పురస్కారం అందుకుంది. అదే ఏడాది ‘గాంధీ, మై ఫాదర్’ సినిమాతో ఉత్తమ నటిగా ‘టోక్యో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫేర్’ అవార్డు అందుకుంది. వీటితో పాటు ‘దిల్ ధడక్నే దో’, ‘జ్యూస్’, ‘వన్స్ అగైన్’ సినిమాల్లో నటించి పలు పురస్కారాలతో పాటు ప్రశంసలు కూడా అందుకుంది.
5 నిమిషాల్లోనే ఓకే చెప్పాను!
నటన అంటే ప్రాణమిచ్చే షెఫాలీ... కథ నచ్చితే చాలు సినిమా, షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ అనే తేడా చూడదు. అందుకే వెండితెరకు సమాంతరంగా బుల్లితెరపై కూడా సత్తా చాటుతోంది. ఈ క్రమంలో గతేడాది ‘దిల్లీ క్రైమ్’ వెబ్ సిరీస్‌లో డీసీపీ వర్తికా చతుర్వేదిగా నటించింది. గతంలో దిల్లీ డీసీపీగా పని చేసిన ఛాయా శర్మ పాత్రను ఆమె పోషించింది.
‘రిచి మెహతా (‘దిల్లీ క్రైమ్’ దర్శకుడు) మొదటిసారి నన్ను కలిసినప్పుడు సిరీస్ కథేంటో పూర్తిగా చెప్పలేదు. నిర్భయ ఘటనకు సంబంధించి అతడు చేసిన రీసెర్చ్ గురించి మాత్రమే చెప్పాడు. ఆ తర్వాత తానేం చేయబోతున్నాడో చెబుతుంటే అలా వింటూ ఉండిపోయా..! నా పాత్ర చాలా శక్తిమంతమైంది కావడంతో అతనితో మాట్లాడిన 5 నిమిషాల్లోనే ఈ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు ఓకే చెప్పాను. ఈ సిరీస్ షూటింగ్ చాలా భాగం దిల్లీలోనే జరిగింది. అందులోనూ సహజత్వం కోసం నిర్భయ ఘటన జరిగిన ప్రదేశంలోనే చాలా సన్నివేశాలను చిత్రీకరించారు. అంతకు ముందు నేను చాలా సార్లు దిల్లీకి వెళ్లాను. చాలా సౌకర్యమనిపించింది. అయితే ఎప్పుడైతే ఈ కథ విని దిల్లీకి వెళ్లానో ఎందుకో కొంచెం అసౌకర్యంగా అనిపించింది. షూటింగ్లో భాగంగా నిర్భయ ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లినప్పుడు కొంచెం భయమేసింది. ఇక ఈ కేసును ఛేదించిన ఛాయాశర్మను ప్రత్యక్షంగా కలుసుకోవడాన్ని నేను ఓ గౌరవంగా భావిస్తున్నాను. నా పాత్ర ఇంత బాగా రావడానికి ఆమె కూడా కారణం’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది షెఫాలీ.
అలా చేస్తే నా కుమారులను నేనే చంపేస్తా!
షెఫాలీ వ్యక్తిగత జీవితానికొస్తే... ఆమె టీవీ నటుడు హర్ష్ఛాయను పెళ్లి చేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె ప్రముఖ దర్శక నిర్మాత విపుల్ అమృత్షాను వివాహం చేసుకుంది. ‘ఆంఖే’, ‘వక్త్’, ‘నమస్తే లండన్’, ‘లండన్ డ్రీమ్స్’, ‘యాక్షన్ రీప్లే’, ‘నమస్తే ఇంగ్లండ్’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన విపుల్ పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.
ఇక ‘దిల్లీ క్రైమ్’ తన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందంటోంది షెఫాలీ. ‘ఈ వెబ్‌సిరీస్ నా జీవితాన్ని మలుపు తప్పింది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి చిత్రాలు చేయలేదు. ఈ సిరీస్ నా ఆలోచనా ధోరణిని కూడా మార్చింది. నన్ను మరింత శక్తిమంతురాలిని చేసింది. ఇక నిర్భయలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ప్రస్తుతం నాకు ఇద్దరు కుమారులున్నారు. ఈ సందర్భంగా ఓ తల్లిగా అందరితో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నా. ఆడపిల్లలను గౌరవించాలని, వారికి మర్యాద ఇవ్వాలని మనమే మన కుమారులకు చెప్పాలి. వారిని సరిగా పెంచితేనే దేశంలో ఆడపిల్లలు సురక్షితంగా ఉంటారని నేను గట్టిగా నమ్ముతాను. ప్రస్తుతం ఇదే విషయాన్ని నా ఇద్దరు కుమారులకు కూడా చెబుతున్నాను. ఒకవేళ నా కొడుకులు ఏ అమ్మాయినైనా ఇబ్బంది పెట్టారని తెలిస్తే నేనే వారిని చంపేస్తాను’ అని అంటోందీ సూపర్ వుమన్.
మీ కృషికి సరైన ఫలితం దక్కింది!
‘దిల్లీ క్రైమ్’ ఎమ్మీ అవార్డు సొంతం చేసుకోవడంతో సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్ చేసుకుంది షెఫాలీ. ఈ సందర్భంగా ‘ఓ మైగాడ్’ అంటూ పట్టరాని సంతోషం వ్యక్తం చేస్తూ అవార్డు ప్రకటిస్తున్న వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో పలువురు సెలబ్రిటీలు షెఫాలీని సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు.
ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘ఇదొక అద్భుతమైన సిరీస్. ఎమ్మీ అవార్డును గెలుచుకున్నందుకు ‘దిల్లీ క్రైమ్’ యూనిట్‌కు కంగ్రాట్స్. మీ కృషికి సరైన ఫలితం దక్కింది’ అని ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. అతడితో పాటు ప్రియాంకా చోప్రా, తాప్సీ, సోనాలీ బింద్రే, హృతిక్ రోషన్, అదితిరావు హైదరీ, విక్కీ కౌశల్ తదితరులు ఈ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.