సానియా మీర్జా... క్రికెట్‌ను మాత్రమే ఆరాధించే మన దేశంలో టెన్నిస్‌కు విశేష గుర్తింపు తీసుకొచ్చిన క్రీడాకారిణి. గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో పాటు డబుల్స్ విభాగంలో వరల్డ్ నెం.1 ర్యాంక్‌ను సొంతం చేసుకున్న ఈ టెన్నిస్ క్వీన్ తన ఆటతీరుతో టెన్నిస్ కోర్టుకే అందం తెచ్చింది. మెటర్నిటీ బ్రేక్ కారణంగా రెండేళ్లు దూరమైనా మళ్లీ టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టి అదరగొడుతోన్న ఈ టెన్నిస్ సెన్సేషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా అశేష అభిమానులున్నారు. ఈ క్రమంలో తాజాగా (నవంబర్ 15) 34వ వసంతంలోకి అడుగుపెట్టిందీ హైదరాబాదీ సంచలనం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమదైన శైలిలో సానియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
1986, నవంబర్ 15న ముంబైకి చెందిన ఇమ్రాన్ మీర్జా, నసీమా మీర్జా దంపతులకు జన్మించింది సానియా. తనకు ఆనమ్ మీర్జా అనే ఓ చెల్లెలు కూడా ఉంది. సానియా జన్మించిన కొంత కాలానికే తన ఫ్యామిలీ హైదరాబాద్‌లో స్థిరపడింది. ఈ నేపథ్యంలో ఆరేళ్ల వయసు నుంచే టెన్నిస్‌పై ఆసక్తి పెంచుకున్న సానియా తన ఆటతీరుతో భారత క్రీడా చరిత్రలో నం.1 టెన్నిస్ క్రీడాకారిణిగా వెలుగొందింది. గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో పాటు... ఆసియా కామన్వెల్త్, ఆఫ్రో-ఏషియన్ లాంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో పతకాలు గెలుచుకుంది. 2013లో సింగిల్స్‌కు గుడ్‌బై చెప్పేసి కేవలం డబుల్స్ పైనే పూర్తి దృష్టి సారించింది. ఈ విషయంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా డబుల్స్ ర్యాంకింగ్‌లో నెం.1 స్థానంలో నిలిచి వారందరికీ తన ఆటతోనే సమాధానం చెప్పింది.
ఇక 2010లో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో కలిసి పెళ్లిపీటలెక్కిన ఆమె రెండేళ్ల క్రితం ఇజాన్ అనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. అమ్మతనం కోసం రెండేళ్లు టెన్నిస్ కోర్టుకు దూరమైన ఆమె గతేడాది ఘనంగా పునరాగమనం చేసింది. కేవలం 4 నెలల్లోనే 26 కిలోల బరువు తగ్గి మళ్లీ టెన్నిస్ బ్యాట్ పట్టేందుకు సరిపడా ఫిట్నెస్ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తాను చేసిన వర్కవుట్లకు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఎందరికో స్ఫూర్తి కలిగించిందీ బ్యూటిఫుల్ మామ్.
నువ్వు లేని జీవితం వూహించుకోలేను!
ఈ క్రమంలో సానియా పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమె సోదరి ఆనమ్ మీర్జా ఇన్‌స్టా వేదికగా సానియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. తనతో కలిసున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘నా బలం, నా రక్షకురాలు, నా బెస్ట్ ఫ్రెండ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు లేకుండా నా జీవితంలో ఒక్కరోజును కూడా వూహించుకోలేను.. ఐలవ్యూ’ అని తెలిపింది.
సానియా పుట్టిన రోజు నాడే ఆమె తల్లి నసీమా జన్మదినం కావడం విశేషం. ఈ సందర్భంగా చిన్నతనంలో తన తల్లితో కలిసున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సానియా ‘అందమైన అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ జన్మదినం రోజే నేను పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. అదే నాకు లభించిన గొప్ప బహుమతి.. లవ్యూ’ అని తన తల్లిపై ఉన్న ప్రేమకు అక్షర రూపమిచ్చింది.
కొద్ది రోజుల క్రితమే ట్విట్టర్లోకి అడుగుపెట్టాడు సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా. ఈ సందర్భంగా తన కూతురు, భార్యతో కలిసున్న ఫొటోలను ట్విట్టర్లో పంచుకుంటూ ఇద్దరికీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా సానియాతో కలిసున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసుకుంటూ ‘నాకు నిరంతర స్ఫూర్తి, నా నవ్వుకు కారణం, నా సమస్యలన్నింటినీ ఓపికగా విని నాకు తోడుగా నిలుస్తున్న సానియాకు జన్మదిన శుభాకాంక్షలు. నీలాంటి స్నేహితురాలు నా జీవితంలోకి వచ్చినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. ఐ లవ్యూ షాను! (లవ్ ఎమోజీలు జత చేస్తూ)’ అని విషెస్ చెప్పింది.
సానియా క్లోజ్ ఫ్రెండ్ కొణిదెల ఉపాసన ఇన్స్టాగ్రామ్ వేదికగా సానియాకు పుట్టిన రోజు విషెస్ చెప్పింది. తనతో కలిసున్న ఫొటోను షేర్ చేసుకుంటూ ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌డే మై బెస్ట్ ఫ్రెండ్. మళ్లీ మనమెప్పుడు కలుద్దామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని రాసుకొచ్చింది.
‘అమ్మాయిలకి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే డైమండ్సే అని చాలామంది అంటారు. అలాంటి నా డైమండ్‌కు జన్మదిన శుభాకాంక్షలు’ అని ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ సానియాకు బర్త్‌డే విషెస్ చెప్పారు.
సానియా పుట్టిన రోజు సందర్భంగా యువరాజ్ సింగ్ తనదైన శైలిలో ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. సానియాతో కలిసున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసుకుంటూ ‘హ్యాపీ బర్త్‌డే మిర్చి మమ్మీ.. ఈ ఏడాది నీకు ‘ఏస్’ ఇయర్‌గా మారుతుందని ఆశిస్తున్నా.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అని పోస్ట్ చేశాడు.
వీరితో పాటు భారత క్రికెటర్లు సురేశ్‌రైనా, హర్భజన్ సింగ్, పాక్ క్రికెటర్ హసన్ అలీ, ప్రముఖ వ్యాఖ్యాత హర్షభోగ్లే, సినీ నటులు సుశాంత్, రితేశ్ దేశ్‌ముఖ్, బాలీవుడ్ డైరెక్టర్ శిరీష్ కుందర్ లాంటి సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు సానియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.
కరోనా కారణంగా ఒలింపిక్స్ లాంటి ప్రముఖ క్రీడా టోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. దీంతో ప్రస్తుతం ఇంటి దగ్గరే తన పిల్లాడి ఆలనాపాలన చూసుకుంటూనే టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తోంది సానియా. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కోసం గట్టిగా కృషి చేస్తున్న ఆమె తన కలను నెరవేర్చుకోవాలని కోరుకుంటూ మనమూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుదాం.
హ్యాపీ బర్త్‌డే.. సానియా!