కొన్ని నెలల క్రితం ఈ లోకం విడిచి వెళ్లిపోయిన చిరంజీవి సర్జా తన సతీమణి మేఘనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తనను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టనన్న మాటలను అక్షరాలా నిజం చేస్తూ పండంటి మగబిడ్డ రూపంలో మళ్లీ ఈ లోకంలోకి అడుగుపెట్టాడు. తాను ఎప్పటికీ ‘చిరంజీవి’నే అంటూ ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, అభిమానులందరిలో సంతోషం నింపాడు.
జూనియర్ చిరంజీవి వచ్చేశాడు!
దివంగత కన్నడ నటుడు చిరంజీవి సర్జా సతీమణి, నటి మేఘనా రాజ్ అమ్మగా ప్రమోషన్ పొందింది. దక్షిణ బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక చిరంజీవి ఆకస్మిక మరణం తర్వాత వదినకు అన్నీ తానై చూసుకుంటున్న ధ్రువ్ సర్జా చిన్నారిని చూసి భావోద్వేగానికి గురయ్యాడు. అన్నయ్యే మళ్లీ పుట్టాడంటూ ‘బేబీ బాయ్, జై హనుమాన్’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా తన ఆనందాన్ని అందరితో షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా అక్కడున్న ఆస్పత్రి సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టాడు. అనంతరం ఆ బిడ్డను చిరంజీవి సర్జా చిత్ర పటం దగ్గరకు తీసుకెళ్లి తండ్రి ఆశీర్వాదం, దీవెనలు అందించాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి తల్లిదండ్రులు కూడా వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. ఈక్రమంలో చిన్నారిని చూసి ‘చాలా సంతోషంగా ఉంది. మళ్లీ మా చిరంజీవిని చూసినట్లు ఉంది’ అని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘మేఘనా, చిరులకు పండంటి బాబు పుట్టాడు. మాకోసం ప్రార్థించిన సన్నిహితులు, స్నేహితులు, అభిమానులందరికీ ధన్యవాదాలు’ అంటూ ధ్రువ్ సతీమణి ప్రేర్నా శంకర్ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు మేఘనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అభిమానులు అయితే ‘జూనియర్ చిరంజీవి వచ్చేశాడు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
భర్త కటౌట్‌తో బేబీ షవర్ వేడుకలు!
చిరంజీవి, మేఘనలిద్దరూ చిత్ర పరిశ్రమకు చెందిన వారే. ఓ శుభకార్యంలో అనుకోకుండా పరిచయమైన వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు కలవడంతో ఆ స్నేహ బంధం కాస్తా ప్రేమగా చిగురించింది. అలా పదేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న చిరంజీవి - మేఘన 2018 మేలో పెద్దల ఆశీర్వాదంతో పెళ్లిపీటలెక్కారు. ఇక తమ ప్రేమ బంధాన్ని పరిపూర్ణం చేసుకునేందుకు ఓ పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించాలనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఈ ఏడాది జూన్‌లో గుండెపోటుతో చిరంజీవి కన్నుమూశాడు. దీంతో అతడి సతీమణి మేఘనతో పాటు అతడి కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అప్పటికే మూడు నెలల గర్భంతో ఉంది మేఘన. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు సీమంతం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా భర్త లేని లోటు తెలియకుండా మేఘన పక్కన చిరు నిల్చున్నట్లు ఓ పెద్ద కటౌట్‌ని ఏర్పాటు చేశారు.
అందుకే అక్టోబర్ అంటే ప్రత్యేకం!
సర్జా కుటుంబానికి అక్టోబర్ నెల ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే, ఈ నెలలోనే చిరు, ధ్రువ్ జన్మించారు. మరోవైపు మూడేళ్ల క్రితం ఇదే రోజున (అక్టోబర్ 22న) మేఘన-చిరుల నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు ఇదే నెలలో జూనియర్ చిరు కూడా జన్మించడంతో సర్జా ఫ్యామిలీ సంతోషం రెట్టింపైంది. ఇక అన్నయ్య చనిపోయిన తర్వాత వదిన మేఘనకు అన్నీ తానే అయి చూసుకుంటున్నాడు ధ్రువ్ సర్జా. తన అన్నయ్య కోరుకున్నట్లు మేఘనకు వేడుకగా సీమంతం జరిపించాడు. అదేవిధంగా పుట్టబోయే బిడ్డ కోసం రూ.10లక్షల ఖర్చుతో వెండి ఊయలను ముందే సిద్ధం చేసి ఉంచాడు.