నటన అంటే ఇష్టమున్న వాళ్లు సినిమా అవకాశాల కోసం పరితపించిపోతుంటారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుంటారు. ఈ క్రమంలోనే చిన్న పాత్రలో అవకాశమొచ్చినా ఎగిరి గంతేస్తుంటారు. అలాంటిది అసలు నటన గురించి తెలియకపోయినా, చిత్ర పరిశ్రమతో సంబంధం లేకపోయినా నటించే అవకాశం తలుపు తడితే.. అదీ స్టార్ నటీనటుల సరసన అయితే.. ఇక ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం కదా! అలాంటి అరుదైన అవకాశమే తనను వరించిందంటోంది బాలీవుడ్ స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అదజానియా. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో సినిమా ఇండస్ట్రీ గురించి బొత్తిగా తనకు తెలియదని, అలాంటి సమయంలో ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ వంటి హిట్ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టమంటోంది. ఈ చిత్రం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు అనైతా.
‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’.. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ సినిమాను ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు. అద్భుతమైన ప్రేమకథగా తెరకెక్కించిన ఈ సినిమాలో షారుఖ్, కాజోల్‌ల నటనకు ప్రేక్షకులు నూటికి నూరు మార్కులు వేశారు. అంతేనా.. వీరిద్దరినీ తెరపై మరోసారి హిట్ పెయిర్‌గా నిలిపిందీ సినిమా. ఇలాంటి అద్భుతమైన సినిమాలో హీరోహీరోయిన్ పాత్రలే కాదు.. సహాయక పాత్రలకు కూడా మంచి మార్కులే పడ్డాయి. అలాంటి ఓ సపోర్టింగ్ రోల్లో, హీరోయిన్ స్నేహితురాలిగా నటించే అవకాశం రావడం తన అదృష్టమంటున్నారు బాలీవుడ్ స్టైలిస్ట్ అనైతా. ఈ క్రమంలోనే అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారామె.
‘షీనా’ పాత్ర కోసం ఒప్పించారు!
‘అవి నేను కాలేజీలో చదువుతున్న రోజులు! ఆ సమయంలోనే ఆది (ఆదిత్య చోప్రా), కరణ్ (కరణ్ జోహర్) నన్ను కలిశారు. నన్ను, మా కాలేజ్ ఫ్రెండ్స్‌ని ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమాలో రాజ్ (షారుఖ్ ఖాన్), సిమ్రన్ (కాజోల్) స్నేహితులుగా నటించమని అడిగారు. అందుకు నేను ఒప్పుకోవడంతో తొలిసారి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టా. నిజానికి అప్పటికి సినీ పరిశ్రమ గురించి నాకు బొత్తిగా తెలియదు. ఈ సినిమాలో నన్ను షీనా పాత్ర (కాజోల్ ఫ్రెండ్‌గా) కోసం ఒప్పించారు. ఈ అవకాశాన్ని నేనెంతో ఎంజాయ్ చేశా. ఓ రకంగా నా ఫ్రెండ్‌తో కలిసి పెయిడ్ హాలిడే కోసం యూరప్ వెళ్లినట్లనిపించింది. కాలేజీ రోజుల్లో సంపాదన అంటే మాటలు కాదు కదా మరి!
కుటుంబంతో గడిపినట్లనిపించింది!
ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్‌లోని సానెన్ అనే చిన్న పట్టణానికి వెళ్లాం. బస్‌లోనే ఫ్రెషప్ అయి కిందికి దిగేసరికి బ్లాక్ సూట్ ధరించి చిన్న వంతెనపై నిల్చొన్న షారుఖ్‌ని చూశాను. అప్పుడు అక్కడ తను నాకోసమే ఉన్నాడేమో అనిపించింది. నాకే కాదు.. అక్కడ ఉన్న తనను చూస్తే ఎవరికైనా ఇలాంటి భావనే కలుగుతుంది.. అంతటి అందగాడతను!
ఇక కాజోల్ గురించి చెప్పాలంటే.. తన నిజాయతీ, ఇతరుల్ని ప్రేమగా పలకరించే నైజం, సహజత్వం.. ఆమెకు మాత్రమే సొంతమేమో! అందుకే ఇప్పటికీ తనను ప్రేమగా హత్తుకోవాలనిపిస్తుంది. ఇక అప్పట్లో తారలకు ప్రత్యేక ఎస్కార్ట్, మేనేజర్స్, మొబైల్స్, సోషల్ మీడియా.. వంటివేమీ లేవు. సినిమా చిత్రీకరణ అంటే ఎంతో సింపుల్‌గా పూర్తయ్యేది.. ఒక్కసారి షూటింగ్‌లోకి అడుగుపెట్టామంటే బయటి ప్రపంచంతో సంబంధం ఉండేది కాదు.. అందరం కలిసే ఉండేవాళ్లం.. కలిసే భోంచేసేవాళ్లం.. ఆటపాటలు, డ్యాన్స్.. ఎంతో ఎంజాయ్మెంట్ ఉండేది.. దిగ్గజ దర్శకుడు యష్ చోప్రా అంకుల్ పర్యవేక్షణలో ఓ కుటుంబంతోనే ఉన్నట్లనిపించింది.
నటనలోకి రావాలనుకోకపోయినా..!
ఆదిత్య చోప్రా ఈ సినిమాను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావించారో, ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు.. ఈ సినిమా చిత్రీకరణ జరిగిన రోజుల్ని అందరం కలిసి ఎంతగానో ఎంజాయ్ చేశాం. నేను నటనలోకి రావాలని అనుకోకపోయినా ఇంత గొప్ప చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఈ అవకాశం నాకు అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు!’ అంటూ తన మనసులోని మాటల్ని పంచుకున్నారీ బాలీవుడ్ స్టైలిస్ట్.
ఫ్యాషన్ స్టైలిస్ట్‌గా తనదైన ముద్ర!
‘డీడీఎల్జే’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అనైతా.. ‘కల్ హో నా హో’ సినిమాలో సైఫ్ ఫ్రెండ్‌గా గీత పాత్రలో కూడా నటించారు. ఆపై ఫ్యాషన్ స్టైలిస్ట్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా, లైఫ్‌స్టైల్ కన్సల్టెంట్‌గా, క్రియేటివ్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను మలచుకున్నారు. ప్రస్తుతం వోగ్ ఇండియా మ్యాగజీన్‌కు ఫ్యాషన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారామె. ముంబయికి చెందిన ఆమె అక్కడే ‘స్టైల్ సెల్’ అనే స్టైలింగ్ కన్సల్టెన్సీని ప్రారంభించారు. దీని ద్వారా ‘ధూమ్ సిరీస్’, ‘బీయింగ్ సైరస్’, ‘ఎవ్రీబడీ సేస్ ఐ యామ్ ఫైన్!’, ‘కాక్టెయిల్’, ‘లవ్ ఆజ్ కల్’.. వంటి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ముఖ్యంగా ధూమ్ సిరీస్‌లో భాగంగా ‘ధూమ్’లో జాన్ అబ్రహాం, ఈషా డియోల్; ‘ధూమ్-2’లో ఐశ్వర్యారాయ్, హృతిక్ రోషన్, బిపాసా బసు; ‘ధూమ్-3’లో కత్రినా కైఫ్ పాత్రలకు తనదైన ఫ్యాషన్లతో వన్నెలద్ది పాపులర్ స్టైలిస్ట్‌గా పేరుతెచ్చుకున్నారు అనైతా. ప్రస్తుతం దీపికా పదుకొణె స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తూ.. ఆమె హాజరయ్యే అన్ని ఈవెంట్లకు సొగసైన ఫ్యాషన్స్‌ని సమకూరుస్తున్నారీ ఫ్యాషనిస్టా. 2002లో దర్శకుడు, స్క్రీన్‌ప్లే రైటర్ అయిన హోమీ అదజానియాను వివాహమాడారు అనైకా. ఈ జంటకు ఇద్దరు కుమారులున్నారు.
|