అమ్మతనం ఓ అద్భుతం. గర్భం ధరించడం మొదలు ప్రసవం అయ్యేంత వరకు ప్రతి క్షణం పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచిస్తుంటారు. ఎప్పుడెప్పుడు తన చిన్నారిని చేతుల్లోకి తీసుకుందామా అని ఆత్రంగా ఎదురుచూస్తూ ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి మధురానుభూతుల్లోనే తేలియాడుతోంది అమృతా రావు. ‘అతిథి’ సినిమాలో మహేశ్ సరసన నటించి టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అందాల తార త్వరలోనే తల్లి కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం తాను ప్రెగ్నెన్సీని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానంటూ తన అనుభవాలను షేర్ చేసుకుంది.
2007లో బాలీవుడ్లో విడుదలైన ‘వివాహ్’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది అమృత. హిందూ వివాహ సంప్రదాయానికి సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో, ఆమె ‘పూనం’ అనే ఓ మధ్య తరగతి యువతి పాత్రలో నటించింది. ఈ సినిమాలో అమృత అభినయానికి ఎం.ఎఫ్.హుస్సేన్ లాంటి ప్రముఖులు ఫిదా అయ్యారు. దీంతో పాటు ‘ఇష్క్ విష్క్’, ‘మస్తి’, ‘మై హూనా’, ‘దీవార్’, ‘శిఖర్’, ‘హే బేబీ’, ‘శౌర్య’, ‘లైఫ్ పార్ట్నర్’, ‘వెల్కం టు సజ్జన్‌పూర్’, ‘జాలీ ఎల్ ఎల్ బీ’, ‘సింగ్ సాబ్ ది గ్రేట్’, ‘సత్యాగ్రహ’... తదితర సినిమాల్లో నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. ఇక ‘అతిథి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది.
ఏడేళ్ల పాటు ప్రేమలో!
సినిమాల్లో నటిస్తున్నప్పుడే ప్రముఖ రేడీయో జాకీ ఆర్జే అన్మోల్తో ప్రేమలో పడింది అమృత. ఏడేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు 2016 మే 15 న పెళ్లి చేసుకున్నారు. వెండి తెరపైనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ చాలా సింపుల్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. అందుకే ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో మాత్రమే అన్మోల్తో కలిసి ఏడడుగులు నడిచింది అమృత.
వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె గతేడాది ‘థాక్రే’ సినిమాతో మళ్లీ సిల్వర్ స్ర్కీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె గర్భవతి అని, త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో భర్త అన్మోల్తో కలిసి ముంబయిలోని ఓ ఆస్పత్రి వద్ద బేబీ బంప్‌తో కనిపించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిపై స్పందించిన అమృత తాను తల్లి కాబోతున్న విషయం నిజమేనని స్పష్టం చేసింది. ఇదే సందర్భంలో తన ప్రెగ్నెన్సీ గురించి, భర్త అన్మోల్ గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
మాకోసం భగవద్గీత చదువుతున్నాడు!
‘ఇప్పుడు మనం కరోనా సంక్షోభంతో పోరాడుతున్నాం. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత ఎంతో ముఖ్యం. మన పరిస్థితి (కరోనాను ఉద్దేశిస్తూ) లోపలున్న మా బేబీకి కూడా తెలిసినట్లు ఉంది. నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు. గర్భిణిగా ఆహారం విషయంలో నాకెలాంటి ప్రత్యేకమైన కోరికలు లేవు. సాధారణ సమయాల్లో మాదిరిగానే అన్నీ తింటున్నా. నా బేబీ దీనితోనే సంతోషంగా ఉందేమో. నేను అమ్మను కాబోతున్నానంటే నాకు నమ్మకం కలగడం లేదు. బహుశా నా చిన్నారి కళ్ల ముందు ఉంటే... అప్పుడు ప్రకృతి శక్తి నాకు తెలుస్తుందేమో. ఇక లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి అన్మోల్ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. తద్వారా మా బంధాన్ని మరింత దృఢంగా మార్చుకునేందుకు కావాల్సినంత సమయం దొరికింది. ఇక గర్భం ధరించాక నా భర్త నన్ను మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నాకోసం, పుట్టబోయే బిడ్డ కోసం ప్రతి రోజూ రాత్రి సమయంలో భగవద్గీత చదువుతున్నాడు. అదేవిధంగా మా ఇద్దరికీ రెట్రో సాంగ్స్ అంటే చాలా ఇష్టం. కాబట్టి వాటిని వింటూ కాలక్షేపం చేస్తున్నాం’ అని మురిసిపోయిందీ కాబోయే అమ్మ.