ఇంట్లో ఓ మనిషినో, ఆత్మీయుడినో కోల్పోతే ఆ బాధను మాటల్లో చెప్పలేం. అలాంటిది నిండు నూరేళ్లు కలిసి కష్ట సుఖాలు పంచుకోవాల్సిన భర్త దూరమైతే ఆ మహిళ పడే ఆవేదన ఎలా ఉంటుందో అసలు వూహించలేం. ప్రస్తుతం అలాంటి బాధనే అనుభవిస్తోంది సినీ తార మేఘనారాజ్. త్వరలో అమ్మగా ప్రమోషన్ పొందుతున్న తరుణంలో భర్త చిరంజీవి సర్జా హఠాన్మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతోంది మేఘన. ఈ సందర్భంగా మరోసారి అతని జ్ఞాపకాలను తలుచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది.
పదేళ్ల పాటు ప్రేమలో ఉన్న మేఘన-చిరంజీవి రెండేళ్ల క్రితం ఏడడుగులు నడిచారు. వారిద్దరి ప్రేమ బంధానికి గుర్తుగా ఓ పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించాలనుకున్నారు. అయితే మేఘనతో పాటు కుటుంబ సభ్యులు, అభిమానులందరికీ విషాదం మిగుల్చుతూ గుండె పోటుతో కన్నుమూశాడు చిరు. అప్పటికే మూడు నెలల గర్భంతో ఉన్న మేఘన మరికొన్ని రోజుల్లో తల్లి కానుంది. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు సీమంతం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా భర్త లేని లోటు తెలియకుండా మేఘన పక్కన చిరు నిల్చున్నట్లు ఓ పెద్ద కటౌట్‌ని ఏర్పాటు చేశారు ఆమె కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో భర్తతో తనకున్న మధుర జ్ఞాపకాలను తాజాగా మరోసారి గుర్తుకు తెచ్చుకుంది మేఘన.
చిరు ఫొటోని చూసి కన్నీళ్లు ఆగలేదు!
‘మా ప్రేమ బంధానికి ప్రతిరూపంగా పుట్టబోతున్న మొదటి సంతానం గురించి మేమిద్దరం ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాం. ప్రత్యేకించి సీమంతం వేడుక విషయంలో చిరు చాలా ప్లాన్ చేశాడు. కానీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఇంట్లోనే ఈ వేడుక జరగాలని నేను అనుకున్నాను. దీంతో చిరు కొంచెం నిరాశపడినప్పటికీ... సీమంతం వేడుకను రెండు రకాలుగా చేయాలనుకున్నాడు. అందులో ఒకటి నేను కోరుకున్న విధంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో... మరొకటి సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో హోటల్లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలనుకున్నాడు. కానీ చిరు అకాల మరణంతో మా కలలన్నీ ఒక్కసారిగా చెదిరిపోయాయి. అయితే చిరు కోరుకున్నట్లు ఇటీవల మా కుటుంబ సభ్యుల సమక్షంలో నాకు వేడుకగా సీమంతం నిర్వహించారు.అదేవిధంగా ధ్రువ్ సర్జా (చిరంజీవి సర్జా సోదరుడు) ఓ ప్రైవేట్ హోటల్లో ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. నా సన్నిహితులు, స్నేహితులందరూ విచ్చేసి నన్ను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో భాగంగా చిరు కటౌట్‌ని నా పక్కనే ఉంచారు. ఆ ఫొటోని చూసే సరికి నాకు కన్నీళ్లు ఆగలేదు’..
ప్రతి క్షణం పండగలా!
‘ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు మా జీవితం ఎంతో సంతోషంగా సాగింది. కరోనా కారణంగా వచ్చిన లాక్డౌన్ మా ఇద్దరినీ మరింత దగ్గర చేసింది. ఇదే సమయంలో మా ఇద్దరి కల కూడా నిజమైంది. మాకు పండంటి బిడ్డ పుట్టబోతున్నాడన్న వార్త మా సంతోషాన్ని రెట్టింపు చేసింది. అయితే మా కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది సన్నిహితులకు తప్ప మరెవరితోనూ ఈ విషయం చెప్పలేదు. గర్భం ధరించిన మహిళలు మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తలు పాటించాలని పెద్దలు చెబుతుంటారు. పైగా మాకిది మొదటి సంతానం. అందుకే నాకు ఐదు నెలలు నిండాకనే అందరితో ఈ శుభవార్త షేర్ చేసుకోవాలనుకున్నాం. అందుకోసం ఎన్నో ప్రణాళికలు కూడా వేసుకున్నాం. ఇక నేను గర్భం ధరించిప్పటి నుంచి ప్రతిక్షణం మాకో పండగలా గడిచిపోయింది. మా ఇద్దరి జీవితానికి సంబంధించి ఇవే మేం గడిపిన అత్యుత్తమ క్షణాలు’..
అవే చిరు ఆఖరి మాటలు!
‘జూన్ 7న ఉదయం నేను, ధ్రువ్, అతని సతీమణి ఇంటి ఆవరణలో మాట్లాడుకుంటున్నాం. ఆ సమయంలో మామయ్య ఫోన్ చేశాడు. చిరు కుప్పకూలిపోయాడని చెప్పాడు. దీంతో మేం ముగ్గురం వెంటనే కంగారు పడుతూ లోపలికి వెళ్లాం. అప్పటికే చిరు స్పృహ కోల్పోయాడు. నాకు చాలా భయమేసింది. చిరుని పట్టుకుని కళ్లు తెరమని గట్టిగా అరిచాను. ఆ సమయంలో ఆయన కళ్లు తెరచి ‘నా గురించి నువ్వు కంగారు పడొద్దు’ అని ధైర్యం చెప్పారు. అవే ఆయన ఆఖరి మాటలు. వెంటనే మేం దగ్గరలో ఉన్న ఆస్పత్రికి ఆయనను తీసుకెళ్లాం. అక్కడి డాక్టర్లు చిరును ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్లి పరీక్షించి గుండెపోటు అని నిర్ధారించారు. కొంత సమయానికే అంతా శూన్యంలా మారిపోయింది. చిరు నాతో ఎప్పుడూ ఒక్కమాట చెప్పేవాడు. నన్ను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టనని చెప్పేవాడు. ‘ఫీనిక్స్ పక్షి లాగా నీ కోసం నేను కూడా బూడిద నుంచి మళ్లీ జన్మిస్తా’ అని అనేవాడు. అతడు ఆకాంక్షించినట్లే త్వరలో పండంటి బిడ్డ రూపంలో చిరు మళ్లీ మా ముందుకు వస్తాడు ’ అని భావోద్వేగంతో చెప్పుకొచ్చింది మేఘన.