పీసీఓఎస్/పీసీఓడీ.. పేరేదైనా ఎంతోమంది మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందీ సమస్య. పదిలో కనీసం ఒక్కరైనా ఈ సమస్యతో బాధపడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మహిళల పట్ల ఇదెంత శాపంగా పరిణమిస్తుందో! అయితే ఈ సమస్యతో బాధపడే మహిళలు కూడా తమ అనుభవాలను బయటికి చెప్పడానికి ఇష్టపడరు.. కారణం సమాజం తమనెక్కడ చిన్న చూపు చూస్తుందోనని! కానీ కొంతమంది మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి తమ పీసీఓఎస్ స్టోరీని పంచుకుంటూ నలుగురిలో స్ఫూర్తి నింపుతుంటారు. అలాంటి వారిలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఉన్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ కూడా తాను గత కొన్నేళ్లుగా పీసీఓస్‌తో బాధపడుతున్నట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అంతేకాదు.. ఈ సమస్యను అదుపు చేసుకోవడానికి తాను పాటిస్తోన్న చిట్కాలను సైతం ఓ వీడియో రూపంలో పోస్ట్ చేసి ఇతర మహిళల్లో పీసీఓఎస్‌పై అవగాహన పెంచుతోంది.
సంతాన సమస్యలు, అధిక బరువు, అవాంఛిత రోమాలు.. పీసీఓఎస్ మహిళలపై చూపే ప్రతికూల ప్రభావానికి కొన్ని సాక్ష్యాలివి! ఇది ఒక్కసారి మన జీవితంలోకొచ్చిందంటే.. దీన్ని అదుపు చేసుకోవడమే తప్ప.. శాశ్వత పరిష్కారం లేదంటున్నారు వైద్య నిపుణులు. చక్కటి లైఫ్‌స్టైల్, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం.. వంటివన్నీ పీసీఓఎస్‌ను అదుపు చేసుకునేందుకు మార్గాలు అంటూ సలహా ఇస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ కూడా ఇదే విషయం చెబుతోంది. పీసీఓఎస్ బారిన పడ్డాక తాను ఎదుర్కొన్న సవాళ్లను, దీన్ని అదుపు చేసుకునేందుకు పాటిస్తోన్న చిట్కాలను వివరిస్తూ ఓ వీడియో రూపొందించిందీ భామ. దీన్ని తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ మహిళలందరిలో ఈ సమస్య పట్ల అవగాహన పెంచుతోంది.
ఎందరో డాక్టర్లను కలిశాను!
‘స్టోరీ టైమ్ విత్ సోనమ్’ పేరుతో తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో భాగంగా తన పీసీఓఎస్ అనుభవాలను ఇలా పంచుకుందీ సొగసరి. ‘పీసీఓఎస్/పీసీఓడీ.. ఈ పేరు మనందరికీ సుపరిచితమే.. నేను కూడా దీని బాధితురాలినే! గత కొన్నేళ్లుగా నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను. నాకు 14/15 ఏళ్ల వయసున్నప్పుడు ఈ సమస్య ఉందని తెలిసింది. ఇక అప్పట్నుంచి దీన్నుంచి విముక్తి పొందడానికి నేను తిరగని ఆస్పత్రి లేదు.. కలవని డాక్టర్ లేరు.. ఎందరో డైటీషియన్స్, న్యూట్రిషనిస్టుల్ని కలిశాను.. సహజసిద్ధమైన చిట్కాల్ని సైతం ప్రయత్నించా. ప్రస్తుతం నా సమస్య అదుపులోనే ఉంది. ఈ స్థితికి రావడానికి నేను పాటించిన/పాటిస్తోన్న కొన్ని చిట్కాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
అయితే అంతకంటే ముందు ఒక్క విషయం చెప్పాలి.. అదేంటంటే - ఈ సమస్యను మీలోనే దాచుకోకుండా సంబంధిత నిపుణుల్ని సంప్రదించండి.. మీ లక్షణాల గురించి వారికి నిర్మొహమాటంగా తెలియజేయండి.. అంతేకాదు.. పీసీఓఎస్ నిర్ధారణ అయిన వాళ్లు కూడా నిపుణుల సలహా తీసుకున్నాకే మందులు వాడడం, వారు చెప్పే చిట్కాలను పాటించడం ఉత్తమం. ఎందుకంటే ఈ సమస్య లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కాబట్టి తీసుకునే ఆహారమైనా, వేసుకునే మందులైనా.. ఇలా ఏదైనా వైద్యుల సలహా మేరకే పాటించాలన్న విషయం గుర్తుపెట్టుకోండి.
ఈ మూడు చిట్కాలు ఉపకరించాయి!
నడక మంచిదే! ప్రస్తుతం మనలో చాలామందికి వృత్తిరీత్యా ఎక్కువ సమయం కూర్చొనే పనిచేయాల్సి వస్తోంది. దాంతో శరీరానికి వ్యాయామం అందట్లేదు. కానీ మన రోజువారీ లైఫ్స్టైల్లో నడక అనేది సర్వసాధారణమైనది. ఈ విషయం గ్రహించినప్పట్నుంచి నేను కూడా నడకను నా రోజువారీ వర్కవుట్లలో భాగం చేసుకున్నా. ఈ క్రమంలోనే రోజూ కనీసం పది వేల అడుగులైనా వేస్తాను.
యోగాతో ఒత్తిడి దూరం! యోగా మనలో శక్తిసామర్థ్యాలను, ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. ఈ క్రమంలో శారీరక దృఢత్వం కోసం హఠయోగా, గుండె ఆరోగ్యం కోసం సూర్య నమస్కారాలు చేయచ్చు. అలాగే ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు కూడా యోగా కిందకే వస్తాయి. వాటినీ సాధన చేయాలి. ఇక పీసీఓఎస్ కారణంగా నేను ఎదుర్కొన్న లక్షణం ఒత్తిడి. చాలామందిలో ఇది సహజమే! శారీరక ఒత్తిడైనా, మానసిక ఒత్తిడైనా ఆరోగ్యానికి మంచిది కాదు.. దీన్నుంచి బయటపడేందుకు యోగా, ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు.. వంటివన్నీ నాకెంతో ఉపయోగపడ్డాయి. కాబట్టి మీరు కూడా పీసీఓఎస్ ఒత్తిడిని ఈ చిన్న చిన్న వ్యాయామాలతో అధిగమించచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం మనకు బోలెడన్ని మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి సహాయం తీసుకోవచ్చు.

చక్కెర వద్దు! చక్కెర మన ఆరోగ్యాన్ని నిలువెల్లా ముంచేస్తుంది. అందుకే నేను దీన్ని పూర్తిగా పక్కన పెట్టేశా. అప్పట్నుంచి నా ఆరోగ్యం విషయంలో ఎన్నో మంచి మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రాసెస్ చేసిన చక్కెరలు కూడా మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదు. చక్కెర మాత్రమే కాదు.. తేనె, మేపుల్ సిరప్, బెల్లం.. వంటి సహజ చక్కెరలను కూడా నేను పక్కన పెట్టేశా. నిజానికి నేను ఒకప్పుడు చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, చాక్లెట్లు.. వంటి పదార్థాలంటే పడి చచ్చిపోయేదాన్ని. కానీ వాటిని పూర్తిగా మానేసినప్పట్నుంచి వాటి గురించే ఆలోచించట్లేదు. మనకు ఆయా కాలాల్లో దొరికే పండ్లలో కూడా బోలెడన్ని సహజ చక్కెరలుంటాయి. కమలాఫలం, యాపిల్.. వంటివి వాటిలో కొన్ని! మీకు స్వీట్ తినాలన్న కోరిక కలిగినప్పుడు ఇలాంటి పండ్లు తీసుకోండి.. ఆరోగ్యానికీ మంచిది. ముఖ్యంగా ఈ చిట్కాలు నా పీసీఓఎస్ సమస్యను అదుపులో ఉంచుకోవడానికి నాకు దోహదం చేశాయి.. ఇవి మీకూ ఉపయోగపడతాయనుకుంటున్నా. మీ పీసీఓఎస్ అనుభవాలు, చిట్కాలేమైనా ఉంటే నాతో పంచుకోండి..!’ అంటూ చెప్పుకొచ్చిందీ కపూర్ బ్యూటీ.
|
ఇలా సోనమ్ పెట్టిన వీడియో పోస్ట్‌కు పలువురు మహిళలు స్పందించారు. ‘మీ పోస్ట్ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.. థ్యాంక్యూ!’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు.. ఈ సొగసరి పిలుపు మేరకు మరికొంతమంది తమ పీసీఓఎస్ అనుభవాలు, ఈ సమస్యను అదుపు చేసుకోవడానికి వారు పాటిస్తోన్న చిట్కాల్ని సైతం పంచుకుంటూ అందరిలో దీని గురించి అవగాహన పెంచుతున్నారు.