తన శ్రావ్యమైన స్వరంతో సంగీత ప్రియుల్ని అలరించే బ్యూటిఫుల్ సింగర్ చిన్మయీ శ్రీపాద. సందర్భం వచ్చినప్పుడల్లా మహిళా అంశాలపై స్పందించే ఈ గాయని.. తన సేవా భావంతోనూ అశేష అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే తన సంగీత కళను ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ సేవ కోసమే వినియోగిస్తోందీ సూపర్ సింగర్. తన ప్రియమైన అభిమానులు అడిగిన పాటలు పాడుతూ, వారికి విషెస్ చెబుతూ లక్షల కొద్దీ విరాళాలు సేకరిస్తోందీ ముద్దుగుమ్మ. ఇలా పోగైన మొత్తాన్ని ఈ కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి వినియోగిస్తోంది. ఇలా మరోసారి తన సేవాభావంతో అందరి మన్ననలు అందుకుంటోందీ అందాల గాయని.
కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, రోజువారీ కూలీ పనులు లేక రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్నో! అలాంటి వారికి తన వంతుగా సాయం చేయడానికి ముందుకొచ్చింది గాయని చిన్మయి. ఈ క్రమంలో తన గాత్రాన్ని అరువిస్తోందీ బ్యూటీ. తన అభిమానులు అడిగే పాటలు పాడుతూ, విషెస్ చెబుతూ.. వారి దగ్గర్నుంచే విరాళాలు సేకరిస్తూ ఈ మంచి పనిలో వారినీ భాగం చేస్తోందీ క్యూటీ.
అలా వచ్చింది ఆలోచన!
ఇలా తన సేవ గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘కరోనా కష్టాలు మొదలైనప్పట్నుంచి చాలామంది పనుల్లేక ఖాళీగా ఉన్నారు. ఉన్న జీవనోపాధి కూడా కోల్పోవడంతో వారంతా రోడ్డున పడ్డారు. అలాగే తమిళనాడుకు చెందిన బధిరుల స్కూల్లో పనిచేసే ఓ టీచర్ తమ విద్యార్థుల సహాయార్థం నా దగ్గరికి వచ్చారు. అలాంటి వారి కోసం నా వంతుగా ఏదైనా చేయాలనిపించింది. వెంటనే అలాంటి వారి గురించి ఆరా తీయగా వారిలో చాలామంది పిల్లల తల్లిదండ్రులు రోజువారీ కూలీలని, వారు కనీసం స్కూల్ ఫీజు కూడా కట్టే స్థితిలో లేరని తెలిసింది. అందుకే నా కళా నైపుణ్యంతోనే వీరి కోసం విరాళాలు సేకరించి అందించాలనుకున్నా. అయితే చాలామంది నా ఫ్యాన్స్ నా గాత్రం వినాలంటూ పదే పదే కోరుతుంటారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో విషెస్ చెప్పాలని, పాటలు అంకితం చేయాలని సోషల్ మీడియాలో రిక్వెస్ట్లు పెడుతుంటారు. అలాంటి వారికోసం నేను చేసే వీడియోలనే విరాళాలు సేకరించడానికి మార్గంగా ఎంచుకుంటే బాగుంటుంది కదా అనిపించింది.
వారు మానవత్వానికి మచ్చు తునకలు!
అలా గత ఆరు నెలలుగా దాదాపు 3000 వీడియోలు రికార్డ్ చేశా. వీటిని ఫ్యాన్స్కి పంపిస్తూ వారి ద్వారా వచ్చిన డబ్బును నేరుగా అవసరార్థుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా చేస్తున్నా. ఈ క్రమంలో ఇప్పటిదాకా 85 లక్షలకు పైగా విరాళాలు అందాయి. దాతల్లో ఒక్కొక్కరు రూ. 500, రూ. 1000 అలా అందిస్తున్నారు. ఒక ఎన్నారై అయితే లక్షన్నర విరాళంగా ఇచ్చారు. ఇలా మొత్తంగా చెప్పాలంటే అవసరంలో ఉన్న ఒక్కో కుటుంబానికి ఐదు వేల నుంచి ఏడు వేల దాకా సహాయం అందుతోంది. ఈ కార్యక్రమానికి అభిమానుల నుంచి వస్తోన్న స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉంది.. సమాజంలో మంచి, మానవత్వం ఇంకా మిగిలుందని చెప్పడానికి ఇలాంటి వ్యక్తులే ప్రత్యక్ష ఉదాహరణ.. ఈ సేవా కార్యక్రమాన్ని ఇకముందు కూడా ఇలాగే కొనసాగించాలనుకుంటున్నా..’ అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటిఫుల్ సింగర్. ఇలా ఈ ముద్దుగుమ్మ చేస్తోన్న సేవను తన ప్రాణ స్నేహితురాలు, నటి సమంత సోషల్ మీడియా వేదికగా ప్రశంసించింది.
కేవలం ఈ కరోనా సమయంలో అనే కాదు.. గతంలోనూ పలు ఛారిటీల కోసం పాటలు పాడింది చిన్మయి.. అలాగే తన వివాహాన్ని కూడా ఎంతో సింపుల్గా జరుపుకొని.. ఆ ఖర్చును ఓ సంస్థకు విరాళంగా అందించి తన మంచి మనసును చాటుకుందీ క్యూట్ సింగర్. ఇలా తన సేవతో అవసరార్థుల కుటుంబాల్లో వెలుగులు నింపుతూ.. అందరి మన్ననలూ అందుకుంటోందీ అందాల గాయని.
హ్యాట్సాఫ్ చిన్మయి!