ఎవరినైనా చూస్తే చాలు.. వారిలో ఏం లోపముందా? అనే వెతుకుతుంటాయి చాలామంది కళ్లు. ఇక నిజంగానే వారి శరీరాకృతిలో ఏదైనా లోపమున్నా, చర్మ ఛాయ తక్కువగా ఉన్నా.. ఏదో ఒక మాట అనేదాకా ఊరుకోవు వాళ్ల నోళ్లు! అసలు ముందు వాళ్లు ఎలా ఉన్నారో చూసుకోకుండా, ఎదుటివారి మనసు నొచ్చుకుంటుందేమో అన్న కనీస ఆలోచన కూడా లేకుండా ఇతరుల శరీరాకృతి, అందం గురించి మాట్లాడుతుంటారు. ఇలాంటి బాడీ షేమింగ్‌కు తాను కూడా బాధితురాలినే అంటోంది టాలీవుడ్ భామ తేజస్వీ మదివాడ. దీని కారణంగా తాను ఎంతో బాధను అనుభవించానని, అయితే ఇతరుల కోసం మనం మారాల్సిన అవసరం లేదని ఆలస్యంగా గ్రహించానని చెబుతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తన కోసం తాను సమయం కేటాయించుకోవడం వల్ల బోలెడన్ని విషయాలు నేర్చుకున్నానంటోంది ఈ ఐస్‌క్రీమ్ బ్యూటీ..
ఎవరి కోసమో నేనెందుకు మారాలి?!
కరోనాకు ముందు వరకు మన కోసం మనం కాస్త సమయం కేటాయించుకుందామంటే అస్సలు కుదిరేది కాదు.. కానీ కరోనా వల్ల దొరికిన ఈ ఖాళీ సమయంలో చాలామంది ఎవరి కోసం వారు సమయం కేటాయించుకుంటూ వాళ్ల ఆసక్తుల్ని గుర్తించారు.. గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఆత్మపరిశీలన చేసుకున్నారు. నేను కూడా అదే చేశాను. కొన్నేళ్ల క్రితం నేను ఒక వ్యక్తితో డేటింగ్ చేశాను. అతని అభీష్టం మేరకు నన్ను నేను చాలానే మార్చుకున్నాను. కానీ మన ఇష్టాయిష్టాల్ని పక్కన పెట్టి ఇతరుల కోసం, సమాజం కోసం మనల్ని మనం మార్చుకోవడం వల్ల ఎంత బాధ కలుగుతుందో.. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో నాకు నేను సమయం గడిపితే కానీ నాకు అర్థం కాలేదు.
అమ్మ పోయాక ఒంటరినయ్యా!
ఇప్పుడనే కాదు.. నేను పెరిగి పెద్దయ్యే క్రమంలోనూ తీపి చేదు కలయికతో కూడిన అనుభవాలు నాకు చాలానే ఉన్నాయి. నేను సంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబంలో పుట్టిపెరిగాను. నా పదకొండేళ్లప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న మద్యానికి బానిసయ్యాడు. ఇక ఇంట్లో ఉండలేక 18 ఏళ్ల వయసులో ఇంటి నుంచి బయటికొచ్చేశా. ఒంటరిగా ఉండడం ప్రారంభించా. ఆ సమయంలో నేను వేసుకునే దుస్తులు, కలిసే వ్యక్తుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించేదాన్ని. ఈ క్రమంలో శరీరమంతా కప్పి ఉండేలా చుడీదార్స్ ధరించేదాన్ని. ఇతర మహిళలు ధరించిన దుస్తుల విషయంలో నేనూ జడ్జి చేసేదాన్ని. ఈ క్రమంలో నాలో ఆత్మన్యూనత భావం కలిగేది. ఆ తర్వాత పరిస్థితుల రీత్యా నా డ్రస్ సెన్స్‌ని కూడా మార్చుకున్నా. అంతెందుకు ఏడాది క్రితం వరకు సోషల్ మీడియాలో నా బికినీ ఫొటోలు పెట్టడానికి కూడా నేను భయపడ్డా.. ఎవరెలా జడ్జ్ చేస్తారోనన్న భయం, అభద్రతా భావం నా మీద నాకే ఒక సందేహాన్ని రేకెత్తించాయి.
ఆత్మపరిశీలన వల్లే ఈ మార్పు..!
అంతేకాదు.. ఒకానొక సమయంలో ఇతరుల నుంచి నేను బాడీ షేమింగ్‌ని కూడా ఎదుర్కొన్నా. నా నుదురు పెద్దగా ఉందని చాలామంది నా మొహం మీదే చెప్పేవారు. ఈ క్రమంలో నాకు కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. ఆ తర్వాత నా డ్రస్ సెన్స్‌ని కూడా మార్చుకున్నా.. లాక్‌డౌన్‌కి ముందు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేయించుకున్నా. ఆ సమయంలో ఎంతో నొప్పిని భరించా. ఇదంతా ఇతరుల మాటల్ని మనసు లోకి తీసుకోవడం వల్లే అని ఆలస్యంగా గ్రహించా. అందుకే ఈ ఐదు నెలలుగా నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకున్నా. నా ఆలోచనలకు విలువనివ్వడం ప్రారంభించా. ఎవరి కోసమో నేను మారాల్సిన అవసరం లేదన్న గొప్ప పాఠం నాకు అవగతమైంది. ప్రస్తుతం నేను సింగిల్‌గా, చాలా హ్యాపీగా ఉన్నా. నాకంటూ సమయం కేటాయించుకోవడం, నా చుట్టూ సానుకూల దృక్పథంతో ఆలోచించే వ్యక్తులుండేలా జాగ్రత్తపడడం నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకోవడానికి దోహదం చేసింది..’ అంటూ తన అనుభవాలను, కరోనా పరిస్థితుల్లో తాను నేర్చుకున్న పాఠాల గురించి చెప్పుకొచ్చిందీ క్యూటీ.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన తేజస్వి.. ‘ఐస్‌క్రీమ్’, ‘లవర్స్’, ‘కేరింత’, ‘శ్రీమంతుడు’, ‘మిస్టర్’.. తదితర చిత్రాలతో గుర్తింపు సంపాదించుకుంది. ఇలా ఒక నటిగానే కాకుండా.. తమను తాము ప్రేమించుకోవడం, తమ ఆలోచనలకు గౌరవం ఇవ్వడం వల్ల సంతోషంగా, సానుకూలంగా ఉండగలుగుతామని చెబుతూ తన ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతోందీ ఐస్‌క్రీమ్ బ్యూటీ.