‘ఏంటీ.. రోజురోజుకీ బాగా లావైపోతున్నావ్.. ఇలా లడ్డూలా తయారైతే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు?’, ‘మొహం నిండా ఆ మొటిమలేంటి.. మొన్నటిదాకా బాగానే ఉంది కదా!’, ‘అబ్బాయిలా నీకూ గడ్డం, మీసాలు పెరుగుతున్నాయి.. శరీరం విషయంలో చాలామంది మహిళలకు ఇలాంటి కామెంట్లు మామూలే. ఇలా కంటికి కనిపించిందని కామెంట్ చేస్తారు కానీ.. దాని వెనకున్న అసలు కారణమేంటో ఎవరూ అర్థం చేసుకోరు! ఇంతకీ ఈ సమస్యలన్నింటికీ మూలం ఏంటంటారా? అదే పీసీఓఎస్.. దీనివల్ల బయటికి కనిపించే ఇలాంటి లక్షణాలే వారిని నలుగురిలోకీ వెళ్లకుండా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఈ ఇబ్బందే తమ సమస్యను అందరితో చెప్పడానికి మొహమాటపడేలా చేస్తోంది.
కానీ కొందరు మొహమాటం అనే ఆ గీత దాటి ధైర్యంగా తమ సమస్య గురించి ప్రపంచానికి చాటి చెబుతుంటారు. అలాంటి వారిలో సామాన్యులే కాదు.. కొందరు సెలబ్రిటీలూ ఉన్నారు. తామూ పీసీఓఎస్ బాధితులమేనని, ఈ క్రమంలో తోటి వారి నుంచి విమర్శల్ని సైతం ఎదుర్కొన్నామంటూ పలు సందర్భాల్లో పంచుకున్నారు కూడా! సెప్టెంబర్ నెలను ‘ప్రపంచ పీసీఓఎస్ అవగాహన మాసం’గా జరుపుకుంటోన్న నేపథ్యంలో అలా కొందరు ముద్దుగుమ్మలు పంచుకున్న పీసీఓఎస్ స్టోరీస్ ఏంటో తెలుసుకొని మనమూ స్ఫూర్తి పొందుదాం!
అప్పుడు నాకు నేను నచ్చలేదు!
బాలీవుడ్ ఫ్యాషనిస్టాగా పేరుపొందిన సోనమ్ కపూర్ ఇండస్ట్రీలోకి రాకముందు ఎంతో బబ్లీగా ఉండేది. అయితే అందుకు పీసీఓఎస్ కూడా ఓ కారణమంటూ ఓ సందర్భంలో భాగంగా చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. ‘టీనేజ్‌లో ఉండగానే నాకు పీసీఓఎస్ సమస్య ఉందని తెలిసింది. దాంతో ఆరు నెలల్లోనే నేను 35 కిలోల దాకా బరువు పెరిగాను. అవాంఛిత రోమాలు, మొటిమలతో సతమతమయ్యా. ఆ సమయంలో నాకు నేనే నచ్చేదాన్ని కాదు. అమ్మకు ఆరోగ్యం, ఫిట్నెస్ విషయాల్లో అవగాహన ఎక్కువ. అలాంటిది నా గురించి తను ఎంతో బాధపడిందంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు.. పీసీఓఎస్ నా శరీరంపై ఎంతటి ప్రతికూల ప్రభావం చూపించిందో! ఇక ఇలా బాధపడితే లాభం లేదనుకున్న నేను.. ఎలాగైనా సరే బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా. అది కూడా ఆరోగ్యకరంగానే! ఈ క్రమంలో అమ్మ నాకు చాలా సహాయపడింది. నాకెంతో ఇష్టమైన జంక్ ఫుడ్, చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్.. వంటి వాటిపైకి నా మనసు మళ్లకుండా ఓ కచ్చితమైన డైట్ ప్లాన్ ఫాలో అయ్యేలా చేసింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు రోజూ యోగా చేయడం కూడా నాకు బాగా కలిసొచ్చింది. ఇక చక్కటి శరీరాకృతి కోసం కథక్ కూడా నేర్చుకున్నా. ఇలా రెండేళ్ల పాటు కచ్చితమైన ఆహార, వ్యాయామ నియమాలు పాటిస్తూ పెరిగిన బరువును తిరిగి తగ్గించుకోగలిగా..’ అంటూ చెప్పుకొచ్చింది సోనమ్.
పిజ్జాలు పిచ్చిపిచ్చిగా తినేదాన్ని!
పటౌడీ ప్రిన్సెస్ సారా అలీ ఖాన్ కూడా పీసీఓఎస్ బాధితురాలే! ఈ క్రమంలో తాను చాలా లావయ్యానని, ఇతర అనారోగ్యాలూ ఎదుర్కొన్నానంటూ సందర్భం వచ్చినప్పుడల్లా నిర్మొహమాటంగా చెబుతుంటుందీ బ్యూటీ. అంతేకాదు.. తాను లావుగా ఉన్నప్పటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎలా ఉన్నా తమను తాము స్వీకరించాలన్న స్ఫూర్తిదాయక సందేశం ఇస్తుంటుందీ చిన్నది.
‘సినిమాల్లోకి రాకముందు నా బరువు 96 కిలోలు. బహుశా.. నాకున్న పీసీఓఎస్ సమస్య వల్లే నేను అంత బరువు పెరిగి ఉంటా. దీనికి తోడు హార్మోన్ల అసమతుల్యత కూడా తలెత్తింది. అప్పట్లో ఖాళీ సమయం ఎక్కువగా ఉండేది కాబట్టి ఏది పడితే అది ఎక్కువగా తినేదాన్ని. కొలంబియాలో చదువుకోవడానికి వెళ్లినప్పుడు మా ఇంటికి దగ్గర్లో ఓ పిజ్జా షాపు ఉండేది. అందులోని పిజ్జాలంటే ప్రాణమిచ్చేదాన్ని. అయితే ఆ పక్కనే ఓ విటమిన్ షాపు కూడా ఉండేదన్న విషయం నేను బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాకే తెలిసిందంటే.. పిజ్జాలకు నేనెంతలా అలవాటు పడ్డానో మీరు అర్థం చేసుకోవచ్చు. నటనపై ఆసక్తిని గమనించాక ఎలాగైనా బరువు తగ్గాలని డిసైడయ్యా. ఈ క్రమంలో ఆ విటమిన్ షాపులోని సలాడ్లు, ప్రొటీన్ బార్స్.. వంటి పదార్థాలే నేను బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించాయి.. కథక్, యోగా, పిలాటిస్.. వంటి వర్కవుట్స్ కూడా నేను పెరిగిన బరువు తగ్గడానికి ఎంతో దోహదం చేశాయి.. అలా పీసీఓఎస్ నా జీవితంలో ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడేలా చేసింది’ అంటోంది సారా.
నా మనసుతో యుద్ధం చేసేదాన్ని!
ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా చెప్పే టాలీవుడ్ బ్యూటీ శృతీ హాసన్.. తన ఆరోగ్య సమస్యల్ని కూడా అందరితో పంచుకోవడానికి ఏమాత్రం వెనకాడదు. ఈ క్రమంలోనే తాను గతంలో హార్మోన్ల సమస్యలు, పీసీఓఎస్‌తో బాధపడ్డానని, దాని పర్యవసానాల ప్రభావం తనపై చాలానే ఉందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ చక్కనమ్మ.
‘నాకు 26 ఏళ్ల వయసులో పీసీఓఎస్ ఉందని తెలిసింది. ఆ సమయంలో నా శరీరంలో కలిగే మార్పులు, లక్షణాల గురించి గ్రహించినా.. వాటిని నేను అదుపు చేసుకోలేకపోయేదాన్ని. నా పట్ల నేనే అసౌకర్యంగా ఫీలయ్యేదాన్ని. అందంగా కనిపించట్లేదనే భావన నాలో ఏర్పడింది. ఇవన్నీ నన్ను మానసికంగా కుంగదీశాయి. ఈ సమస్యల్ని అధిగమించడానికి నాతో నేనే యుద్ధం చేసేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో నటన నాకు కాస్త ఊరటనిచ్చింది. షూటింగ్స్‌లో పాల్గొన్నంత సేపు నా పాత్ర, దానికి పూర్తి న్యాయం చేయడమెలా?.. అన్న విషయాల పైనే దృష్టి పెట్టేదాన్ని. ఆ బిజీలో పడిపోయి ఇతర విషయాలు నాకు గుర్తొచ్చేవి కాదు. కానీ పిరియడ్స్ వచ్చిన ప్రతిసారీ మాత్రం నాలో ఆందోళన విపరీతంగా పెరిగిపోయేది. నెలసరి నొప్పులు వేధించేవి. దాంతో ఆ రోజుల్లో డ్యాన్స్ షూట్స్, స్టేజీ పెర్ఫార్మెన్స్లేవీ ఉండకూడదని కోరుకునేదాన్ని. వీటి గురించి ఆలోచిస్తూ ఒక్కోసారి నేను డిప్రెషన్‌తో బాధపడుతున్నానేమో అనిపించేది.
గర్భనిరోధక మాత్రలు, ఈస్ట్రోజెన్ సప్లిమెంట్స్ వేసుకున్నా. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ట్రై చేశా.. ఏవీ వర్కవుట్ కాలేదు. హోమియోపతి, సహజసిద్ధమైన పద్ధతులు కొంతమంది మహిళలకు ఈ సమయంలో బాగా పనిచేస్తాయి. నా విషయంలో అదీ జరగలేదు. దాదాపు 10 కిలోల దాకా బరువు పెరిగా. దీనికి తోడు నా శరీరాకృతి గురించి ఇతరులు చేసే కామెంట్లు భరించలేకపోయేదాన్ని. ఇలా దాదాపు ఏడాది గడిచిపోయింది. ఇక లాభం లేదనుకొని నటన నుంచి కాస్త విరామం తీసుకొని పీసీఓఎస్‌కు చికిత్స తీసుకున్నా. నాలోని నెగెటివ్ ఆలోచనల్ని దూరం చేయడానికి థెరపిస్ట్ సలహాలు బాగా పనికొచ్చాయి. నెలసరి నొప్పుల్ని అదుపు చేసుకోవడానికి యోగా, స్క్వాట్స్.. వంటి వ్యాయామాల్ని నా లైఫ్స్టైల్లో భాగం చేసుకున్నా. ఇలా ఈ క్రమంలో మానసికంగా దృఢంగా ఎలా ఉండాలో నేర్చుకున్నా..’ అంటూ తన పీసీఓఎస్ స్టోరీని పంచుకుంది శృతి.
అదేంటో ముందు తెలుసుకోలేకపోయా!
‘బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్’ అనే వెబ్‌సిరీస్‌తో పాపులారిటీ సంపాదించింది హర్లీన్ సేథి. ఆపై వరుణ్ ధావన్‌తో కలిసి ఓ మ్యూజిక్ వీడియోలో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఇలా ఆన్‌స్క్రీన్‌లో తన గ్లామర్‌తో కట్టిపడేసే ఈ బ్యూటీ.. గతంలో తాను పీసీఓఎస్‌తో బాధపడినట్లు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.
‘నాకు 15 ఏళ్లున్నప్పుడు పలు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. ఎందుకిలా జరుగుతోందని ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్లా. కానీ ఎవరూ నా అసలు సమస్యేంటో గుర్తించలేకపోయారు. అప్పుడు అమ్మే హార్మోన్ల సమస్య ఉందేమోనని రక్తపరీక్ష చేయించుకోమంది. అందులో తెలిసింది నా సమస్య పీసీఓఎస్ అని! ఇది దీర్ఘకాలిక సమస్య. అయితే ఈ సమస్య నా జీవన శైలిలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. చక్కటి ఆహారపుటలవాట్లు అలవడేలా, వ్యాయామాలను నా రోజువారీ ప్రణాళికలో భాగం చేసుకునేలా చేసింది. అలాగే నా ఆలోచనా ధోరణిలోనూ మార్పులు తెచ్చింది..’ అంటూ పీసీఓఎస్‌తో తనకెదురైన అనుభవాలను గుదిగుచ్చిందీ ముద్దుగుమ్మ.
పాజిటివ్‌గా ఉండడమే సమస్యకు పరిష్కారం!
మోడల్‌గా, బిగ్‌బాస్-13 కంటెస్టెంట్‌గా అందరికీ సుపరిచితురాలైన హిమాన్షీ ఖురానా పంజాబీ చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే తన శరీరాకృతి గురించి సోషల్ మీడియాలో చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేసేవారని, కానీ పీసీఓఎస్ వల్లే ఆ బరువు పెరిగానన్న విషయం ఎవరూ అర్థం చేసుకోలేదని చెబుతోందీ సుందరి.
‘బిగ్‌బాస్-13లో పాల్గొనక ముందు, పాల్గొన్న తర్వాత సోషల్ మీడియాలో నన్ను విపరీతంగా ట్రోల్ చేశారు. నా శరీరాకృతి గురించి ఏవేవో కామెంట్లు చేసేవారు. నాకు పీసీఓఎస్ ఉంది.. ఈ విషయం ఎవరూ అర్థం చేసుకోకుండా ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు. దయచేసి అందరూ ఈ సమస్య గురించి ఆన్లైన్లో వెతకండి.. దీని పర్యవసానాలేంటో తెలుసుకోండి. ముఖ్యంగా అమ్మాయిలు పీసీఓఎస్ గురించి తప్పకుండా అవగాహన పెంచుకోవాలి. ఈ సమస్య కారణంగా ఒక్కోసారి ఎక్కువగా బరువు పెరిగిపోతాం.. ఒక్కోసారి ఊహించలేనంతగా తగ్గుతుంటాం. నా సమస్య కూడా అదే! దీనివల్ల నా బీపీలో కూడా హెచ్చుతగ్గులు ఏర్పడుతుంటాయి. ఇదిలా ఉంటే ఇతరులు అనే మాటలు నన్ను మానసికంగా మరింత ఇబ్బంది పెట్టేవి. దీన్నుంచి బయటపడడానికి సైకియాట్రిస్ట్‌ని కలిసి కౌన్సెలింగ్ తీసుకున్నా. పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టా. బరువు తగ్గడానికి రెండుసార్లు ఆపరేషన్ కూడా చేయించుకున్నా.. అలా బరువును అదుపులోకి తెచ్చుకున్నా. ఇప్పటికీ నా చుట్టూ పాజిటివ్ వ్యక్తులుండేలా జాగ్రత్తపడుతున్నా..’ అంటోందీ క్యూటీ.
అందుకే గడ్డం, మీసాలు తొలగించలేదు!
పీసీఓఎస్ ముఖంపై అవాంఛిత రోమాలు రావడానికి కూడా కారణమవుతుంది. అయితే చాలామంది ఇబ్బందిగా ఫీలై వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉంటారు. కానీ తాను మాత్రం అలా కాదని, తనెలా ఉన్నా తనని తాను ప్రేమించుకుంటానంటోంది మోడల్, యాక్టివిస్ట్, మోటివేషనల్ స్పీకర్ హర్నామ్ కౌర్. ఇంగ్లండ్‌కు చెందిన ఆమె పీసీఓఎస్ కారణంగా తన ముఖంపై పెరిగిన గడ్డం, మీసాలను తొలగించుకోకుండా అలాగే ఉంచుకోవడంతో పాటు.. తాను తీసుకున్న ప్రతి ఫొటోనూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బాడీ పాజిటివిటీని చాటుతుంటుంది.
‘12 ఏళ్ల వయసులో నాకు పీసీఓఎస్ ఉందని తెలిసింది. దీని ప్రభావంతో నాకు మీసాలు, గడ్డం రావడం మొదలైంది. ఇది చూసి చాలామంది నన్ను హేళన చేసేవారు. దీంతో మొదట్లో ఈ అవాంఛిత రోమాల్ని తీసేద్దామనుకున్నా. కానీ ‘ఇతరుల కోసం నేనెందుకు మారాలి.. నా శరీరాన్ని నేనెందుకు అసహ్యించుకోవాలి’ అనుకున్నా. అందుకే నాతో పాటే నా మీసాలు, గడ్డం పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు సమాజంలో నాకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఇక పీసీఓఎస్‌తో బాధపడుతోన్న మహిళలందరికీ నేను చెప్పదలచుకున్నది ఒక్కటే! దీని గురించి మీ మనసులోనే దాచుకొని కుంగిపోకండి. డాక్టర్ సలహాతో సరైన చికిత్స తీసుకోండి. ఈ సమస్య మానసికంగా కూడా కుంగదీస్తుంది. అలాగని ఆ ఫీలింగ్స్‌ని మీలోనే దాచుకుంటే సమస్య జఠిలమవుతుంది. కాబట్టి నలుగురితో పంచుకోండి. ఒకవేళ ఇతరుల నుంచి బాడీ షేమింగ్ ఎదురైనా ఆ మాటల్ని పట్టించుకోకండి. ఎవరి శరీరాన్ని వారు ప్రేమించుకోండి. ఇలా మీ ఆలోచనా ధోరణి మారినప్పుడే మిమ్మల్ని మీరు అంగీకరించగలుగుతారు..’ అంటూ చక్కటి సందేశంతో అందరిలో స్ఫూర్తి నింపుతోంది హర్నామ్.
పీసీఓఎస్ అనేది మనం కావాలని సృష్టించుకున్న సమస్య కాదు.. అలాంటప్పుడు మనమెందుకు బాధపడాలి? ఇతరులు అన్న మాటలు ఎందుకు పట్టించుకోవాలి? ఇది దీర్ఘకాలిక సమస్యే కావచ్చు.. కానీ చక్కటి లైఫ్‌స్టైల్‌తో, అవసరమైతే మందులతో, ప్రత్యేక చికిత్సలతో దీన్ని అదుపులో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో మీలో మీరే మధనపడిపోయి ఆందోళనకు గురవడం, ఆరోగ్యాన్ని మరింతగా పాడు చేసుకోవడం ఎంతమాత్రం కరక్ట్ కాదు. కాబట్టి బాధపడకుండా, ఇతరులేమనుకుంటారోనని వెనకడుగు వేయకుండా సమస్య నివారణ కోసం వైద్య నిపుణులను సంప్రదించండి. అలాగే- మీ పీసీఓఎస్ అనుభవాలను ‘వసుంధర.నెట్’ వేదికగా అందరితో పంచుకోండి.. మీ స్ఫూర్తితో మరో నలుగురు ముందుకొచ్చేలా వారిలో ధైర్యం నింపండి!
Also Read:
అమ్మ ప్రోత్సాహం వల్లే 35 కిలోలు తగ్గా!
96 కిలోల పిజ్జా గర్ల్ నుంచి ఫిట్టెస్ట్ గర్ల్‌గా ఇలా మారా!