పద్మాలక్ష్మి... ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్న ప్రముఖ మాజీ మోడల్. ప్రస్తుతం అమెరికన్ టీవీ ఛానల్స్‌లో టాప్ హోస్ట్‌గా పేరు సొంతం చేసుకున్న ఈ అందాల తార మంచి రచయిత్రి కూడా. సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందించే ఈ ప్రవాస భారతీయురాలు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం మహిళల్లో స్ఫూర్తి కలిగించే పోస్ట్‌లు షేర్ చేస్తుంటుంది. తాజాగా 50వ వసంతంలోకి అడుగుపెట్టిన పద్మ... తన పుట్టిన రోజును పురస్కరించుకుని సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బహుముఖ ప్రజ్ఞాశాలిగా!
పద్మాలక్ష్మి అసలు పేరు పద్మా పార్వతి లక్ష్మీ వైద్యనాథన్. చెన్నైలో పుట్టిన ఆమె నాలుగేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లిపోయింది. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి 21 ఏళ్ల వయసులోనే మోడలింగ్‌లోకి ప్రవేశించింది. నటిగానూ మెప్పించిన ఆమె ప్రస్తుతం బుల్లితెరపై తన హవా చూపిస్తోంది. పలు వంటల ప్రోగ్రామ్స్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ టాప్ హోస్ట్‌గా పేరు తెచ్చుకుంటోంది. ఇక తన ఆలోచనలకు ఎప్పటికప్పుడు అక్షర రూపమిచ్చే ఆమె ఇప్పటివరకు నాలుగు పుస్తకాలు కూడా రచించింది. 2004లో ఇండియాకే చెందిన ప్రముఖ నవలా రచయిత సల్మాన్రష్దీని పెళ్లి చేసుకున్న పద్మ..మూడేళ్లకే అతనితో విడిపోయింది. ఆ తర్వాత ఆడెమ్ డెల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమె 2010లో ఓ అమ్మాయికి జన్మనిచ్చింది.
30 ల్లోనే ఉన్నట్లుంది!
ప్రస్తుతం ‘టేస్ట్ ద నేషన్’ పేరుతో ఓ టాప్ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న పద్మ తన భర్త, పదేళ్ల కుమార్తెతో కలిసే ఉంటోంది. ఈ క్రమంలో ఇటీవల 50వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆమె తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా సముద్ర తీరంలో బికినీలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె ‘నాకు ఇంకా 30 ల్లోనే ఉన్నట్లుంది. ఇప్పుడే కొత్తగా జీవితాన్ని ప్రారంభించినట్లు ఉంది’ అనే క్యాప్షన్ ఇచ్చింది. నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కష్టాలతో పాటు మధురానుభూతులను మిగిల్చింది!
దీంతో పాటు ‘బర్త్ డే థాట్స్’ పేరుతో తన ఆలోచనలకు అక్షర రూపమిచ్చిన ఆమె ఇలా రాసుకొచ్చింది. ‘ఈ ఏడాది నాకు మిశ్రమ ఫలితాలనిచ్చింది. కన్నీళ్లు పెట్టిస్తూనే ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది. కొన్ని కొత్త వ్యాధులు, సంఘటనలు అందరినీ ఇబ్బందుల్లో పడేశాయి. అయితే ఈ ఆపత్కాల సమయం వ్యక్తిగతంగానూ, వృత్తిగతంగానూ నాకు ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపేందుకు, వారితో నా అనుబంధాన్ని మరింత దృఢంగా మార్చుకునేందుకు ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఇక ‘టేస్ట్ ద నేషన్’ షోతో నా ప్రతిభను మరోసారి ప్రపంచానికి పరిచయం చేశాను. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంతో ఆకట్టుకుంటోన్న ఈ ప్రోగ్రాంలో అమ్మతో కలిసి పాల్గొన్నాను. తద్వారా ఈ కష్టకాలంలో ప్రాణాలు కోల్పోయిన తల్లులందరికీ నా వంతు నివాళి అర్పించినట్లయింది. ప్రస్తుతం నేనెంతో సంతోషంగా ఉన్నాను. ప్రేమను పంచే భర్త, ఇంకా నా కూతురితో గడుపుతున్న క్షణాలను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. అయితే బాల్యం నుంచి నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎన్నో అవరోధాలను దాటి ఈ స్థాయికి వచ్చాను. ఈ అద్భుత ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన వారందరికీ నా ధన్యవాదాలు!’ అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చింది పద్మ.