కరోనా బారిన పడుతున్న సినీ తారల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, స్మిత, ఐశ్వర్యా అర్జున్, స్మిత, నిక్కీ గల్రానీ, రాజమౌళి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తేజ.. తదితరులు కరోనా బాధితుల జాబితాలో చేరిపోయారు. తాజాగా ప్రముఖ గాయని సునీత కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఫేస్బుక్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
ఆర్థిక పునరుజ్జీవనం అంటూ ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులివ్వడంతో అన్ని రంగాల్లో పనులు పునః ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సినిమా, సీరియల్స్ షూటింగులు కూడా మొదలయ్యాయి. దీంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాకుండా టాలీవుడ్లో మరో ఇద్దరు సింగర్లకూ కరోనా సోకిందని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై స్పందిస్తూ తాను కరోనా బారిన పడ్డానని ఫేస్బుక్ వేదికగా తెలిపింది సునీత.
అలా ఈ వ్యాధి నుంచి బయటపడ్డాను!
‘అందరికీ నమస్కారం. నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలని నా బంధువులు, స్నేహితులు, మీడియా నుంచి వరుస ఫోన్ కాల్స్, మెసేజ్లు వస్తున్నాయి. వారందరికీ నా ధన్యవాదాలు. ఈ విషయంపై అప్డేట్ ఇచ్చేందుకే ఇలా మీ ముందుకొచ్చాను. కొద్ది రోజుల క్రితం నేను కరోనా బారిన పడిన మాట వాస్తవమే. ఒక షూటింగ్కు వెళ్తే కొంచెం తలనొప్పిగా అనిపించింది. అయినా అశ్రద్ధ చేయకుండా నా తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని కరోనా టెస్ట్ చేయించుకున్నా. దురదృష్టవశాత్తూ నాకు కొవిడ్ సోకిందని నిర్ధారితమైంది. అయితే నాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. సాధారణ జీవితంలో అలాంటివి మనం అసలు లెక్క చేసే వాళ్లం కాదు. ఇప్పుడు నేను పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నాను. ఎంతో హెల్దీగా ఉన్నాను. హోం ఐసోలేషన్లో ఉండి ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహాలు తీసుకుంటూ, జాగ్రత్తలు పాటిస్తూ, వ్యాధి నుంచి బయటపడ్డాను. ఇదే విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. అయితే, ఇప్పుడు నేను బాలు గారి ఆరోగ్యం విషయంలో చాలా ఆందోళనగా ఉన్నాను. నాతో పాటు మా ఫ్యామిలీ అంతా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. మనందరమూ ఆయన తర్వగా కోలుకోవాలని కోరుకుందాం. మీరందరూ కూడా సురక్షితంగా ఉండండి. ఈ మహమ్మారితో పోరాటం అంత సులువైనది కాదు. నాకు చాలా స్వల్ప లక్షణాలు ఉండడం వల్ల త్వరగా కోలుకున్నాను. నాపై చూపిన ప్రేమాభిమానాలకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు’ అని వీడియోలో చెప్పుకొచ్చారీ స్టార్ సింగర్.