కరోనా సృష్టించిన ఈ కల్లోల పరిస్థితుల్లో కనీసం కంఫర్ట్ జోన్లో ఉండి మన పనులు మనం చేసుకునే వెసులుబాటైనా మనకుంది.. అదే వైద్యులు, వైద్య సిబ్బంది, నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వాళ్లు, ఇతర అత్యవసర సేవల్లో భాగమయ్యే వారు వైరస్ ముప్పు పొంచి ఉందని తెలిసినా కచ్చితంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సిందే! అలాంటి కరోనా యోధుల సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే మన క్షేమాన్ని కాంక్షిస్తూ మనకు సకల సదుపాయాలు సమకూర్చుతోన్న అలాంటి వారియర్స్ కోసం మన వంతుగా సహాయసహకారాలు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని చెబుతోంది మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్. కేవలం చెప్పడమే కాదు.. కరోనా యోధులకు అండగా నిలబడేందుకు తాను కూడా ఓ స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపానని ఓ చిన్న వీడియో ద్వారా పంచుకుందీ మాజీ మిస్ వరల్డ్. మరి, కరోనాపై పోరులో ముందుండి పోరాడుతోన్న యోధులకు ఈ ముద్దుగుమ్మ చేస్తోన్న సాయమేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!
మానుషీ చిల్లర్.. తన బాహ్య సౌందర్యంతో పాటు అంతః సౌందర్యాన్ని చాటుకొని 2017లో ప్రపంచ సుందరిగా అవతరించిందీ ముద్దుగుమ్మ. అంతకుముందు నుంచే ‘శక్తి’ పేరుతో ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి వ్యక్తిగత శుభ్రత గురించి మహిళల్లో అవగాహన కల్పిస్తోందీ బ్యూటీ. ఈ క్రమంలోనే పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి గ్రామీణ మహిళలకు శ్యానిటరీ న్యాప్కిన్లను అందించే బృహత్తర బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. అంతేకాదు.. తాను ప్రపంచ సుందరిగా నిలిచిన తర్వాత కూడా చాలా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ భాగమైంది మానుషి. ఇక కరోనా సమయంలో యునిసెఫ్‌తో చేతులు కలిపి ఈ మహమ్మారి గురించి అందరిలో అవగాహన కల్పించిన ఈ హరియాణా బ్యూటీ.. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో పేద మహిళలకు ఉచితంగా శ్యానిటరీ న్యాప్కిన్లు అందించాలని ప్రభుత్వాలను కోరింది. ఇక ఇప్పుడు కరోనాతో ముందుండి పోరాటం సాగిస్తోన్న యోధులకు తన వంతు సహాయం అందించడానికి మరోసారి తెరపైకొచ్చి తన వెన్నలాంటి మనసును చాటుకుందీ లవ్లీ గర్ల్.
తన పెయింటింగ్ విద్యతో..!
మానుషిలో ఇప్పటివరకు అందం, అణకువ, సేవ.. మొదలైన వాటినే మనం చూశాం.. కానీ తనలో ఓ గొప్ప చిత్రలేఖన కళాకారిణి కూడా దాగుందని తాజాగా నిరూపించిందీ బ్యూటీ. అవును.. తనో అద్భుతమైన పెయింటర్! ఆ కళనే కరోనా యోధులకు చేయూతనందించడానికి ప్లస్ పాయింట్‌గా మార్చుకుంది మానుషి. ఇలా తను వేసిన అందమైన పెయింటింగ్స్‌ని విక్రయించడానికి ‘స్మైల్ ఫౌండేషన్’తో చేతులు కలిపిందీ సుందరి. ఈ క్రమంలోనే ‘ఆర్ట్ వర్క్ ఫర్ హార్ట్ వర్క్’ పేరుతో ఆన్లైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోన్న ఆమె.. వేలంలో భాగంగా పోగైన డబ్బుతో తమ ప్రాణాల్ని పణంగా పెట్టి మన క్షేమాన్ని కాంక్షిస్తోన్న కరోనా యోధులకు వ్యక్తిగత పరిశుభ్రతా కిట్లు, ఇతర వస్తువులు అందించేందుకు వినియోగిస్తానంటోంది.
అందుకే వాళ్లతో చేతులు కలిపాను!
ఇలా తన సేవా కార్యక్రమం గురించి ఓ చిన్న వీడియో రూపొందించి ఇన్‌స్టాలో పంచుకుందీ ముద్దుగుమ్మ. ‘ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో మనందరం ఇంట్లోనే ఉంటూ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తపడుతున్నాం. కానీ రైతులు, ట్రక్ డ్రైవర్స్.. వంటి కరోనా యోధులు మాత్రం క్షేత్రస్థాయిలో తమ విధులు నిర్వర్తిస్తున్నారు. మనకు కావాల్సిన వస్తువుల్ని మన ముంగిట్లోకి చేరుస్తున్నారు. నిజానికి వాళ్లు చేస్తోంది హార్డ్‌వర్క్ మాత్రమే కాదు.. హార్ట్ వర్క్ (నిస్వార్థమైన హృదయపూర్వకమైన సేవ)! అందుకే వాళ్లందరికీ నా వంతుగా సహాయపడాలని నిర్ణయించుకున్నా. నా చిత్రలేఖన కళ ద్వారా నా ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు అడుగులేస్తున్నా. ఇందుకోసమే స్మైల్ ఫౌండేషన్‌తో చేతులు కలిపాను. వాళ్లతో కలిసి ఈ కరోనా యోధులకు వ్యక్తిగత పరిశుభ్రతా కిట్లను పంపిణీ చేసే బృహత్కార్యంలో భాగమయ్యాను. మీరూ ఇందులో పాలు పంచుకోవాలనుకుంటే www.theheartwork.support అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. నేను వేసిన అందమైన పెయింటింగ్స్ ఇవి. నా ఆర్ట్ వర్క్ కలెక్షన్‌ను మీరు https://www.artandfound.co/ వెబ్సైట్లో చూడచ్చు.. కొనుగోలు చేయచ్చు.. తద్వారా మీరూ మీ వంతుగా కరోనా హీరోలకు సహాయపడచ్చు. రండి.. అందరం చేతులు కలుపుదాం.. ప్రతికూలతలకు ఎదురొడ్డి సేవలందిస్తోన్న ఎందరో యోధులకు అండగా ఉందాం..!’ అంటూ వీడియోలో భాగంగా చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
ఇలా తన వెన్నలాంటి మనసును మరోసారి చాటుకుంది మానుషి. తన సేవా కార్యక్రమాలతో అందరి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఈ హరియాణా సుందరి.. త్వరలోనే వెండితెర పైనా ప్రత్యక్షమయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన ‘పృథ్వీరాజ్’ సినిమాలో నటిస్తోందీ అందం. ఈ చిత్రం ఈ ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read:
దూరంగా ఉంటే వారి మంచి కోరుకున్నట్లే!
నిత్యావసరాలు సరే... శానిటరీ న్యాప్కిన్ల సంగతేంటి?