‘అన్‌లాక్’ అంటూ ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులివ్వడంతో కరోనా తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. తారతమ్యాలేవీ చూపించకుండా అందరిపై విరుచుకుపడుతోంది. అందుకే అప్రమత్తంగా ఉంటూ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే... సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్ బాధితుల జాబితాలో చేరిపోతున్నారు. తాజాగా మాజీ మిస్ ఇండియా వరల్డ్, బాలీవుడ్ నటి నటాషా సూరి ఈ మహమ్మారి బారిన పడింది. ఈ సందర్భంగా హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న ఆమె త్వరలోనే కరోనాపై విజయం సాధిస్తానంటూ తన అభిమానుల్లో ధైర్యం నింపింది.
లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా సినిమా షూటింగులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో చాలామంది సినీతారలు మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటూ షూటింగులకు హాజరవుతున్నారు. ఇదేక్రమంలో దురదృష్టవశాత్తూ కరోనా బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘డేంజరస్’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నటాషా కరోనా బాధితుల జాబితాలో చేరిపోయింది. ఇటీవల నిర్వహించిన కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో ఆమెకు కరోనా సోకిందని తేలింది.
అక్కడి నుంచి తిరిగొచ్చాక!
‘ఓ అత్యవసర పని కోసం కొద్ది రోజుల క్రితం పుణెకి వెళ్లాను. ఆగస్టు 3న అక్కడి నుంచి తిరిగొచ్చిన వెంటనే అనారోగ్యానికి గురయ్యాను. జ్వరం, గొంతు నొప్పి తీవ్రంగా బాధించాయి. శరీరమంతా చాలా నిస్సత్తువగా అనిపించింది. దీంతో అనుమానమొచ్చి మూడు రోజుల క్రితం కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నాను. రోగ నిరోధక శక్తిని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికీ జ్వరం విడవలేదు. ఒంట్లో ఇంకా నీరసంగానే ఉంది. నాతో కలిసి ఉన్న అమ్మమ్మ, సోదరి కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వాటి రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది నటాషా.
మోడలింగ్ నుంచి మొదలై...
ముంబయికి చెందిన నటాషా మోడలింగ్‌లోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా 2005లో ‘నవీ క్వీన్’ కిరీటాన్ని గెలుచుకున్న ఆమె అదే ఏడాది ‘మిస్ మహారాష్ట్ర’ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2006లో ‘మిస్ ఇండియా వరల్డ్ ’ పోటీల్లో పాల్గొని టైటిల్‌తో పాటు ‘మిస్ బ్యూటిఫుల్ స్మైల్’, ‘మిస్ పర్సనాలిటీ’ అవార్డులు కూడా అందుకుంది. అప్పుడే అందరి దృష్టిని ఆకర్షించిన నటాషా అదే ఏడాది జరిగిన ‘మిస్ వరల్డ్’ కంటెస్ట్‌లో టాప్-10లో నిలిచింది. వీటితో పాటు రోమ్, దుబాయి, అమెజాన్ ఇండియా, లాక్మే వంటి ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వీక్ కంటెస్ట్‌లలో ర్యాంప్ వాక్ చేసి సత్తా చాటిందీ ముద్దుగుమ్మ. అంతేకాదు తన ప్రతిభతో తరుణ్ తహ్లియానీ, రోహిత్ బాల్, సునీత్ వర్మ, నీతా లుల్లా వంటి టాప్ డిజైనర్లకు మోడలింగ్ చేసింది.
అలా అందాల పోటీల్లో ప్రతిభ చూపిన నటాషా 2016లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘కింగ్ లయర్’ చిత్రంలో మొదటిసారే మలయాళ సూపర్‌స్టార్ దిలీప్ సరసన నటించి పలువురి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ‘ఇన్సైడ్ ఎడ్జ్’, ‘వర్జిన్ భానుప్రియ’ లాంటి సినిమాల్లోను మెరిసింది. ప్రస్తుతం బిపాసాబసు లీడ్ రోల్లో నటిస్తోన్న ‘డేంజరస్’ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది నటాషా. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 14న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అందుకే మూవీ ప్రమోషన్‌కు దూరంగా ఉండిపోయా!
‘నేను నటించిన ‘డేంజరస్’ మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో బిపాసా బసు లాంటి అద్భుతమైన నటితో నేను స్ర్కీన్ షేర్ చేసుకున్నాను. మా బృందం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే దురదృష్టవశాత్తూ నేను కరోనా బారిన పడ్డాను. దీంతో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయాను’ అని ఈ సందర్భంగా తెలిపింది నటాషా.
Photo: Instagram